‘‘సిరివెన్నెల గారిని ప్రశ్నలు అడగదలిచిన విద్యార్థులు ముందుగా ఎవరికి వారు తమ పేరు, ఊరు చెప్పి పరిచయం చేసుకోండి. నేను మొదటి ప్రశ్న అడిగి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాను. నా పేరు..’’ అంటూ నేను పేరు ఊరు చెప్పి నన్ను నేను పరిచయం చేసుకునేసరికి సిరివెన్నెల సీతారామశాస్త్రి నిండుపున్నమి చంద్రుడిలా నవ్వేశారు. విద్యార్థులకు చెప్పిన సూచననే నేనూ పాటించడం ఆయనకు ఆనందం కలిగించింది.
‘మీ పాటల వెనకున్న కెమిస్ట్రీ ఏమిటి?’ అనే నా ప్రశ్నతో ఆనాటి సిరివెన్నెలతో ముఖాముఖి కార్యక్రమం మొదలైంది. అప్పటి వరకు పాటల రచయితగా తన సుదీర్ఘ ప్రస్థానాన్ని సిరివెన్నెల ఆత్మీయంగా పంచుకున్నారు. రచన జర్నలిజం కాలేజి ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్న రోజుల్లో ఆకెళ్ల రాఘవేంద్ర సహకారంతో సిరివెన్నెలను కాలేజికి ఆహ్వానించాం.
జర్నలిజం పి.జి. డిప్లమా విద్యార్థుల కాంటాక్ట్ క్లాసెస్‌లో ప్రముఖుడితో ముఖాముఖి అనే కార్యక్రమానికి సిరివెన్నెల వచ్చారు. ఆరోజు మూడు గంటలకు పైగా మాతో గడిపారు. ఈ కార్యక్రమం పూర్తయ్యాక నా రూమ్‌కి వచ్చి కూచున్నారు. నేను ప్రచురించిన పుస్తకాలు సిరివెన్నెలకు ప్రజంట్ చేశాను
‘మా కాలేజికి సిరివెన్నెల వస్తున్నారు’ అని మా అబ్బాయి రఘువంశీతో అంతకు ముందురోజు చెప్పాను. సిరివెన్నెల పాటల వీరాభిమాని అయిన మా వాడు ఆయనను కలుసుకోవటానికి వచ్చాడు. మా అబ్బాయి ఎం.సి.ఎ. చేస్తూ సినిమా పాటల మీద కూడా అభిరుచి పెంచుకుని రాస్తుండేవాడు.
కొంతసేపు నా రూములో కూచుని కబుర్లు చెప్పిన సిరివెన్నెల సిగరెట్ తాగటానికి అనువుగా ఉంటుందని బిల్డింగ్ వెనక ఖాళీస్థలం వైపు నడిచారు. అక్కడకు కుర్చీలు తెప్పించి వేయించి మరోసారి స్ట్రాంగ్ కాఫీ సర్వ్ చేయించాను. ఆ కాఫీ తాగుతూ సిగరెట్టు దమ్ము లాగుతూ మా అబ్బాయితో మాటల్లో పడ్డారు.
also read : విరివెన్నెల : ఆశలు విత్తి.. జీవితాలను మొలకెత్తించి..
సిరివెన్నెల పాటలలోని లోతులను మా అబ్బాయి ఆయనకే వివరించి చెప్తుంటే కళ్లప్పగించి చూస్తుండిపోయాను.
‘మా కుర్రవాడు సాఫ్ట్‌వేర్ ఫీల్డ్ అయినా ఈ మధ్య పాటలూ రాస్తు’న్నాడంటే-
మా అబ్బాయి నుదుటిమీద జుత్తును స్వయంగా తనే పైకి నెట్టి ముఖాన్ని వివరంగా చూస్తూ- ‘మీ వాడి పాటల మాటేమో గానీ హీరో కాగల ముఖవర్చస్సు ఉంది’ అంటుంటే పుత్రోత్సాహంతో మనసు ఉప్పొంగింది.
మరో సందర్భంలో మా అబ్బాయిని తీసుకుని వాడు రాసిన పాటలు చూపిద్దామని సిరివెన్నెల ఇంటికి వెళ్లాను.
