“రేయ్ గిరి, స్నానానికి వెళ్ళు స్కూలుకి టైం అవుతోంది” కొడుకుని ఉద్దేశించి వంటగదిలోంచి అరుస్తోంది హేమ.
“శృతిని చేయమను. నేను తర్వాత చేస్తాను” ఫోనులో యూటూబు వీడియోలు చూస్తూ చెప్పాడు గిరి.
“ఆ, ఇప్పుడు నేనెందుకు చేస్తాను. నేను సాయంత్రం కదా ఫష్ట్ చేసేది. ఇప్పుడు వాడే చేయాలి” హోంవర్క్ రాసుకుంటూ అమ్మ పెట్టిన నియమాన్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే అన్నట్లు దృఢంగా చెప్పింది గిరి చెల్లెలు శృతి.
“అసలు నీవేం చేస్తున్నావురా. హోంవర్క్ కంప్లీట్ చేశావా?” మళ్ళీ గిరిని ఉద్దేశించి అడిగింది హేమ.
“అమ్మా వాడు ఫోను చూసుకుంటున్నాడు” కంప్లైంట్ లా చెప్పింది శృతి.
చెల్లెలు చేసిన కంప్లైంట్ కి, ” మే శృతి, నా చేతిలో అయిపోతావు” పళ్ళు బిగించి, నుదురు చిట్లించి వాళ్ల అమ్మకు వినబడకుండా చెల్లెలు మీద ఉరిమాడు.
కానీ, దురదృష్టవశాత్తు వాడి మాటలు వాళ్ళ అమ్మకు వినిపించడంతో, వంటగదిలోంచి హాల్లోకి వచ్చి, “అసలు నీకు ఫోను ఎవరిచ్చారు?” అంటూ న్యూస్ పేపర్ చదువుకుంటున్న నా వైపు చూసింది హేమ.
“నేనివ్వలేదు. పేపర్ చదువుతుంటే వాడే ఎత్తుకున్నాడు” అన్నాను నేను.
“లేచి వెంటనే స్నానానికి వెళ్ళకపోతే వీపు పగిలిపోతుంది” అంటూ చేతిలోనున్న దోశ గరిటతో గిరి దగ్గరకు రావడంతో, ఎక్కడ కొడుతుందేమోనని ఫోను పెట్టేసి పరుగున స్నానానికి వెళ్ళాడు గిరి.
గిరి స్నానాలగదిలోకి వెళ్ళిన తర్వాత హేమ వంటగదిలోకి వెళ్ళింది దోశలు వేయడానికి. వాడు అటు స్నానానికి వెళ్ళిందే తొందర వెంటనే శృతి ఆ ఫోన్ తీసుకుంది.
“శృతి ఫోను ఎందుకు తీసుకున్నావు? హోంవర్క్ రాయకుండా” అన్నాను నేను.
“వాడు మాత్రం చూడొచ్చా. నేను చూడకూడదా?” ఇద్దరికీ ఒకే రూలు కదా అన్నట్లు అడిగింది శృతి.
“వాడు హోంవర్క్ పూర్తిచేశాడు కాబట్టి ఫోను తీసుకుంటున్నా నేను ఏమీ అడగలేదు. హోంవర్క్ పూర్తిచేసి నీవూ ఓ ఐదు నిమిషాలు ఫోను తీసుకో” అన్నాను.
“నాన్నా, వాడు హోంవర్క్ కంప్లీట్ చేయనేలేదు. ఇంకా ఇంగ్లీషు పెండింగు ఉంది” అసలు విషయం బయటపెట్టింది శృతి.
ఆ మాటతో వాయువేగంతో వంటగదిలోంచి వచ్చి, “అసలు మీ వల్లే వాడు చెడిపోతున్నాడు. ఫోను ఇవ్వొద్దని ఎన్నిసార్లు చెప్పినా వినరు మీరు. వాడికి బొత్తిగా భయం లేకుండా పోతోంది. వాడిని చూసి ఇదిగో శృతి కూడా నేర్చుకుంటోంది” ఈసారి నాపై విరుచుకు పడింది హేమ.
అందరి పిల్లల్లా మా పిల్లలు గంటల తరబడి ఫోను చూడరు. రోజుకి చెరో ఐదు నిమిషాలు మాత్రమే ఇస్తాను ఫోను. ఆ ఐదు నిమిషాలు కూడా వాళ్లు యుటూబులో నీతి కథలు మాత్రమే చూడాలి. ఆ షరతుతోనే ఇస్తాను ఫోను. వాళ్లు కూడా ఆ షరతును, సమయాన్ని ఉల్లంఘించరు. దానికే మా ఆవిడ తెగ హైరానా పడిపోయి, నన్ను దోషిని చేస్తూ ఉంటుంది.
