‘ఎదుటి వారికి చెప్పేటందుకే నీతులు ఉంటాయి..’ అనే మాట మనకు తెలుసు. ఇలాంటి అపహాస్యానికి గురికాకుండా ఉండాలంటే.. చెప్పే నీతులను ఆచరిస్తే తప్ప మన్నన లేదని కూడా మనకు తెలుసు. కానీ.. చెప్పే ప్రతి నీతినీ ఆచరించేది మనలో ఎందరం?
అలాగే కేవలం పుస్తకపరిజ్ఞానం మాత్రం ఉండే వాడు ఎందుకు ఉపయోగపడతాడు. జ్ఞానం అనేదానికి వాడుకలోనే మన్నన. ఆచరణలో చూపించకుండా, పని చేయకుండా.. కేవలం జ్ఞానం మాత్రం కలిగి ఉంటే ఎందుకూ కొరగాము.
అందరికీ తెలిసినదే అయినా.. ఇదే విషయాన్ని ఒక సుభాషితం ఇలా చెబుతుంది.
శాస్త్రాణ్యధీత్యాపి భవన్తి మూర్ఖా యస్తు క్రియావాన్ పురుషః స విద్వాన్
సుచిన్తితం చ ఔషధమాతురాణాం న నామమాత్రేణ కరోత్యరోగమ్
చాలా చాలా శాస్త్రాలను చదువుకున్నప్పటికీ.. ఆ శాస్త్రాలు బోధించే జ్ఞానం యొక్క ఆచరణ లేకపోయినట్లయితే చాలా మంది మూర్ఖులుగానే మిగిలిపోయినట్టే. ఆచరణలో పెట్టిన వాడే నిజంగా తెలివైన వాడు. ఎలాగంటే.. ఒక రోగికి డాక్టరు మంచి మందు ఇచ్చినంత మాత్రాన ఎలాంటి ఉపయోగం ఉండదు కదా.. ఆ రోగి దానిని సరిగ్గా తీసుకుంటేనే అనారోగ్యం నయమవుతుంది. ..అని శ్లోకభావం.
ఆచరణలేని విద్య ఎందుకూ కొరగాదు. ఈ విషయం గ్రహించడానికి మనకు సుభాషితం అవసరం లేదు. అందరికీ తెలిసిన సంగతే. మనకు నిత్య జీవితంలో అనేకానేక దృష్టాంతాలు దొరుకుతూనే ఉంటాయి. కేవలం మన గ్రహింపులో మాత్రం ఉన్న విషయాన్ని మనమూ స్వయంగా ఆచరణలో పెట్టలేక చాలా సార్లు సతమతం అవుతూ ఉంటాం.
ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు అని అందరమూ చెబుతూనే ఉంటాం. కానీ.. రాగద్వేషాలకు, ఈర్ష్యలు, అసూయలకు లోబడి ఇతరులతో సంబంధ బాంధవ్యాలు కొనసాగిస్తుంటాం. దేవుడు బయట ఎక్కడా లేడు మనలోనే ఉన్నాడు అని చెబుతూనే ఉంటాం. మళ్లీ గుడులూ గోపురాలూ చుడుతూనే ఉంటాం.
ఇతరులకు చెప్పవలసి వచ్చినప్పుడు.. ప్రతి ఒక్కరికీ చాలా సుద్దులు గుర్తుకు వస్తాయి. వారు చెప్పే మాటలను వింటే.. వారి తార్కిక దృక్పథానికి, ఆలోచనల్లో విశాలత్వానికి మనం కూడా నివ్వెరపోతాం. కానీ.. వారి వ్యక్తిగత జీవితం విషయంలో అదే సందర్భం ఎదురైనప్పుడు.. వారు వ్యవహరించే తీరు మనల్ని నివ్వెర పరుస్తుంది.
ఒక విద్య నేర్చుకుంటే అందులోని సారాన్ని మనం గ్రహించాలి. రసంలేని చెరుకుగడను మనం ఏం చేసుకుంటాం. చదువుల్లోని సారాన్ని మన ఇంగితంలోకి ఇంకించుకోకపోతే.. మన చదువులు, విలువలను పాటించలేనప్పుడు జీవితాలు కూడా వృథా అని తెలుసుకోవాలి.
శుభోదయం.
.

Discussion about this post