ఆయనేమో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీదనే గెలిచిన ఎంపీ. కానీ.. వర్తమానంలో మాత్రం.. సీఎం జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తూ ఉన్నారు. ఆచరణలో ఏమాత్రం సాధ్యం కాదని తెలిసినా.. కేవలం సీఎం ను చికాకుపెట్టడం, బజారుకు లాగడం. వార్తల్లో ఆయన గురించి నెగటివ్ ప్రచారం నిరంతరాయంగా వస్తూ ఉండడమే లక్ష్యంగా ఏదో ఒక యాక్టివిటీ చేస్తూనే ఉంటారు. అయితే ఆయన ప్రయత్నాలకు హైకోర్టు నుంచి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
హైకోర్టు ఆయనకు ఒక రేంజిలో అక్షింతలు వేసింది. ఊపిరాడనివ్వని ప్రశ్నలతో ఏకేసింది. జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఊరట కలిగించే రీతిలో వ్యాఖ్యలు చేసింది. తీర్పు మాత్రం ఇంకా వెలువడలేదు. జగన్మోహన్ రెడ్డి కేసులకు, బెయిల్ కు సంబంధించి.. ఇదొక కీలక పరిణామం. వివరాల్లోకి వెళితే..
వైసీపీ నరసాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు వేసిన పిటిషన్ కు విచారణార్హత ఉన్నదా లేదా అనే విషయంలో హైకోర్టు ఎదుట జరిగిన వాదోపవాదాల సందర్భంగా ఆసక్తికరమైన చర్చ జరిగింది. ఉభయపక్షాల వాదనలను హైకోర్టు వినడం పూర్తయింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఈ సందర్భంగా రఘురామక్రిష్ణ రాజు న్యాయవాదికి అనేక ప్రశ్నలు సంధించారు. రాజకీయ కక్షలు తీర్చుకోవడానికి కోర్టును వేదికగా చేసుకోవాలనుకుంటున్నారా? అంటూ ఒక రేంజిలో కడిగిపారేశారు.
జగన్మోహన్ రెడ్డితో సున్నం పెట్టుకున్న నాటినుంచి ఆర్ఆర్ఆర్.. అనేక రకాలుగా.. ఆయనను ఇబ్బందిపెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల్లో కూడా ఎవ్వరూ చేయనివిధంగా.. రచ్చబండ అంటూ యూట్యూబ్ లైవ్ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని ఉతికి ఆరేస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీద ఏపీలో పోలీసు కేసులు నమోదు కావడమూ.. ఆయనను అరెస్టు చేయడమూ.. ఆ తర్వాత.. ఆయన బెయిల్ పై ప్రస్తుతం బయట తిరుగుతుండడమూ జరిగింది. ‘‘బెయిల్ పై బయటి ఉన్న వ్యక్తి’’ అనే హోదా ప్రకారం ఇప్పుడు జగన్, రఘురామ ఇద్దరూ ఒకటే అయిపోయారు. అప్పటిదాకా ప్రభుత్వ పథకాలను విమర్శించడమూ.. ప్రభుత్వాన్ని తూర్పారపట్టడమూ పరంగా అనేక చికాకులు పెట్టిన ఆర్ఆర్ఆర్.. డైరక్టుగా జగన్ కు ఉన్న బెయిల్ మీదనే తన బాణం లఎక్కు పెట్టారు.
ఆయన బెయిల్ రద్దు చేయాలని, బెయిల్ మీద బయట ఉండడం వలన సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, ప్రలోభ పెడుతున్నారని రకరకాల ఆరోపణలతో గతంలో సీబీఐ కోర్టు ఎదుట పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్ ను కూలంకషంగా విచారించిన సీబీఐ కోర్టు దానిని కొట్టిపారేసింది. నిజానికి అది కోర్టు ఎదుట నిలబడే పిటిషన్ కాదని.. ఎవరికో బెయిల్ ఇస్తే.. ఆ కేసును విచారణ చేస్తున్న సంస్థకు లేని అభ్యంతరాలు మూడో వ్యక్తికి ఎందుకునే ప్రశ్న వస్తుందని తెలిసినా.. ఏదో ఒక రచ్చ చేయడానికే ఆర్ఆర్ఆర్ అప్పట్లో అలా పిటిషన్ వేశారని.. దానికి తగ్గట్టుగానే కోర్టు కొట్టివేసిందని అప్పట్లో వార్తలు వచ్చాయి.