హేమ నాపై చూపించిన చురకలకు అలెర్ట్ అయిపోయి ఫోను అక్కడ పెట్టేసి పుస్తకాలు దగ్గరకు వెళ్ళి హోంవర్క్ రాసుకోవడం మొదలెట్టింది శృతి.
‘ఏమండీ, మీరంటే గిరికి అసలు భయం ఉండడంలేదు. ఎంతసేపూ నేనే అరుచుకుంటుంటే ఏం లాభం చెప్పండి. మీ భయం లేకుండా వాడిని అలా వదిలేస్తే దేనికీ పనికి రాకుండా పోతాడు. తర్వాత మీ ఇష్టం’ అని పిల్లలులేని సమయంలో నన్ను నిలదీస్తూ ఉంటుంది హేమ.
‘చూడు హేమ, నీవూ అరచి, నేనూ కోప్పడితే బెంబేలెత్తిపోతారు వాళ్లు. అప్పుడు అసలుకే మోసం వస్తుంది. పిల్లలు కదా కాస్త అల్లరి ఉంటుంది. వాళ్ళ అల్లరిని మనమే భరించకపోతే ఇక ఎవరు భరిస్తారు చెప్పు. మనమే మెల్లిగా వాళ్ళని మన దారిలోకి తెచ్చుకోవాలి. నీవు అనవసరంగా ఆందోళన పడుతున్నావు’ అని నేను నచ్చచెప్పినా నా మాటను చెవిలో వేసుకోదు.
అందుకే వాళ్ళు ఎంత అల్లరి చేసినా చూసీచూడనట్లు మౌనంగా ఉండిపోతాను. కానీ, ఒక్కొక్కసారి అల్లరి శృతిమించితే మాత్రం దండిస్తూనే ఉంటాను.
“అమ్మా, ఈ నిక్కరు పొట్టైపోయింది. నేను వేసుకోను” స్నానం చేసి వచ్చి బెడ్రూంలోంచి అరుస్తున్నాడు గిరి.
“ఇక మూడు నెలలే ఉండేది. దాన్నే వేసుకో. జూనులో కొత్తది కుట్టిస్తాను” అంది హేమ.
“నేను వేసుకోనంటే వేసుకోను. నాకు ఫ్యాంటు కావాలి” అంటూ మొలకి టవలు చుట్టుకుని హాలులో దివానా మీద కూర్చుని పేపర్ చదువుకుంటున్న నా పక్కన వచ్చి కూర్చున్నాడు గిరి.
“ఏంటీ, మళ్ళీ చెప్పు. ఐదవతరగతి చదివే నీకు ఫ్యాంటు కావాలా! మీ స్కూల్లో ఆరు, ఏడు తరగతి చదివే పిల్లలు ఇంకా నిక్కర్లు వేసుకొస్తున్నారు. నీ కంటే ఏడాది చిన్నదైనా శృతి అడగడంలేదుగా నీలాగ. మర్యాదగా ఆ నిక్కరు, షర్టు వేసుకుని వచ్చి, పెండింగు ఉన్న ఇంగ్లీషు హోంవర్క్ వ్రాయి. లేకపోతే వొళ్ళి పగిలిపోతుంది” వంటగదిలోంచి వచ్చి గిరిని హెచ్చరించింది హేమ.
నిక్కరు వేసుకోవడం ఇష్టంలేని గిరి గొణుగుతూ బెడ్రూంలోకి వెళ్ళాడు. కాసేపటి తర్వాత హల్లోకి వచ్చాడు. వాడు వేసుకున్న నిక్కరు కరెక్టుగానే ఉంది. అంత పొట్టి ఏమీలేదు.
“శృతి నీవు కూడా స్నానం చేసిరా ఇద్దరికీ టిఫిన్ పెడతాను” అంది హేమ.
“అమ్మా, రెండు నిమిషాల్లో అయిపోతుంది హోంవర్కు. వెళ్తాను” అంది శృతి.
“హోంవర్కు రాత్రే పూర్తి చేయమని ఎన్నిసార్లు చెప్పినా వినరు మీరు. ఉదయం లేచిన తర్వాత పుస్తకాలు ఎత్తుకుంటారు. హడావుడిలో అక్షరాలు సరిగా రాయరు. సరే త్వరగా పూర్తిచేసి స్నానానికి వెళ్ళు” అంది హేమ.
