మనకోనసీమ వనసీమ! కవుల, పండితుల మధుర సీమ! మనసులను రంజింపచేసే ప్రకృతిశోభ కోనసీమ సొంతం.
రావులపాలెం ముఖద్వారం నుంచి ప్రవేశించగానే మనస్సు మధురానుభూతికి లోనవుతుంది.
ప్రకృతి వనిత వయ్యారాల సొగసులు పచ్చని పుల్లేటికుర్రు నేత చీర ధరించి ఆహ్వానం పలుకుతుంది.
అపరభగీరధుని నిశిత పరిశీలన వలన బంగారం పండే నల్లని చేవకలిగన నేల నెరలు నోళ్ళు విప్పి దీనంగా నీటిచుక్కకోసం కాచుకున్నప్పుడు కాటన్ మహాశయుడు గంగకోసం భగీరధునిలా గోదావరిని వడిసిపట్డి “కొన”సీమ ను “కోన”సీమగా బంగారు సీమగా మార్చాడు.
పండిన పంట గింజ అన్నపుమెతుకుగా మారి అన్నపు ముద్ద నోట్లోకి వెళ్ళేముందు ఆయనని తలుచుకోవడం ప్రతీకోనసీమవాసి కర్తవ్యం. నిజానికి వెనకటి తరం పెద్దలు నిత్య పితృ తర్పణాలలో కాటన్ మహాశయునికి కూడ తర్పణం విడిచే వారట. నేటికి కూడా గోదావరి పుష్కరాల్లొ ఆయనకి కూడా పిండప్రదానం చేసేవారు కొంతమంది ఉన్నారు.
కాలువలనిండా నీరు బంగారంలా ప్రవహించి కాలువల గట్లన కొబ్బరి చెట్లు బంగారు హారానికి నగిషీలా అన్నట్టు, చెట్లమధ్య కొబ్బరికాయలు అమ్మ కడుపుపండి చంకలో ఎంతోమంది పిల్లలని ఒకేసారి ఎత్తుకున్నట్టు అనిపిస్తుంది.
ఒకపక్క పచ్చని చేలతో చీరకట్టుకున్న భూమాత! మధ్యలో రహదారి. వేంగీక్షేత్ర చరిత్ర ప్రతీఆకు కి తెలుసు. ప్రతీవయస్సుమళ్ళిన చెట్టుకుతెలుసు కోనసీమ వేదకోవిదులు వల్లెవేసిన ఘనాపాటీల ఘనపనస!
కోనసీమ లో మహామహులు ఎందరో, ఉద్దండ పండితులు పుట్జి ఈ భూమిని పునీతం చేసారు వాళ్ళలో ఎందరో యజుర్వేద ఘనాపాటీలు, వేదాంత, తర్క, మీమాంస, వ్యాకరణ, అలంకార , జ్యోతిష, గణిత, ఖగోళ శాస్త్రాల్లో విశేష కృషిచేసినవాళ్ళు.
వాళ్ళు కోనసీమలో పుట్టి ఈమట్టిని పునీతం చేసిన మహానుభావులు. తమ విద్యామృతాన్ని పంచిపెట్టారు, శిష్యులకి ఏ విధమైన ప్రతిఫలాన్ని ఆశించకుండా తమ ఇంట్లోనే వసతినిచ్చి కడుపునిండా అన్నంపెట్టి విద్యనేర్పిన ఋషులు.
ఈకోనసీమకు ప్రధానకేంద్ర బిందువు అమలాపురం. గౌతమీ, వైనతేయ, కౌశిక,వశిష్ట పాయల చీనాంబరాలు ధరించిన గోదావరమ్మ ఒడ్డున ఎన్నోపుణ్యక్షేత్రాలు, స్వయంభువులుగా, దైవప్రతిష్ఠగా విలసిల్లుతూ కోనసీమవాసుల కొంగుబంగారంగా ఉన్నారు.
