రోజా కన్నీళ్లు పెట్టుకున్నారు. కన్నీళ్లు పెట్టుకున్నది సినీ నటి రోజా మాత్రమే. రాజకీయ నాయకురాలు రోజా కాదు. ఎందుకంటే.. ఆమె తన సినీ జీవిత ప్రస్థానంలో ఎదురైన దెబ్బలు, చేదు అనుభవాలు, నష్టాలు, అప్పులు, అవమానాలు గుర్తు చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. టీవీ షోలలో నవ్వులకు, కన్నీళ్లకు ప్రేక్షకుల దృష్టిలో ఎప్పుడో విలువ తగ్గిపోయింది. జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో జడ్జిలు నవ్వే నవ్వుల కారణంగా నవ్వులంటేనే ఒక నాటకంలాగా ప్రజలకు అభిప్రాయం ఏర్పడింది. అలాగే కుటుంబాల్లో ఉండే గొడవల్ని బుల్లితెర సాక్షిగా ప్రపంచానికి చెప్పి క్యాష్ చేసుకోవాలనుకునే ‘బతుకు జట్కాబండి’ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్న కొందరి ఏడుపుల కారణంగా.. కన్నీళ్లకు కూడా విలువ లేకుండా పోయింది. ఏతావతా టీవీ కార్యక్రమాల్లో కనిపించే ఏ ఉద్వేగమూ నిజం అనుకోలేని పరిస్థితి. అలాంటి సామాజిక వాతావరణంలో ఒక టీవీషోలో సినీనటి రోజా కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు.
కానీ, ఇవి విలువలేని కన్నీళ్లు కావు. నిజమైన ఉద్వేగంతోనే వచ్చినవి. ఆమె కన్నీళ్లకు తోడుగా.. ఆ షోలో పాల్గొంటున్న వాళ్లందరూ కూడా సమానంగా ఎమోషనల్ అయ్యారు. ఇలా కలసికట్టుగా అందరూ ఏడవడం కూడా టీవీషోల్లో కొత్త కాదు. కానీ.. రోజా ఏ గతాన్ని గుర్తుచేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారో అది నిజంగానే బాధాకరమైనది.
రోజా డిగ్రీ చదువుతున్న రోజులనుంచే 1991 నుంచే సినిమాలు చేస్తున్నారు. కెరీర్ తొలిరోజుల్లో ఉండగానే.. ఆమె సెల్వమణితో ప్రేమలో పడ్డారు. తనను ఆర్థికంగా ముంచేసిందని అంటున్న సమరం సినిమా 1994 నాటిది. ఆ సినిమాకు చేసిన అప్పుల్ని 2002 వరకు తీరుస్తూనే ఉన్నానని ఆమె చెప్పడం ఆశ్చర్యకరం. ఎందుకంటే.. మధ్యలో రోజా సినీ కెరీర్ చాలా పీక్స్ లో కూడా ఉంది. స్టార్ హీరోయిన్ వైభవాన్ని ఆమె కొన్ని సంవత్సరాల పాటు అనుభవించారు. కానీ.. ఒక్క సినిమా కొట్టిన దెబ్బ నుంచి ఆమె కోలుకోలేకపోయారన్నది నిజం. ఆ తర్వాతి కాలంలో సినీ నిర్మాణం వంటి ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. నిలదొక్కుకున్నట్లే కనిపిస్తోంది.
ఈ దశలో ఆర్థిక వ్యవహారాల గురించి విలపించడం తప్పని అనలేం. కానీ ఆమెకు కలిగిన దుఃఖం వెనుక వర్తమాన రాజకీయ పరిస్థితి, ఇప్పుడు ఎదురవుతున్న ఇబ్బందులు, ఇవన్నీ కూడా పరోక్షంగా కారణం అయిఉండవచ్చు. రాజకీయంగా పార్టీకి ఎంత కీలకమైన నాయకురాలిగా గుర్తింపు ఉన్నప్పటికీ.. ఆ దామాషాలో ఆమెకు ప్రభుత్వపదవుల్లో ప్రాధాన్యం దక్కలేదన్నది అందరికీ తెలిసిందే. మంత్రి పదవి దక్కే అవకాశం కూడా కనిపించడం లేదు. ఈ నేపథ్యం కూడా ఆమె కన్నీటికి కొంత హేతువుగా మారిఉండొచ్చు.
రోజా- ఆర్థిక వ్యవహారాలు, దాటివచ్చిన ఎత్తుపల్లాలకు సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి గానీ.. అవన్నీ అప్రస్తుతం. అయితే సుప్రసిద్ధమైన రజనీకాంత్ సినిమా డైలాగు ఒకటి గుర్తు చేసుకుని.. రోజా విలాపానికి సంబంధించిన విషయాల్ని తూకం వేసుకోవాల్సిన అవసరం ఉంది.