మా వాడు రాసిన పాటలు చదివి ‘సినిమా పాట’ ఒడుపు పట్టుకున్నాడు. అవకాశాలు అందిపుచ్చుకుంటూ కృషి చేస్తూ ముందుకు వెళ్లడమే’ అన్నారు.
‘‘పాటల రచయితకు సాహిత్య అధ్యయనం అవసరం కదా. ఇందాక మీరే చెప్పారు. ఒక పాటలో క్రైస్తవ సంప్రదాయానికి తగ్గట్టు ద్రాక్ష తోటను తీసుకు వచ్చాను అని. ఇలాంటపుడు బైబిల్ వంటి గ్రంథాల పఠనం అవసరం లేదా?’’ అనే ధర్మ సందేహం వ్యక్తం చేశాను.
also read : హృదయాన్ని కదిలించే ‘వెన్నెల సిరి’
‘ఆ అవసరం వచ్చినప్పుడు రిఫర్ చేస్తారు. ముందునుంచే చదువుతూ కూర్చోలేరు గదా’ అన్నారు సిరివెన్నెల నా సందేహ నివృత్తి చేస్తూ.
ఇంకో సందర్భంలో సిరివెన్నెలను గోల్కొండ హోటల్‌లో కలిశాను. నాతో పాటు ఆకెళ్ల రాఘవేంద్ర, మా అబ్బాయి కూడా ఉన్నారు.
పాటలు రాయడం కోసమే ఆ హోటల్‌లో ఆయన విడిది చేసి ఉన్నారు. తను రాస్తున్న పాటను రాసినంత వరకూ రాగయుక్తంగా పాడి విన్పించారు. ఒక్కోసారి ఒక పాటకు ముప్పై నలభై వెర్షన్లు కూడా రాస్తుంటాను అన్నారాయన.
‘మీ కలర్ ఫోటోతో ఒక విజిటింగ్ కార్డు ప్రింట్ చేయించి ఇస్తాను’ అని చెప్పగా సరేనన్నారు. కార్డు బ్యాక్ గ్రౌండ్ కలర్ మాత్రం స్కైబ్లూ ఉండేట్లు చూడండి అన్నారు.
also read : సిరివెన్నెల ఈ తరం అన్నమయ్య.. ఎలాగంటే?
పుస్తకాల కవర్ పేజీలను మల్టి కలర్ లో ప్రింట్ చేయించేప్పుడు ఆ కార్డులో పుస్తకం కవర్ పోను కొంత సన్నటి ముక్క వేస్ట్ గా తేలేది. ఆ ఖాళీని వృథాగా పోనివ్వకుండా తెలిసిన వారికి విజిటింగ్ కార్డులు డిజైన్ చేయించి, కవర్ పేజీలతో కలిపి ప్రింట్ చేయించి ఇస్తుండేవాణ్ని.
సిరివెన్నెల కోసం ఆయన చెప్పిన కలర్ స్కీమ్ లోనే విజిటింగ్ కార్డులు వెయ్యి ప్రింట్ చేయించి ఇచ్చాను. కార్డును చూడగానే ‘నేనడిగిన స్కై బ్లూ కలర్ ఇదే’నని సంతృప్తి చెందారు.
సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇక లేరన్న వార్తతో ఆయన స్మృతులు కళ్లముందు మెదిలాయి.
‘సిరివెన్నెలకు సిగరెట్ అలవాటు లేకుండా ఉండి ఉంటే మరో ఇరవై ఏళ్లు జీవించి ఉండేవారు’ అని మా అబ్బాయి రఘువంశీ కామెంట్.
‘కావచ్చు. ఆ అలవాటే లేకుంటే అంతటి మహత్తరమైన పాటలు ఆయన కలం నుంచి వచ్చేవి కూడా కావేమో?’ అన్నాను.
తనను తాను కొవ్వొత్తిలా కరిగించుకుంటూ తెలుగు సినిమా పాటకు కొత్త వెలుగును ఇచ్చారు.
ఆ పాటలే సిరివెన్నెలను బతికిస్తాయి, చిరంజీవిగా నిలుపుతాయి. భౌతికంగా మాత్రమే ఆయన మన మధ్య లేరు, అంతే.
.. గోవిందరాజు చక్రధర్
Discussion about this post