బ్రహ్మీముహుర్తకాలం! తెలతెలవారుతున్న తరుణం. హేమంతం పుష్పజాతులనుండి సౌగంధాల్ని మోసుకొస్తూ చల్లని మంచు బిందువులని కలిపి తుషారజల్లుల్లా కళ్ళాపి జల్లుతోంది.
గజగామినిలా అమ్మ నడుస్తున్న దారిలో “పొగడ పూలు” తమ మేనుల్ని తివాచీగా పరచాయి.
అమ్మ ప్రతి ఇంటి గడప దాటివెడుతోంది. ఏ యువతి ఎంతందంగా రంగవల్లులు దిద్దిందో చూసి నచ్చితే ఆమెకి తన దీవెనలిద్దామని చూస్తోంది.
సాయం సంధ్యలో మొదలుపెట్టి జాము గడిచేవరకు ముగ్గులు దిద్దిన పడతులు పడక చేరేరు.
పడతులు పెట్టిన రంగవల్లుల్లోని వర్ణాలు ఆకసపు కొప్పులో రేఖామాత్రంగా విచ్చుకున్న జాబిలిపువ్వు వెదజల్లిన వెన్నెల కాంతిలో మెరుస్తుంటే వాటిని చూసిన పౌష్యలక్ష్మీ ఆనందపడితే మోమున మొలిచిన చిరుమందహాసం వలన అమ్మ ముక్కునున్న ముక్కెర పైకిలేస్తే చిన్న కాంతి రేఖ దానిపై పడి ప్రతిఫలిస్తే దివిలోనున్న “పుష్యమీ నక్షత్రం అమ్మ అద్వితీయమైన ఆనందాన్ని కాంచినదై ఆ అపురూపమైన దృశ్యాన్ని వర్ణించుకుంటూ శ్రీరంగనాథ స్వామికి చేరవేయడానికి పరిగెడితే మిగిలిన తారలన్ని ఆశ్చర్యంగా “భువి” లో ఏంజరిగిందా ? అని మరింత కిందకు దిగి అమ్మ అందాన్ని వీక్షించడానికి తొందరపడ్డాయిట. దానితో అవనీతలమంతా వాటికాంతులతో ముగ్గులేసినట్టుగాఉందిట.
అమ్మ మటుకు ఒక్కొక్క గడప దాటుకుంటూ ఓ వాకిలి ముందు ఆగి పొందికగా గోమయంతో అలికి,
చక్కని “వటపత్రశాయి” పవళింపులో ఉన్న రంగవల్లి మధ్యలో ఒద్దికగా కూర్చున్న గొబ్బెమ్మల మధ్య పుష్పాలతో అలంకరించి ఉండడం చూసి అమ్మ ఆనందంతో పులకరించినదై స్వామి పక్కన , తనని ముగ్గులో చూసి అమ్మ
ఆ అదృష్టవంతురాలి ఇంట సుస్థిరనివాసమునకు సుముఖురాలైంది.
ఆకాశంలో వెలుగురేఖ విచ్చుకుంది. బాలభానుడు తన కాంతిరేఖలతో ఆ ఇంటిముందున్న లక్ష్మీనారాయుణుల ముందు సాష్టాంగం పడుతున్నాడు. అమ్మ ఆ ఇంట సిరులపంటైనదిట.
అందరికీ బోగీ సంక్రాంతి శుభాకాంక్షలు
..చాగంటి ప్రసాద్

.

Discussion about this post