“అమ్మా, నాకు టిఫిన్ పెట్టు” అన్నాడు గిరి.
“శృతి స్నానం చేసి వచ్చిన తర్వాత ఇద్దరికీ కలిపి ఒకేసారి పెడ్తాను” అంది హేమ.
“ఆ, శృతి కోసం నేనెందుకు ఆగాలి. నాకు ఇప్పుడే పెట్టు” అని మొండికేశాడు గిరి.
“ఇంగ్లీషు హోంవర్కు పెండింగు ఉందిగా. అది రాసేయ్. అంతలోపల శృతి కూడా స్నానం చేసి వచ్చేస్తుంది. అప్పుడు ఇద్దరికీ టిఫిన్ పెడతాను” మళ్ళీ చెప్పింది హేమ.
“అమ్మా, నాకు హోంవర్కు కంప్లీట్ అయిపోయింది. నేను స్నానానికి వెళ్తున్నా” అని చెప్పి వెళ్ళింది శృతి.
“నేను తిన్నాకే హోంవర్కు రాస్తాను. నాకు టిఫిన్ ఇప్పుడే పెట్టు” అని పట్టిన పట్టు విడవలేదు గిరి.
గిరి ప్రతి విషయంలోనూ అంతే. అందుకే వాళ్ళ అమ్మ దగ్గర తరచూ దెబ్బలు తింటుంటాడు. కానీ, శృతి వాడికి విరుద్దం. అల్లరి చేసినా తెలివిగా ఏదోక సమాధానం చెప్పి వాళ్ళ అమ్మ దగ్గర దెబ్బలు తప్పించుకుంటూ ఉంటుంది.
“నాయనా గిరి, అలా అనకూడదు. అమ్మ చెప్పినట్లు విను. హోంవర్కు రాసేయ్ నాయనా” హోలులోనే సోఫాలో కూర్చుని ఉన్న గిరి నాన్నమ్మ అంది.
“నీకెందుకు, నీవు నోరు మూసుకో” మా అమ్మను ఉద్దేశించి అన్నాడు గిరి.
ఆ మాటతో, వంటగదిలోంచి వచ్చి గిరి వీపు మీద బాదింది హేమ. అంతే వాడు ఏడుపు ఎత్తుకున్నాడు.
“అంతమాత్రానికే కొట్టాల్నా వాడ్ని. అలా చీటికి,మాటికి చితక బాదేస్తే దేనికి పనికొస్తాడు వాడు. నీకు ముక్కుమీదే ఉంటుంది కోపం. పిల్లల మీద అంత ఉక్రోషం ఉండకూడదు” అని హేమకి క్లాస్ పీకింది మా అమ్మ.
“అత్తమ్మా, వాడు మిమ్మల్ని లెక్కలేకుండా మాట్లాడితేనే కదా నేను కొట్టింది. వాడ్ని మందలించాల్సింది పోయి నన్ను తిడతారెందుకు మీరు?” అని హేమ మా అమ్మతో అంది.
“రూల్స్ మాత్రం బాగా మాట్లాడతావు. ముందు నీవు నోటిని, చేతిని అదుపులో పెట్టుకో” అని కోపంగా అంది మా అమ్మ.
వాళ్ళ ఇద్దరి మధ్య వాగ్వాదం శృతిమించుతోందని గమనించిన నేను, “అమ్మా, వాడు అతిగా మాట్లాడితేనే కదా కొట్టింది హేమ. దానికెందుకుమా హేమని తిట్టడం” అని అన్నాను.
“అసలు నిన్ను అనాలిరా ముందు. నీ చేతగానితనం వల్లే వాళ్ళు ఇలా తయారైనారు. నీ భయం లేకనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు” నా మీద కూడా కోపాన్ని ప్రదర్శించింది అమ్మ.
“సర్లే ఇక ఈ విషయాన్ని ఇంతటితో వదిలేమా. ముందు నీవు టిఫిన్ తిను” అని నేను టాఫిక్ డైవర్ట్ చేశాను.
ఆ మాట హేమకి రుచించక నా వైపు కోపంగా చూసి, “హోం వర్కు పూర్తి చేయ్. లేకపోతే మళ్ళీ పడుతుంది” అని గిరిని హెచ్చరించడంతో వాడు ఏడుస్తూనే హోంవర్కు రాయడం మొదలెట్టాడు. వాడు హోంవర్కు కంప్లీట్ చేసే సమయానికి శృతి కూడా స్నానం చేసి వచ్చేయడంతో ఇద్దరికీ టిఫిన్ పెట్టింది హేమ.
