దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వడమనే సామెత మనందరికీ తెలుసు. దానికంటె ఇది ఇంకా తీవ్రమైన సంగతి. దానికి విరుద్ధంగా ఉండే సంగతి. ఎక్కడో ఒక చోట ఒక బలవంతుడు మనకు కీడు చేయకపోయినా సరే.. సదరు బలవంతుడి అనుచరులు పెట్రేగిపోయి.. వేధిస్తూ ఉంటే.. ఇబ్బందులు పెడుతూ ఉంటే ఏమనాలి?
బలవంతుడు చెడ్డవాడే కావచ్చు. కానీ.. సదరు బలవంతుడు చేసే ఆగడాలకంటె.. ఆ బలవంతుడి అండచూసుకుని ఎగిరెగిరి పడేవాళ్లు, బలం వాళ్ల సొంతం కాకపోయినా.. బలమదం నెత్తికెక్కి దుర్మార్గం వ్యవహరించేవాళ్లు మనకు బోలెడు మంది తారసపడుతూ ఉంటారు. మన చుట్టూ ఉండే ప్రపంచంలో ఇలాంటి వాళ్లు చాలా ఎక్కువే.
తమకంటూ ఎలాంటి విలువ లేకపోయినా, శక్తి ధైర్యం లేకపోయినా కూడా.. మరొకరి అండ చూసుకుని వేధింపులు చేసే వారి గురించి ఓ అద్భుతమైన ఉదాహరణ చెబుతుంది ఈ సుభాషితం..
రవిరపి న దహతి తాదృగ్ యాదృక్ సందహతి వాలుకానికరః
అన్యాస్మాల్లబ్ధపదో నీచః ప్రాయేణ దుఃసహో భవతి
సూర్యుడు నేరుగా మన శరీర చర్మాన్ని కాల్చేయడం జరగదు. సూర్యకాంతి వలన చర్మం కాలిపోదు. కానీ అదే సూర్యుడి కాంతి వలన వేడెక్కి ఉండే ఇసుక మన చర్మాన్ని కాల్చేస్తుంది. అలాగే ఒక నీచుడు- మరొకరి బలం చూసుకుని చెలరేగిపోతూ ఉండే తరహాలోని వాడు మాత్రం.. నిత్యం అసలు బలవంతుడి కంటె ఎక్కువగా అందరినీ బాధిస్తూ ఉంటాడు. -అనేది శ్లోకభావం.
ఇక్కడ మనం మిడిల్ మేనేజిమెంట్ మనుషుల గురించి చెప్పుకోవాలి. ఒక హోదాకు, పదవికి తగని వ్యక్తులు ఏదో ఒక పరిస్థితుల్లో ఆ హోదాలోకి వచ్చేస్తారు. తాము తెలివైన వాళ్లం అని చాటుకోవాలని, తమను తెలివైనవాళ్లుగా, సమర్థులుగా అందరూ గుర్తించాలని వారికి చాలా తాపత్రయం ఉంటుంది. అందుకోసం ఆరాటపడుతుంటారు. అందుకోసం తమకు తెలియని విషయాల్లో కూడా వేలు పెట్టడం, తమకింద స్థాయిలో ఉండే సమర్థులను వేధించడం చేస్తుంటారు.
ఇలాంటి అనుభవాలు మనలో చాలా మందికి ఉంటాయి. ఆఫీసులో అసలు యజమాని కూడా కఠినం కావచ్చు. కానీ.. అతడు స్వయంగా మనల్ని వేధించడం ఉండకపోవచ్చు. కానీ.. సదరు యజమాని ప్రాపకంలో ఉండే మిడిల్ మేనేజిమెంట్ వాళ్లు మాత్రం చాలా చాలా అతి చేస్తూ వేధిస్తూ ఉంటారు.
ఆఫీసు వాతావరణం అని మాత్రమే కాదు.. బలవంతుడి అండ చూసుకుని వాడి ప్రాపకంలోని ఇతరులు చెలరేగిపోవడం అనే సిద్ధాంతం మనం నిత్య జీవితంలో ఏ వ్యవహారాలకు అన్వయించి చూసినా సత్యమే అని కనిపిస్తుంది.
అలాంటివాళ్లను మనం ఉపేక్షించడం తప్ప చేయగలిగింది ఏమీ లేదు. ignore చేయాలి అంతే. నడిమధ్యాహ్నపు వేళ చర్మాన్ని కాల్చేసే ఇసుక- సూర్యుడు కనుమరుగయ్యేవేళ సాయంత్రానికి సెగలు మాత్రమే కక్కుతూ.. సూర్యుడు కనిపించని నడిరాత్రి వేళకు చల్లారిపోతుంది. ఈ మిడిల్ మేనేజిమెంట్ అర్థతెలివితేటల వ్యక్తులు కూడా అంతే. బలవంతుడి బలం తమవైపున్నంత వరకే చెలరేగుతారు. బలవంతుడు ఇంకోవైపుకు మళ్లితే.. చప్పున చల్లారిపోతారు. నోరుమూసుకుని పడుంటారు. అందుకే ఇలాంటి వారిని ఇగ్నోర్ చేయడం తప్ప- మరొక మార్గం లేదు.
శుభోదయం
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
 
	    	 .
. 
    	 
		    
Discussion about this post