తంబళ్లపల్లె ‘పెద్దాయన’… అందరి అభిమాని ‘అప్ప’… అవినీతి మచ్చలేని రాజకీయ నేత… నిస్వార్థ ప్రజా సేవకులు కలిచెర్ల ప్రభాకరరెడ్డి (75) ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో 20 రోజులకు పైగా బెంగళూరులోని సెయింట్ జాన్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణంతో తంబళ్లపల్లె నియోజకగవర్గం ఒక పెద్ద దిక్కును కోల్పోనట్లైంది. అంతేగాకుండా ఆ నియోజకవర్గంలో ఓ శకం ముగిసినట్లే..! ప్రభాకరరెడ్డి మరణంతో ఆయన అభిమానులు శోక సంద్రంలో మునిగి పోయారు.
చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలం కలిచెర్లకు చెందిన కడప ప్రభాకరరెడ్ఢి భూస్వామ్య కుటుంబానికి చెందిన వారు. ఈయన తండ్రి నరసింహారెడ్డి. ప్రభాకరరెడ్డికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు. పెద్దమండ్యంలో అయితే ఆయన చెప్పిందే శిలాశాసనం. తంబళ్లపల్లె నియోజకవర్గం ప్రజలు ఆయన్ను గౌరవంగా ‘అప్ప’… ‘పెద్దాయన’ అని పిలుచుకునే వారు.
1989లో తంబళ్లపల్లె నుంచి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు. దీనిని బట్టి ప్రభాకరరెడ్ఢికి తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఎంత పట్టు ఉండేదో అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పార్టీ గూటికి చేరారు. 1999, 2004ల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ దక్కక పోవడంతో ప్రజారాజ్యం పార్టీలో చేరారు.
2009లో ప్రజారాజ్యం తరపున పోటీ చేసి ఓటమి చెందారు. వైసీపీ ఆవిర్భవించిన తరువాత ఆపార్టీలోకి చేరారు. అప్పటి నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. ప్రభాకరరెడ్డికి తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏనాడూ అవినీతి మచ్చ అంటలేదు. ప్రజల కోసం తన సర్వస్వం త్యాగం చేశారు. తన వద్దకు సాయం కోసం వచ్చిన వారికి కాదనకుండా సాయం చేయడం ఆయన ప్రత్యేకత. అందుకే ఆయన అంత ప్రజాభిమానం పొందగలిగారు. రాజకీయాల కోసం ఆయన ఆస్తులు కూడా పోగొట్టుకున్నారు. త
నను నమ్మిన వారికి ఏ సాయం చేయడానికైనా ఆయన వెనుకంజ వేయరు. అలాంటి నేత శాశ్వతంగా తమకు దూరం కావడంతో అభిమానులు తట్టుకోలేక పోతున్నారు. సుమారు నెల రోజుల పాటు ప్రభాకరరెడ్డికి ఆస్పత్రిలో మెరుగైన చికిత్సలు అందించినా ఫలితం దక్కలేదు. కాగా కలిచెర్ల ప్రభాకరరెడ్డికి సంతానం లేదు. ఈయన సతీమణి ఇందిరమ్మ. ఇక ఈయనకు సుధాకరరెడ్డి, మధుకర్ రెడ్డి అనే ఇద్దరు సోదరులు ఉన్నారు.
అవినీతి మచ్చలేని నేత
కలిచెర్ల ప్రభాకరరెడ్డి తన మూడన్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ఏ నాడూ అవినీతి మచ్చ అంటించుకోలేదు. పెద్దమండ్యం మండలం ఎంపీపీగా రాజకీయ జీవితం ప్రారంభించి… మూడు పర్యాయాలు తంబళ్లపల్లె శాసనసభ్యులుగా గెలుపొందారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రజలకు ఎంతో సేవ చేశారు. ప్రభాకరరెడ్డికి భక్తి చాలా ఎక్కువ. ప్రతి రోజూ తన ఇంటిలోనే గంటకు పైగా పూజలు చేసేవారు. పూజ సమయంలో ఎంతటి వారు వచ్చినా ఆయన కోసం నిరీక్షించాల్సిందే. దేవుని మీద ఎంత భక్తి ఉండేదో.. ప్రజల పట్ల కూడా అంతే భక్తితో ఆయన పని చేసేవారు. అందుకే ఆయన అంత ప్రజాభిమానం చూరగొన్నారు.
‘కలిచెర్ల’ అంటే ఎనలేని గౌరవం
కలిచెర్ల ప్రభాకరరెడ్డి వారిది పెద్ద భూస్వామ్య కుటుంబం. పెద్ద సంస్థానం. ఆయన తండ్రి నరసింహారెడ్డి నుంచి ఆ కుటుంబానికి వారసత్వం వచ్చింది. కలిచెర్ల ప్రాంతంలో వీరికి వందలాది ఎకరాల భూమి ఉంది. కలిచెర్ల ప్రాంతంలో ఏ చిన్న సమస్య వచ్చినా ప్రజలు ప్రభాకరరెడ్డి ఇంటి వద్దకు వస్తారు. అక్కడే పంచాయతీ నిర్వహిస్తారు. వారు చెప్పిన తీర్పునే అక్కడ ప్రజలు శిరసా వహిస్తారు. ప్రభాకరరెడ్డి ఇంటి ఆవరణలో ఒకే ఒక కుర్చీ ఉంటుంది. అక్కడ వారి కుటుంబానికి చెందిన వారు మాత్రమే కూర్చుంటారు.
మిగిలిన వారు ఎంతటి వారు వచ్చినా ఆ కుర్చీలో కూర్చోవడానికి వీలు లేదు. ఆ స్థాన బలిమి అలాంటిది. అక్కడ అది వంశ పారంపర్యంగా వస్తున్న సంప్రదాయం. అందుకే ఎవరైనా ముఖ్యమైన వారు వస్తే వారిని మేడ మీదకు తీసుకు పోతారు. అక్కడ తమతో పాటు కూర్చోబెట్టుకుని మాట్లాడతారు. మదనపల్లెలో ఉన్న ఇంట్లో అయితే అందరినీ సమానంగా కూర్చో బెట్టేవారు పెద్దాయన. పెద్దమండ్యం మండలంలో ప్రభాకరరెడ్డిని కాదని ఎవరూ ఏ పని చేయరు. ఆ ప్రాంత వాసులకు ఆయన మీద ఉన్న గౌరవం అలాంటిది.
ఏ ఎన్నికలు వచ్చినా అందరూ పెద్దాయన వెంటే నడిచే వారు. తన అభిమానులకు ఎంతటి ఆపద వచ్చినా ఆదుకోవడం ఆయన ప్రత్యేకత. అలాంటి నేత భౌతికంగా దూరం కావడంతో కలిచెర్ల వాసులు శోక సంద్రంలో మునిగిపోయారు. కాగా కలిచెర్ల ప్రభాకరరెడ్డి మృతి పట్ల పలువురు సంతాపం తెలియచేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
.

Discussion about this post