వాళ్ళు టిఫిన్ చేసేలోగా నేనూ స్నానం చేసి రాగానే నాకూ టిఫిన్ పెట్టింది హేమ. ఇవాళ మండల విద్యాశాఖాధికారి ఆఫీసులో మీటింగు ఉండడంవల్ల నేనే పిల్లలిద్దరినీ స్కూల్లో వదిలేసి అట్నుంచి అటే మీటింగుకు వెళ్ళాను.
* * *
రాత్రి పూట మంచంపై నాకు ఇరువైపులా పడుకుని నిద్రపోవడం మా ఇద్దరి పిల్లలకు అలవాటు. నిద్రపోయే ముందు వాళ్ళకి కథలు చెప్పడం నాకు అలవాటు. ఇవాళ ఉదయం ఇంట్లో జరిగిన గొడవను ఆధారం చేసుకుని అమ్మ గొప్పతనాన్ని తెలియజేసే కథ చెప్పాను పిల్లలకు. కథ చెప్పిన తర్వాత పిల్లలు సందేహాలు అడగడం, వాటికి సమాధానాలు చెప్పడం నాకు మామూలే.
హేమ వంటగదిలో పాత్రలు తోముకుంటోంది. పిల్లలు ఇద్దరినీ రోజూ నేనే నిద్రపుస్తాను. అయితే ఇవాళ గిరి నేను ఊహించని ప్రశ్న ఒకటి వేశాడు.
“నాన్నా, నాన్నమ్మ నిన్ను ఎన్ని తిట్టినా, నాన్నమ్మ మీద కోపం తెచ్చుకోవు ఎందుకని?” అని అడిగాడు.
“ఆమె, మా అమ్మ రా. అమ్మ ఏం చెప్పినా, ఏం చేసినా మన మంచికోసమే. అందువల్ల అమ్మ మనల్ని ఏమి అనినా మనం బాధ పడకూడదు. ఆమెను గౌరవించాలి” అన్నాను.
“మరి నాన్నమ్మ నీకోసం ఏం చేసింది?”
“నాన్నమ్మ నాకోసం చాలా కష్ట పడింది. మా నాన్న అదే మీ తాతయ్య నేను నాల్గవ తరగతి చదివేటప్పుడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి నాన్నమ్మకు కష్టాలు మొదలయ్యాయి. కొన్నిరోజులు నాలుగిళ్ళల్లో పనిమనిషిగా పనిచేసింది. అయినా నన్ను, నా చెల్లెల్ని అదే మీ మేనత్తను సాకడానికి ఆ డబ్బులు సరిపోయేవి కాదు. అందుకని ఇడ్లీ అంగడి పెట్టి, చమటోర్చి మమ్మల్ని చదివించింది. అంతేకాదు మాకు మంచిబట్టలు కుట్టించేది. మాకు కావాల్సింది తీసిచ్చేది. మేమూ మా అమ్మ చెప్పినట్లు విని కష్టపడి చదువుకుని నేను టీచర్ అయ్యాను. మీ మేనత్త ఫోస్టాఫీసులో క్లర్క్ అయింది. అందువల్ల నాన్నమ్మ తిట్టినా, కొట్టినా కూడా నేను బాధపడను. కోప్పడను” అని చెప్పాను గిరికి.
వాడు ఆలోచనలో పడ్డాడు. ఈసారి నేను ఒక ప్రశ్న వాడికి వేశాను.
“మరి నీవు ఎందుకు అమ్మ మాట వినకుండా ఎదురుతిరుగుతున్నావు?” అన్నాను.
“అమ్మ ఎప్పుడూ తిడుతూ, కొడుతూ ఉంటుంది. అందుకే నేను తిరగబడతాను” అన్నాడు గిరి.
“నీవు చెప్పిన మాట వినకుండా, ఏదైనా తప్పు చేస్తేనే కదా అమ్మ తిడుతుంది. ఊరికే కొట్టదు కదా. అవునా కాదా?”
“అవును”
“చూడు గిరి నీకోసం అమ్మ ఎంతో కష్టపడుతోంది తెలుసా నీకు?”
“ఏం కష్టపడుతోంది అమ్మ?”
