బుచ్చినాయుడుకండ్రిగ: గ్రామకంఠానికి చెందిన ప్రభుత్వ భూమిలో యంత్రాలతో గ్రావెల్ తరలిస్తున్నా పట్టించుకునే స్థితిలో అధికారులు లేరని తెదేపా తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు అన్నారు.
మండలంలోని భవానీశంకరాపురం గ్రామానికి చెందిన గ్రామకంఠం సర్వే నంబరు 116 లో రెండు రోజులుగా పెద్ద పెద్ద టిప్పర్ల ద్వారా యధేచ్చగా గ్రావెల్ తరలిస్తున్నారన్నారు.
ఓ నిర్మాణ కంపెనీకి చెందిన వాహనాలలో మట్టి , గ్రావెల్ ఎత్తుకెళుతున్నా సచివాలయ వ్యవస్థ ఏంచేస్తున్నదని ప్రశ్నించారు.
గ్రామంతో పాటు దళితవాడకు చెందిన పశువులకు అన్నివేళలా ఉపయోగపడే భూములను కొందరు అమ్ముకోవడం సిగ్గుచేటు కాదా అని అన్నారు.
రెవెన్యూ యంత్రాంగం స్పందించి వెంటనే గ్రావెల్ దోపిడీని నిలువరించాలని ప్రకటనలో డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామస్థులతో కలసి అడ్డుకుంటామని హెచ్చరించారు.
Discussion about this post