సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఒక యోగి. తెలుగు సినిమా చరిత్రలో.. ఆయన ప్రస్థానం ఒక నిష్కళంక అధ్యాయం! తెలుగు పాటకు సమున్నతమైన కీర్తిని కట్టబెట్టడానికి, తెలుగు పాటలో తెలుగు భాషా పరిమళాల సౌందర్యాన్ని యావత్ తెలుగుజాతికి శాశ్వతంగా అనుభూతింపజేయడానికి విధాత తలపున ప్రభవించిన.. మహనీయుడు.. వాగ్దేవీ సుతుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి.
తెలుగు సినిమా అదివరలో ఎన్నెన్ని హొయలు పోతున్నా సరే.. కొండలు అధిరోహిస్తూ లోయల్లోకి జారుకుంటూ.. గిరితరువులను చుట్టేసుకుంటూ.. తెలుగు సినిమా పాట ఆయన అడుగుపెట్టడానికి ముందు కూడా ఎన్నెన్నో నడకలు నేర్చింది. కానీ.. ఆయన రాకతో.. ఆయన సంకల్పబలంతో.. ఆయన కలం స్పర్శతో.. తెలుగు పాట ఒక కొత్త అందాన్ని అద్దుకుంది. కొత్త గాంభీర్యాన్ని సంతరించుకుంది. కొత్త సౌందర్య పరిమళాలను వెదజల్లింది.
అత్యంత సాధారణమైన సినిమాకు, అత్యంత సాధారణమైన పాట రాసినా సరే.. అందులో నిండైన భావాన్ని మెండుగా పొందుపరచి.. తెలుగు ప్రేక్షకుల వీనులకు మాత్రమే కాదు.. ఆత్మలకు కూడా షడ్రసోపేతమైన విందుగా అందించిన వాడు.. సీతారామశాస్త్రి గారు! తేటతెలుగు పదాలనుంచి, గంభీర సంస్కృతాడంబర శబ్దాల వరకు భాష ఆయన పాటలలో ఒదిగి ఒదిగి నిల్చున్నాయి. ఆయన మేథో ఔద్ధత్యం ముందు తెలుగుపాట వినయంగానే వ్యవహరించింది. ఆయన చిత్తశుద్ధికి, నీతి తప్పని రచనారీతికి తెలుగు సినిమాలోకమే సభక్తికంగా ప్రణమిల్లింది.
సినిమా పాటల రచనలో- అపభ్రంశపు పోకడలు ఏవీ తన దరికి కూడా రాకుండా, దిగజారుడు మెట్లు ఎరగని రుషి సీతారామ శాస్త్రి గారు. సినిమా పాట అనగానే.. ఎప్పుడో ఒకప్పుడు.. ఏదో ఒకటి మాత్రమే మంచి పాట ఉంటుందని.. అందరూ అనుకుంటూ ఉంటారు. సినిమా అనేదే ఒక వ్యాపార ప్రపంచం కాబట్టి.. వ్యాపారానికి కావాల్సిన రీతిలో, అదే వ్యాపార సరంజామాను దట్టించిన లేకి పాటలే ఎక్కువగా ఉంటాయనీ అనేవారున్నారు.
ఎంతటి మహారచయితలైనా, ఎంతటి విద్వత్ సంపన్నులు అయినా.. ఎంతటి గొప్ప పాటలు రాయగలిగిన వారికైనా.. ఎక్కువగా లేకిపాటలు రాసే అవకాశం మాత్రమే వస్తుంటుంది. అసందర్భపు ద్వంద్వార్థాలు, వెకిలితనం నిండిన పాటలే మిన్నగా చెలామణీ అయ్యే ఈ ప్రపంచంలో.. గంజాయివనంలో తులసి మొక్కలాగా.. ధీరగంభీరంగా నిల్చుని.. తన వ్యక్తిత్వం, విలువలు ఏమాత్రం మసకబారకుండా తన వృత్తిగత కవన ప్రస్థానం కొనసాగించిన మహనీయుడు సిరివెన్నెల.
ఆయన పాటల్లో చవకబారు ద్వంద్వార్థాలు మనకు కనిపించవు. అలాగని అన్నీ కూడా ఉపదేశాలు అనలేం. శృంగారాత్మకమైన పాటలలో ప్రాధాన్యం శృంగారానికే ఉంటుంది తప్ప.. ‘సినిమా ఇండస్ట్రీ డిమాండ్ చేస్తోందనే’ ఆత్మవంచనతో లేకిబారు, చవకబారు పదాల అల్లికకు ఆయన ఎన్నడూ దిగజారలేదు. తన పాటలకు ఒక ప్రమాణాన్ని నిర్దేశించి.. ఆ ప్రమాణాల దిగువకు జారకుండా కాపలా కాశారు.
కొత్తనీరు వెల్లువలా పరిశ్రమపై వచ్చి పడిపోతున్న తరుణంలో.. సిరివెన్నెల సీతారామశాస్త్రి అవకాశాలు సహజంగానే తగ్గాయి. అవకాశాలు తగ్గాయి కదాని తన పాటకు ఉన్న గౌరవాన్ని, విలువైన ప్రేక్షక దేవుళ్ల దృష్టిలో ఉండే భక్తిని, మర్యాదను ఆయన పలుచన చేయదలచుకోలేదు. అవకాశాలు వచ్చినంత వరకే రాశారు. కానీ.. ఒకటి మాత్రం నిజం. ‘మంచి పాట కావాలంటే.. మనసుకు హత్తుకునే పాట కావాలంటే.. దర్శకుడు గానీ.. కథగానీ ఒక పాటలో ఏం ఆశిస్తారో.. ఆ expectation ను వందరెట్లుగా వేయిరెట్లుగా పెంచే.. అద్భుతమైన పాట కావాలంటే.. శాస్త్రిగారి వద్దకు మాత్రమే వెళ్లాలి..’ అనే ముద్రను ఆయన కాపాడుకున్నారు.
ఎవరు మరణించినా సరే.. వారు పేరుమోసిన రంగాలకు తీరని లోటు అనేస్తూ ఉంటాం. ఆ రంగంలో కెరీర్‌నుంచి తప్పుకున్న వయోవృద్ధులు మరణించినా అదే పదం వాడేస్తుంటాం. కానీ.. సిరివెన్నెల అలా కాదు. ఆయన నిష్క్రమణం ఖచ్చితంగా పరిశ్రమకు పెద్ద లోటు.
‘‘నా ఉచ్ఛ్వాసం కవనం.. నా నిశ్వాసం గానం…’’
అంటూ తెలుగు పాటను సాధికారంగా శాసించిన శాస్త్రిగారూ..
మీ ఉచ్ఛ్వాసం కవనం
నిజమే. కానీ,
మీ నిశ్వాసం శాపం..
తెలుగు సినిమా పరిశ్రమకి.. తెలుగు ప్రేక్షకులకి..
తెలుగు పాటల ప్రేమికులకి..
మిమ్మల్ని ప్రేమించే మాకు.
సెలవు.
.. కృష్ణమోహన్ దాసరి,
డలాస్, యూఎస్ఏ
Discussion about this post