వాటిలో అయినవిల్లి సిధ్ధివినాయకుడు, క్షణం వీక్షిస్తే ముక్తినిచ్చే క్షణముక్తేశ్వరుడు,
నిత్యకళ్యాణ ప్రియుడు, కళ్యాణానుగ్రహ కారకుడు మహాదేవుడైన వీరేశ్వరుడు అమ్మ భద్రకాళితో మురమళ్ళలో ,
అంతర్వేదిలో లక్ష్మీ నృసింహస్వామి , గౌతముడు వేంచేసి ప్రతిష్టించిన కుండలేశ్వరుడు, భారతదేశంలోనే ఉన్న రెండు శనైశ్చరాలయాలలో అత్యంత మహిమగల మందేశ్వరుడు మందపల్లిలో , అప్పనపల్లి లో కొబ్బరితోపులో వెలిసిన వెంకన్న,
ఇవికాక అమలాపురంలో స్వాయుంభూ వేంకటేశ్వరుడు , 200 సంవత్సరాలకు పూర్వంనుంచి వేంచేసి ఉన్న చెన్నమల్లేశ్వరుడు, అతి పురాతనమైన శ్రీరాజరాజేశ్వరీసమేత కృష్ణేశ్వర స్వామి,వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం, అమలాపురానికి ఇలా అన్ని దిక్కులా పుణ్యక్షేత్రాల తో అలరారుతోంది.
గన్నవరంలో పర బ్రహ్మ రూపమైన అన్నాన్ని అందరికి తినిపించిన దానశీలి డొక్కాసీతమ్మగారు సదా స్మరణీయులు.
వేదములకు ఆలవాలమైన కోనసీమలో పుణ్యంచేసుకున్న ఇందుపల్లి లో జన్మించి “శ్రీమద్వాల్మీకి రామాయణం” అంటే అని దాని మధురత్వాన్ని రుచిచూపించిన , అత్యంత ప్రతిష్టాకరమైన పద్మశ్రీ పురస్కార గ్రహీత వ్యాకరణ,వేదాంత, అలంకార శాస్త్రాలకి సంబందించి తెలుగు, సంస్కృత, హిందీ, ఆంగ్ల భాషల్లో 150 పైగా గ్రంధాలను రచించిన బ్రహ్మశ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు మన వారే అని ఆనందం!
అపర సరస్వతి పుత్రుడు అపర త్యాగయ్య లాంటి కర్ణాటక విధ్వాంసుడు, సంగీత కళా నిధి పద్మవిభూషణుడు డాక్టర్ శ్రీ మంగళంపల్లి బాల మురళీకృష్ణ పుట్టిన కోనసీమ లోని శంకర గుప్తం ఎంతో పుణ్యం చేసుకొంది, మరియు ఆ వూరి ఘనత ఆ గంధర్వుని వల్ల ప్రపంచదేశాలకి తెలిసింది.
అమలాపురం శ్రీ కోనసీమ భానోజి రామర్స్ కళాశాల ఎందరో విజ్ఞానవంతుల్ని, నాయకులని తయారుచేసి తన ఘనత చాటిచెప్పుకుంది.
వారిలో శ్రీ గరిమెళ్ళ ప్రభాకర రమేశం గారు, ప్రిన్స్ పాల్ గాపనిచేసి కళాశాల ప్రతిష్టని ఇనుమడింపచేసారు. ఎందరో అధ్యాపకులు తనదైన అద్భుతమైన జ్ఞానంతో విద్యార్థులను గొప్పగా తీర్చిదిద్దడం నేను మరువలేను.
అపారమైన విద్యాసంపదని పంచిపెట్టారు.
కోనసీమ అంటే దసరా పండగ , సంక్రాంతి పండగలకి గుర్తుకువచ్చి మరచిపోలేని ఊరు. నలుమూలలనుంచి ఊరేగింపుగావచ్చే దసరా వాహనాలు. సంక్రాంతికి బళ్ళపూజలు, జగ్గన్నతోట వీరభద్ర ప్రభలు, కార్తీకమాస వనభోజనాలు ప్రకృతి పర్యవేక్షణంలో జరిగిన పండగలు కోనసీమ చరిత్రలో కొన్ని మధుర అధ్యాయాలు.
