తప్పు చేసిన వాళ్లల్లో ఎలాంటి అపరాధభావన లేని వాళ్లు ఎలాగోలా సాక్ష్యాలని కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తారు. ఆ కొందర్లో బాగా పలుకుబడి ఉన్న వాళ్లకైతే ఆ పని చాలా సులువు కూడా. ఒక్కోసారి ఎంత పలుకుబడి ఉన్నా, ఘనమైన నేపథ్యం ఉన్నా పాపాలనుంచి బయటపడడం సాధ్యం కాదు. సాక్షాత్తూ మాజీ ప్రధాని మంత్రి, మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కుటుంబానికే చెందిన వ్యక్తి అయినా సరే.. పాపాలు వెలుగుచూసిన తరువాత చేసిన తప్పుకి శిక్ష అనుభవించక తప్పదు. అలాంటి పరిస్థితికి ఉదాహరణ ప్రజ్వల్ రేవణ్ణ.
ఒకప్పట్లో ప్రధాని మంత్రిగా పనిచేసిన దేవేగౌడకి మనవడిగా, ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా పనిచేస్తున్న కుమారస్వామికి అన్న కొడుకు! రాజకీయంగా ఇంత పలుకుబడి ఉంది. ఈ పలుకుబడి రాజకీయాల్లో ఉపయోగపడుతుందే తప్ప, చట్టాలని ఉల్లంఘించేందుకు అనుమతి ఇవ్వదు. ప్రజ్వల్ రేవణ్ణ అంటే ఒక సెలెబ్రిటీ లానే భావించాలి. మొన్నటిదాకా కర్నాటక వరకు బాగా తెలిసిన పేరైతే, ఇప్పుడు దేశంలోనే కాదు, ఇంటర్నేషనల్ గా ఒక రేపిస్ట్ అని, ఇంటర్ పోల్ బ్లూ కార్నర్ నోటీస్ తో అందరికీ అతనెవరో తెలిసిపోయింది. మాజీ ఎమ్యెల్యే రేవణ్ణ తండ్రే.. ‘చేసిన తప్పులు నిరూపించబడితే, ప్రజ్వల్ ను ఉరి తీయించాలి’ అని కోరడం గమనించాల్సిన సంగతి!
ఒక మనిషి చేసే తప్పులు, నేరాలకు అతని సంపద, సామాజిక హోదా, అధికారం ఇవన్నీ అదనపు ప్రేరేపణ అంశాలు అవుతాయి. అవి ఉన్నవాళ్లంతా నేరాలు చేస్తారని కాదు. కానీ, నేరాలు చేయదలచుకున్న వారికి అవి కూడా జత కలిస్తే.. అగ్నికి ఆజ్యం చేకరినట్టే. ఎంత ఎక్కువ ఉంటే అంత పెద్ద నేరం చేయొచ్చు. కానీ రేప్ అనేది ఎలాంటి హవా ఉన్నా తప్పించుకోగలిగే నేరం కాదు. సాధారణంగా కాస్త పేరున్న వారు అలాంటి వాటి జోలికెళ్లరు. ప్రజ్వల్ రేవణ్ణకు ఉన్న అహంకారం ఎంత శృతిమించిన వ్యవహారం అంటే.. రేప్ చేయటమే కాకుండా, మళ్లీ దాన్ని వీడియోలు కూడా తీశాడు. చివరికి ఆ వీడియోలే తన డిఫెన్స్ దారుణంగా దెబ్బతీసింది.
రేప్ అనేది వినేందుకు ఈమధ్యకాలంలో బాగా రొటీన్ అయినప్పటికీ, విన్న ప్రతీసారీ ఒక బాధ కలుగుతుంది. ఎలెక్షన్స్ కి ఇంకా కొన్ని రోజులున్న సమయంలో ప్రజ్వల్ చేసిన వీడియోలు లీక్ అయ్యాయి. ఆ వీడియోలు పెన్ డ్రైవ్‌ల్లో పెట్టి రోడ్డు మీద అక్కడక్కడా వేశారు. ఇదంతా తమని ఎన్నికల్లో ఓడించాలనే ప్రయత్నం అని ప్రజ్వల్ రేవణ్ణ ఎలెక్షన్ ఏజెంట్ ఎఫ్ఫైఆర్ నమోదు చేసింది. వీడియోల్లో తన మోహం అంత తెలియకపోయినా మొదటిగా వచ్చిన కేసు లో ఒక 48ఏళ్ల మహిళను డీఎన్‌ఏ టెస్టు చేయడంతో ప్రజ్వల్ రేవణ్ణే రేప్ చేశాడని తెలిసింది. ప్రజ్వల్ రేవణ్ణ నలుగురిని రేప్ చేసినట్టు ఆగస్ట్ 1న కోర్టు నిందితుడిగా తేల్చింది.
