రైతులకు, సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే సేవలను నిలిపి వేసి ఇబ్బందులకు గురిచేయడం వైసీపీ ప్రభుత్వానికి దక్కిందని తెదేపా తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు అన్నారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదలు చేశారు.
ముఖ్యంగా మీ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులో వుండే 1-బి, అడంగల్ పత్రాలను సచివాలయాలకు పరిమితం చేయడంతో బ్యాంకుల వద్దకు వచ్చే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.
మండల కేంద్రాలలో బ్యాంకులు ఉండటం, వ్యవసాయ రుణాల కోసం వచ్చిన రైతులకు 1-బి తీసుకురావాలని చెబుతుండటంతో మళ్ళీ సొంత గ్రామంలోని సచివాలయానికి వెళ్ళి తెచ్చుకోవడానికి రెండు రోజులు పడుతోందని రైతులు వాపోవడం బాధ కలిగిస్తోందన్నారు.
అలాగే రేషన్ కార్డులలో పేర్లు నమోదు… తీసివేయడంతో పాటు మరో ప్రాంతానికి మార్చుకునే సేవలను వారం రోజులుగా అధికారులు నిలిపివేయడం అన్యాయమన్నారు.
సచివాలయాలతో పాటు మీ సేవా కేంద్రాలలో అన్ని సేవలు ఉంటే ప్రభుత్వానికి వచ్చే బాధ ఏమిటో అర్ధంకావడం లేదన్నారు. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో రైతులు, ప్రజల అవసరాలను గుర్తించి మీ సేవా కేంద్రాలలో కూడా అన్ని సేవలను పునరుధ్ధరించాలని డిమాండ్ చేశారు.
Discussion about this post