అన్నీ తెలిసిన పెద్దలే… కానీ కొన్ని విషయాల్లో మరీ అమాయకంగా ప్రవర్తిస్తుంటారు… తమ అమాయకత్వంమో… లేదా మరేమనుకోవాలో… వారి ప్రవర్తన వల్ల వారి పక్కవారిని కూడా ప్రమాదంలోకి నెడుతుంటారు. ఎవరా పెద్దలు అని అనుకుంటున్నారా… ఇంకెవరు.. మెగాస్టార్ చిరంజీవి…!
సినిమా పరిశ్రమలో పెద్ద హీరోలంటే అభిమానులకు చాలా ప్రేమ… ఇక వారేదైనా చెప్పారంటే… దాన్ని తు.చ. తప్పకుండా ఆచరణలో పెట్టడానికి చాలామందే ప్రయత్నిస్తుంటారు. అందుకే పలు రాజకీయ పార్టీలు కూడా తమ ప్రయోజనాలకోసం సినీ తారలను ప్రచారంలోకి దించుతుంటారు. పేరున్న పెద్ద కంపెనీలు కూడా తమ ఉత్పత్తులకు ప్రచార కర్తలుగా సినీ తారలను చూపుతుంటారు. అంటే సినిమా వాళ్లంటే ప్రజల్లో ఎంతటి ప్రభావం ఉంటుందో మనందరికీ చెప్పకనే తెలుస్తుంది. మరి తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ అంటే తెలియని తెలుగు వారు లేరంటే అతిశయోక్తి కాదు.
మెగాస్టార్ అంటేనే సినీ పరిశ్రమకు మెగా దిక్కుగా చెప్పవచ్చు. ఆయన లాంటి వ్యక్తి అటు సినీ పరిశ్రమకేకాదు… ఇటు అశేష సంఖ్యలో అభిమానులకు కూడా ఆరాధ్యుడుగా చెప్పవచ్చు. అలాంటి మెగాస్టార్ ఇప్పుడు తన అభిమానులకు ఏమని చెబుతారు…? ఎందుకంటే..ఆయనకి కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలింది. ఇది నిజంగా ‘మెగా’ ఫ్యాన్స్ కు మాత్రం చాలా బాధాకరమైన వార్తే.
చిరంజీవి తనకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో తేలినట్టు తన ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు… తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేకపోయినా పాజిటివ్ అని తేలిందని, కాబట్టి తాను హోం క్వారంటైన్ లో ఉన్నట్టు ఆయన తెలిపారు. అంతేకాకుండా గత 5 రోజులుగా తనను కలిసిన వారంతా కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి 7వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రగతి భవన్ లో కలిసి, వరద సహాయంకు సంబంధించిన చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను గురించి ముఖ్యమంత్రితో చర్చించారు. ఆయనతోబాటు అక్కినేని నాగార్జున కూడా ముఖ్యమంత్రిని కలిసి ఈ చెక్కులను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖా మంత్రి వేమల ప్రశాంత్ రెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎంపీ జోగిన పల్లి సంతోష్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ఛీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఇంకా మరికొంతమంది అధికారులు కూడా ఆయనను కలిశారు. అలాగే ఆదివారం నాడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తో రాజ్య సభ ఎంపీ సంతోష్ కుమార్ సెల్ఫీ దిగారు. ఇద్దరూ కలిసి గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మొక్కలు నాటారు. మళ్లీ ఈరోజు సంతోష్ కుమార్ గ్రీన్ ఛాలెంజ్ లో భాగంగా మరో హీరో జగపతి బాబును కలిశారు. ఇప్పుడు వీరందరి గుండెల్లో కోవిడ్ బాంబు పేలింది.
చిరంజీవికి కరోనా పాజిటివ్ అని తేలడంతో, అటు ముఖ్యమంత్రి, ఇంకా చిరుని కలిసిన పెద్ద నాయకులు, ఉన్నతాధికారులు అందరూ కూడా కరోనా టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రిని కలిసిన చిరు, నాగార్జునలు మాస్కులు లేకుండా ముఖ్యమంత్రితో చర్చించడం వంటి విషయాలకు సంబంధించిన ఫోటోల్లో వారిలో చాలావరకు మాస్కులు లేకుండానే ఉన్నారు. అసలే కోవిడ్ మహమ్మారి అందరినీ అంటుకుంటోంది. మరి అలాంటి పరిస్థితుల్లో ఎంతటి జాగ్రత్తగా ఉండాలి…? అందునా తమను కూడా ఫాలో అయ్యేవారికి మరెలాంటి సందేశాలు ఇచ్చేలా ఉండాలి…? ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన చిరు, అటు నాగ్, మరోవైపు సిఎం మాస్కులు లేకుండా ఉండడం ప్రజలకు ఎలాంటి సంకేతాలు అందజేస్తుందో ఆలోచించాలి…! ఇకనైనా పెద్దలు… ముఖ్యంగా పలువురికి ఆదర్శంగా నిలిచేవారు.. ప్రజలకు మాస్కులు ధరించమని నోటితో చెప్పడమేకాకుండా… తాము ముందుగా ఆచరించి చూపితే… బాగుంటుందేమో…!
.

Discussion about this post