2024 ఏప్రిల్ లో మొదలైన ఈ కేసు 2025 ఆగస్ట్ వరకు నడిచింది. ఈ మధ్యలో ఎలక్షన్స్ అయిన వెంటనే డిప్లమాట్ పాస్ పోర్ట్ తో రేవణ్ణ జర్మనీ కి వెళ్లిపోవడం, తిరిగి రాగానే పోలీసులు పట్టుకోవడం అంతా నేరం నిర్ధారణ కాక ముందే జరిగింది. ఆశ్చర్యమేమిటంటే, డీఎన్ ఏ టెస్టుతో సహా అన్నీ ప్రజ్వలే క్రిమినల్ అని కేసు ఆఖరికి వచ్చినా ప్రజ్వల్ తల్లి భవాని మాత్రం కొడుకు నిర్దోషి అని నమ్మింది. రేవణ్ణ న్యాయవాదిని మార్చుకునేందుకు ఇంకాస్త సమయం కావాలని కోర్టును కోరింది. ఒక అమ్మకి తన కొడుుకు అలాంటి ఘోరమైన పని చేశాడు ‘అంటేనే’ తట్టుకోవడం మామూలు పని కాదు. అలాంటిది కొడుకుదే తప్పు అని తెలిశాక ఎలాంటి నిరాశకి గురౌతుందో మామూలు ప్రజల ఊహలకందదు. మనకి ఏమైనా జరిగినా, మనం ఏమైనా చేసినా ‘మోస్ట్ అఫెక్టెడ్ పర్సన్ ఒకరుంటారు. జీవితంలో అలాంటోళ్లు ఎంతమంది వచ్చినా ఆఖరిదాకా అఫెక్ట్ అయ్యే పర్సన్ అమ్మే. కనీసం అలాంటిదైనా మనసులో పెట్టుకుంటే ఇలాంటి తప్పులు జరగవు అని అనుకుంటున్నాను.
పాతాళంలోకి పతనం..
కర్నాటకలోని ఒక అత్యున్నత రాజకీయ కుటుంబానికి చెందిన వ్యక్తి. ఎంపీ అంటే చిన్న విషయం కాదు. అలవెన్సులు అన్నీ కలుపుకుంటే నెలకు అధికారికంగా ప్రభుత్వం చెల్లించే జీతమే 2.8 లక్షల దాకా ఉంటుంది. ఇంచుమించుగా ఒక రోజుకు 9వేల రూపాయల వేతనం కింద లెక్క. కానీ.. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? కుటుంబ నేపథ్యం, ఎంపీగా హోదా అన్నీ గంగలో కలిసిపోయాయి. రేవణ్ణ ఒక దినకూలీ కింద లెక్క. అది కూడా జైలులో ‘నైపుణ్యం లేని కార్మికుడు’ అనే హోదాలో.. కేవలం రోజుకు 522 రూపాయలు మాత్రం సంపాదిస్తున్న నేరస్తుడు!
కొసమెరుపేంటంటే, తను రేప్ చేసిన కేసుల్లో మెదటిగా బయటపడిన 48ఏళ్ల మహిళ కేసులో బాధితురాలు ఒక సాధారణ రైతు కూలీ. ఒక మహిళ రైతుకూలీకి ఒక రోజు కూలీ కొంచెం అంటు ఇటుగా రూ. 500 వస్తుండవచ్చు. ప్రజ్వల్ రేవణ్ణ తను చేసిన పాపాలకు.. ఇంచుమించుగా అదే స్థాయికి, అదే సంపాదనకు, దాదాపుగా అథఃపాతాళానికి దిగజారిపోయాడు. సంపదలు, కుటుంబనేపథ్యం హోదాలు ఎన్ని ఉన్నా.. దారితప్పిన వ్యక్తిత్వమే దీనంతటికీ కారణం అని చెప్పాలి.
.. ఆదర్శిని భారతీకృష్ణ
Discussion about this post