“నీవు నిద్రలేవక ముందే నిద్రలేచి నీకు కావాల్సింది సమకూరుస్తుంది. నీవు నిద్రలేవగానే పాలు ఇస్తుంది, స్నానానికి వేడినీళ్ళు సిద్దంచేస్తుంది. మీకు ఇష్టమైన టిఫిన్ పెడుతుంది. రోజూ స్కూలు దగ్గరకు వచ్చి విడిచి పెడుతుంది. మళ్ళీ సాయంత్రం మిమ్మల్ని తీసుకొస్తుంది. మీ బట్టలు ఉతికి, ఇస్త్రీ చేసి పెడుతుంది. మీ బూట్లు శుభ్రం చేస్తుంది. సాక్సులు రోజూ ఉతికి పెడుతుంది. మధ్యాహ్నం మీ స్కూలు దగ్గరకే వచ్చి భోజనం పెడుతుంది. సాయంత్రం మీరు ఇంటికి రాగానే మీకు స్నాక్స్ రుచిగా చేసి పెడుతుంది. మళ్ళీ సాయంత్రం మీకోసం స్నానానికి వేడినీళ్ళు సిద్దం చేస్తుంది. మీకు ఏదైనా జ్వరంగాని, దగ్గుగాని వచ్చినప్పుడు తల్లడిల్లిపోయి, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. మీకు స్కూల్లో అవసరమైన నోట్బుక్స్, పెన్నులు, చార్టులు, ఏదైనా సరే లేదనకుండా నాతో చెప్పి మీకు కొనిస్తుంది. అందుకే తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు మన పెద్దలు. ఆ క్రమంలోనే ‘మాతృదేవోభవ’ అని అమ్మకు అగ్రస్థానాన్ని కల్పించారు మన పూర్వికులు. ఇన్ని చేస్తున్న అమ్మ మీద నీవు ఎదురు తిరగవచ్చా” అని అడిగాను. వాడు మళ్ళీ ఆలోచనపడి, కాసేపు తర్వాత “ఎదురు తిరగకూడదు నాన్నా” అన్నాడు.
“మరి రేపటి నుంచి బుద్ధిగా ఉంటావా”
“ఉంటాను నాన్నా”
“సరే ఇక నిద్రపో” అన్నాను.
నా మాటలు వాడితోపాటు, శ్రద్ధగా విన్న శృతి కూడా వాడితోపాటు నిద్రలోకి జారుకుంది.
* * *
మరుసటిరోజు ఉదయం గిరి నిద్రలేచి, బ్రెష్ చేసుకుని వచ్చి హాలులో పేపర్ చదువుకుంటున్న నా పక్కన వచ్చి కూర్చున్నాడు. శృతి ఇవాళ ఇంకా నిద్రపోతోంది. హేమ వంటగదిలోంచి వచ్చి పాలు కప్పు టీపాయ్ మీద పెట్టి “గిరి పాలు చల్లారాక తాగు” అని చెప్పి నాకు టీ తీసుకురావడానికి వంటగదిలోకి వెళ్తుండగా, “అమ్మా” అంటూ వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి, “నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు నేను నీమీద తిరగబడను” అంటూ వాడి రెండు చేతులతో వాళ్ళ అమ్మ నడుముకు గట్టిగా హత్తుకున్నాడు.
“నాకు సారీ చెప్పమని నీకు ఎవరు చెప్పారు” అని నావైపు చూసి అడిగింది గిరిని.
“నాకు సారీ చెప్పమని ఎవరూ చెప్పలేదు మా. నాన్న రాత్రి కొన్ని విషయాలు చెప్పాడు. సారీ చెప్పాలని నాకే అనిపించింది. నేను ఇంకెప్పుడూ నిన్ను ఎదురించను. చెప్పినమాట వింటాను మా”అని ఏడుపెత్తుకున్నాడు.
అంతే వాళ్ళ అమ్మ మనసు కరిగిపోయింది. వెనుకకు తిరిగి వాడి కంట్లో నీళ్ళు తుడుస్తూ నావైపు చూసింది.
‘ఏమండీ, మీరంటే గిరికి అసలు భయం ఉండడంలేదు. ఎంతసేపూ నేనే అరుచుకుంటుంటే ఏం లాభం చెప్పండి. మీ భయం లేకుండా వాడిని అలా వదిలేస్తే దేనికీ పనికి రాకుండా పోతాడు. తర్వాత మీ ఇష్టం’ అని నా పట్ల ఉన్న వ్యతిరేక భావం తొలగిపోయి, “తల్లిదండ్రుల పట్ల పిల్లలకు ఉండాల్సింది భయంకాదు, గౌరవం, ప్రేమ అనే విషయాన్ని తెలియజేసిన మీ లాంటి భర్త నాకు దొరకడం నా అదృష్టం’ అన్న భావం హేమ చూపులో ప్రతిబింబించింది. అందుకేనేమో నావైపు చూస్తూ గిరి నుదుటిపై ప్రేమతో ముద్దుపెట్టుకుంది.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159
Discussion about this post