వేటూరి ప్రబంధాలు రాయగలడు. మన జీవన వేదాన్ని పాటల్లో వినిపించగలడు. మనతో ఈలా వేయిస్తాడు. తన కొంటె గీతాలతో మనసుల్లో మల్లెలు విరబూయిస్తాడు.
పొటమరించే వయసులో కాలువ గట్టున అర్థరాత్రి వరకు చెలికాళ్ళతో కాలవనీళ్ళల్లో కాళ్ళుతడుపుకుంటూ కూర్చుని
భక్త కన్నప్ప లో వ్రాసిన కిరాతార్జునీయం విని, మళ్ళీ విని, మళ్ళీ మళ్ళీ విని, విన్నది రాసుకుని ఆ పదశబ్దానికి
ఆనందంతో.. ఆహా ఎంత గొప్ప సాహిత్యం?
నిప్పులొలికే కన్ను నిదురోయి బొట్టాయె
నెలవొంక తలపాగ నెమలి ఈకగా మారే తలపైని గంగమ్మ తలపులోనికి జారె
ఓంకార ధనువుగా ఒదిగె త్రిశూలంబు
ఎరుక కలిగిన శివుడు ఎరుకగా మారగా
ఎవరు రాయగలరు
ఇంతటి గొప్ప కవనం?
ఇక్కడున్నాడేంటి రంగుల ప్రపంచంలో? ఈయన?
ఒక నన్నయ్య, తిక్కన్నల రచనను గుర్తుకు తెస్తోంది, అలాగే శృంగార రస భావస్పూర్తి చూస్తే శ్రీనాథుడి రచనా మనోజ్ఞ శిల్పం పోలినది కదా ఈ రాత? అనిపించి పదే పదే అధ్యయనం చేసాం చదువుకునే రోజుల్లో.
పరిక్షలేమో ఒక పక్క. మా నాన్న మా ఓడు తెలుగు పాఠం బాగా చదివేస్తున్నాడనుకునేవాడు.
సిరిమల్లె నీవే , మల్లెలు పూచే పాటలు విని త్వరగా పెళ్ళి చేసుకోవలనిపించే మనస్సుని రెచ్చకొట్టి చంపేసాడు.
శ్రీ శ్రీ లేడురా మన ఫీల్డ్ కి అంటే, ” ధుర్యోధన దుఃశ్శాసన” లో పాట వింటే ఎవడన్నది ఆ మాట అని తన కలాన్ని ఝాన్సీ కరవాలమై ఝళిపించాడు.
ఆయన పాటల్లో తాత్వికత గుండెలు పిండేస్తుంది. ఆకాశాన సూర్యుడుండడు” అంటూ యోగముద్ర వేయించి అవునుకదా జీవితమంటే ఇంతే కదా! అని గుర్తు చేస్తాడు.
గోదావరి పాపికొండల్ని జీవన చిత్రాన్ని పాట కాన్వాసు మీద చిత్రించి ఉప్పొంగే గోదాట్లో మునకలేయంచేస్తాడు.
తెలుగుపదానికి జన్మదినం
జానపదానికి దివ్యపథం
అంటూ పద నందకాలతో అరిష్వడ్గరం తెగనరికే హరిఖడ్గంగా మార్చి
మమ్మల్ని భక్తిపారవశ్యంలో పడేసిన ఘనత నీది స్వామి!
అలాగే
వరములు చిలక,
స్వరమున చిలక కరమున చిలక కలదాన
హిమగిరి చిలక , శివగిరి చిలక
అంటూ మధుర మీనాక్షి దివ్య దర్శనాన్ని కలిగిస్తాడు*
ఎన్ని పాటలని చెప్పను?
పాటల సంద్రంలో ఒక చిన్న బొట్టును మాత్రమే నేను స్పృశించాను.
తెలుగు భాష ని ఇంత అందంగా చెప్పి, మనభాష మేరుపర్వతమంత సంపద అని దాన్ని అందరికీ సుందరంగా పంచిపెట్టిన వేటూరికిదే నా వేడుకోలు!.
సామీ! మళ్ళీ పుట్టు! రాసే దమ్ములేక, రాసినా అర్థం గాక, ఆంగ్ల ఎంగిలి ముక్కల మీద నాలుగు వచ్చీ రాని , పాదాల సొబగులు లేని తెలుగు అనే పేరుపెట్టిన మిరియాల పొడి చల్లి మాకు ఇచ్చే ప్రయత్నం చేసి మమ్మల్ని చంపేస్తున్నారు ఈ సినీ మేతావులు.
కొన ఊపిరితో ఉన్నాం. అలాగే తింగర మొహాలతో పోనీ విందామని ప్రయత్నం చేసి ఆ వర్తులు లేని పదాలను విని భయపడి మానేస్తున్నాం ఎక్కడ పాపం అంటుకుంటుందోనని.
నీవు మటుకు నువ్వు హాయిగా అక్కడ ఆ “నాదశరీరుడికి” నీ పాటల సుమమాలలు సమర్పించుకుంటున్నావు.
మళ్ళీ రా కవిరాజ! నీ కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటాం
..చాగంటి ప్రసాద్ ( చా.ప్ర)
9000206163

.

Discussion about this post