కానీ ఆర్ఆర్ఆర్ తగ్గలేదు. అవసరమైతే సుప్రీం కోర్టు దాకా వెళ్తా అని డాంబికంగా ప్రకటించారు. హైకోర్టులో పిటిషన్ వేశారు. దానిని విచారణకు స్వీకరించాలా వద్దా అనే విషయంలో జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వాదనలు విన్నారు.
ఆర్ఆర్ఆర్ తరఫున వెంకటేశ్ వాదనలు వినిపిస్తూ.. సీబీఐ కోర్టు ఎదుట చెప్పిన విషయాల్నే అటు ఇటుగా వల్లించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేశారనే అంశానికి కూడా ముడిపెట్టారు. ఈ అంశాలన్నీ ఒక ఎత్తు కాగా.. పిటిషనర్ ను జైల్లో పెట్టారని, సుప్రీం కోర్టు జోక్యంతో విడుదల అయ్యారని అన్నారు. దీనికి న్యాయమూర్తి తీవ్రంగా స్పందించారు.
‘అయితే వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి కోర్టును వేదిక చేస్తున్నారా’ అంటూ తీవ్రంగా ప్రశ్నించారు. ‘కోర్టుల గౌరవాన్ని పరిరక్షించాలని, రాజకీయాలకు కోర్టులను వేదికగా చేసుకోకూడదని అన్నారు. 2013లో బెయిల్ వస్తే.. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారని కూడా నిలదీశారు.
బెయిలు షరతుల ఉల్లంఘన జరుగుతున్నట్టు సీబీఐ కోర్టు ఎదుట ఆర్ఆర్ఆర్ న్యాయవాది ఒక్క కారణం కూడా చూపలేకపోయారు. అందుకే అప్పట్లో ఆ కేసు కొట్టివేశారు. ఇప్పుడు మళ్లీ హైకోర్టులో కేసు వేసినప్పటికీ.. అప్పట్లో సీబీఐకు చూపలేకపోయిన ఏ ఒక్క ఆధారాన్నీ ఇప్పటికీ చూపలేదని హైకోర్టు వ్యాఖ్యానించడం విశేషం. సీబీఐకు లేని ఇబ్బంది మీకేంటి అంటూ ప్రశ్నించారు.
ఇన్ని ప్రశ్నలు వచ్చిన తర్వాత.. ఆర్ఆర్ఆర్ న్యాయవాదికి నోట మాట పెగలకపోవడం సహజం. కానీ.. ఆయన ఎంత వీలైతే అంత జగన్ ను ఇరుకునపెట్టడం లక్ష్యం అన్నట్టుగా.. ‘కనీసం జగన్ కు నోటీసులు ఇవ్వాలని’ కోరడం విశేషం. ఆ మాటకు కూడా న్యాయమూర్తి విలువ ఇవ్వలేదు. ఆ అభ్యర్థనను తోసిపుచ్చి.. నిర్ణయాన్ని మాత్రం వాయిదా వేశారు.
మొత్తానికి జగన్‌కు పెద్ద ఊరట
జగన్మోహన్ రెడ్డికి ఈ హైకోర్టు తీర్పు పెద్ద ఊరట. సాధారణంగా కోర్టులన్నీ తనకు వ్యతిరేకంగా ఉన్నాయని అనుకునే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేలా.. హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు ఉండడం విశేషం. నిజానికి కోర్టులో ఇంత స్థాయిలో చర్చ జరిగిన తరవాత.. ఆర్ఆర్ఆర్ లో పరివర్తన వస్తుందో లేదో తెలియదు గానీ.. జగన్మోహన్ రెడ్డి అభిమానులకు మాత్రం ఊరట లభించింది.
Discussion about this post