అలాగే ప్రతి సంవత్సరం వేదసభలకి . వేదపండితులకి చేయూతనిచ్చే మహాదాతలు కోనసీమలో వేదవెలుగుకి కారణమైనారు ఒకప్పుడు!
వ్యాపారపరంగా కూడా అంబాజీపేట కొబ్బరి వ్యాపారం కేరళ రాష్ట్రంతో పోటీ పడుతోంది.
కోనసీమ మహామహులలో కొంతమంది :
1. బ్రహ్మశ్రీ పాద శ్రీరామనృశింహ ఘనాపాటి!
2. శ్రీ రాణీ నరశింహశాస్త్రిగారు
వేదాంత శాస్త్రం
3. శ్రీకొంపెల్ల సుబ్బరాయశాస్త్రిగారు
అలంకార, వ్యాకరణ శాస్త్రం
4. శ్రీ పుల్లెల సత్యనారాయణ శాస్త్రి గారు
వేదాంత,వ్యాకరణ,జ్యోతిష శాస్త్రములు
5. శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడుగారు
వ్యాకరణం, వేదాంతం , అలంకార , తర్క , మీమాంస శాస్త్రాలు.
6. శ్రీపాద లక్ష్మీ నరశింహశాస్త్రిగారు
వ్యాకరణ శాస్త్రం
7. శ్రీ పిడపర్తి కృష్ణమూర్తిశాస్త్రిగారు సుబ్రహ్మణ్య శాస్త్రిగారు
జ్యోతిష శాస్రము సిద్ధాంత భాగము
8. శ్రీ కొల్లూరి సోమశేఖర శాస్త్రిగారు
తర్కశాస్త్రం
9. శ్రీ బులుసు అప్పన్న శాస్త్రిగారు
తర్క శాస్త్రం
10. శ్రీ లంక వెంకటరామసోమయాజులు గారు
యజుర్వేద ఘనాపాటి, మీమాంస, శ్రౌత పండితులు
12. శ్రీ పుల్లెల వెంకట సత్యన్నారాయణ మూర్తిగారు
గణితశాస్త్రం
13. శ్రీ జగన్నాథ పండితరాయలు, ముంగండ
అలంకార, వేదాంత, వ్యాకరణ,తర్క ,మీమాంస శాస్త్రాలు
14. శ్రీపాద మాణిక్యఘనాపాటిగారు-గంగలకుర్రు
యజుర్వేద. వ్యాకరణ,మీమాంసశాస్త్రం
15.శ్రీ కందుకూరి కృష్ణమూర్తి గారు
వ్యాకరణం
16.శ్రీ మరువాడ శరభన్నశాస్త్రిగారు
వేదాంత శాస్రం
17. శ్రీ మంగిపూడి వెంకటశాస్త్రిగారు
వ్యాకరణ శాస్త్రము
18. శ్రీ మంథాగోపాలకృష్ణశాస్త్రిగారు
జ్యోతిష శాస్త్రం
19. శ్రీ రేమెళ్ళ అన్నావథానులుగారు
వ్యాకరణ,మీమాంసశాస్త్రాలు
20. వెంపరాల సూర్యనారాయణ శాస్త్రిగారు
సాహిత్యం
21. శ్రీ కొల్లి అనంతపద్మనాభశాస్త్రిగారు
సాహిత్యం
22.శ్రీ శ్రీధరవెంకన్నగారు
(అపరజైమినీ అనే బిరుదాంకితులు)
నేదునూరు
జ్యోతిష్య శాస్త్రం
ఇలా ఎంతచెప్పుకున్నా తక్కువే నాసీమ గురించి. ఇటువంటి పుణ్యభూమిలో నేను పుట్టడం నా అదృష్టంగా భావిస్తు ఇప్పుడు ఏవి తల్లీ ఆ నిరుటి హిమసమూహాలు అని అన్నట్లు ఏది ఆ వేదఘోష? ఏది అలనాటి వైభవం?
..చాగంటి ప్రసాద్ (చా.ప్ర)

.

Discussion about this post