‘‘అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో ఎక్కడా లేదు’’ అంటాడు నరసింహ చిత్రంలో రజనీకాంత్.
ప్రతి హీరో కూడా తన సినిమాలో ఇలాంటి పంచ్ డైలాగులు ఉండాలని కోరుకుంటాడు. కానీ, రజనీ పంచ్‌కు ఒక ప్రత్యేకమైన విలువ ఉంది. ఈ డైలాగు కూడా చాలా ప్రసిద్ధం. ఆ సినిమాలో తగినట్టు వాడిన- ఆడ- మగ అనే పదాలను మరచిపోతే.. ‘‘అతిగా ఆశపడే వారు- అతిగా ఆవేశపడేవారు.. సుఖపడడం చరిత్రలో ఎక్కడా ఉండదు.’’
చిన్న చిన్న చిట్టీ వ్యాపారాలు నడిపి.. దివాలా తీసి బిచాణా ఎత్తేసే సగటు మహిళల నుంచి, విజయమాల్యా వరకు సకల దృష్టాంతాలు నిరూపించే సత్యం ఇదే.
రోజా విషయంలో కూడా కేవలం రెండు మూడు చిత్రాలు చేసిన అనుభవంతోనే.. భారీచిత్రం నిర్మాణానికి సాహసించడం అతిగా ఆశపడడం అనుకుంటే గనుక.. ఆ ఆశ ఆమెను కుదేలు చేసేసింది. కెరీర్ గురించి తాను పెద్ద స్టార్ అయిపోతానని ఆమె పెట్టుకున్న ఆశలు మాత్రం అతి కాదు. ఎందుకంటే.. స్టార్ హీరోయిన్ అయంది. కానీ ఆ ఆర్జన మొత్తం.. నిర్మాణంలోకి వెళ్లి చేసిన ప్రయోగం దారుణంగా మింగేసింది. కేవలం రోజా ఆర్థిక నష్టాలు.. సినిమాల్లో అతి ఆశతో చేసిన ప్రయోగాలు మాత్రమే కాదు. రాజకీయ జీవితం కూడా అలాగే అయింది.
రాజకీయంగా మంచి వాక్పటిమ, భాష మీదపట్టు, ఎలాంటి తలతిక్క ప్రశ్న ఎదురైనా తెలివిగా సమాధానం చెప్పగల నేర్పు ఉన్న కొద్ది మందిమహిళా నాయకులలో రోజా ఒకరు. ఎమ్మెల్యే కావడం అనే భాగ్యం ఆమెకు ఆలస్యంగా దక్కింది. అయితే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఆమె ఎంతగా పాటుపడినప్పటికీ కలగన్న మంత్రిపదవి మాత్రం దక్కలేదు. కేవలం జిల్లాలో కుల సమీకరణలు మాత్రమే ఆమెకు పదవి దక్కకపోవడానికి కారణం అనుకుంటే పొరబాటు. ఒక రకంగా చెప్పాలంటే.. ఆ తరహా విమర్శలను ముఖ్యమంత్రి జగన్ ఏదో ఆపద్ధర్మంగా వాడుకోవాల్సిందే తప్ప.. ఖాతరు చేసే రకం కాదు. కానీ రోజాకు మంత్రి పదవి దక్కలేదు. రోజా పార్టీకి ఎంతగా ఉపయోగపడినా.. చాలా సందర్భాలలో ఔచిత్యం ఎరగని ఆమె అతి ఆవేశం ఆమె రాజకీయ కెరీర్ ను ఇంతగా దెబ్బతీసింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరితో అసెంబ్లీ హైదరాబాదులో ఉండగా సభలో జరిగిన వాగ్వాదంలో.. రోజా వాడిన భాష, తిట్టిన తిట్లు అవి తెలిసిన వారికి జుగుప్స కలిగిస్తాయి. బాహ్యప్రపంచానికి తెలియకపోయినా.. సభలో ఉన్న ఆమె పార్టీ నాయకులందరికీ ఆ సంగతులు తెలుసు. అలా ఆమె ప్రదర్శించిన అతి ఆవేశం.. ఆ రోజుల్లో పార్టీకి ఉపయోగపడింది. కానీ పార్టీ దృష్టిలో ఆమెకు రాగల అవకాశాలను మాత్రం దెబ్బతీసింది.
బహుశా.. కోల్పోయిన డబ్బులు, నష్టాలను తలచుకుని రోజా కన్నీళ్లు పెట్టుకున్న సందర్భంలో.. ఇలాంటి రాజకీయ ఎదురుదెబ్బలు, కెరీర్ మందగమనం కూడా ఆమె మదిలో మెదిలి ఉంటుందేమో..!
రోజా కన్నీళ్లు ఒక ఉదాహరణ మాత్రమే.. వీటినుంచి ఎవరు నేర్వగల జీవితపాఠాలు వాళ్లు నేర్వవచ్చు.
.

Discussion about this post