జగన్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఓటిఎస్ పథకం ఫలితాలను ఇవ్వడంలేదు. దీని ద్వారా పేదలకు ఇళ్లను కట్టించి ఇవ్వాలని జగన్ ప్రభుత్వం సంకల్పించినా, ఇందులో కొంచెం మతలబు ఉంది. పేదలు తమకు ఇళ్లు కావాలంటే వాటిని ప్రభుత్వం వద్దే కొంత మేర ధర చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. అయితే ఇది అంతగా ప్రజాదరణకు నోచుకోవడం లేదు.
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో పేదల నుంచి డబ్బు వసూలు చేయడానికి, ప్రభుత్వ చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. ఈ పథకంపై పేదలు తిరుగుబాటు చేస్తున్నారు. ఎలాగోలా ఇళ్లకు సంబంధించిన వసైళ్ల బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగించినా.. స్పందన అంతంత మాత్రగానే ఉంది. వసూళ్లు మందకొడిగా ఉండటంతో, చేసేదిలేక ఉద్యోగులకు ప్రభుత్వం లక్ష్యం విధిస్తోంది. వసూళ్లు చేయలేకపోతే ఉద్యోగం వదులుకోమని హుకుం జారీ చేస్తున్నారు. ఈ కారణంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఒన్‌టైమ్ సెటిల్‌మెంట్.. సంపూర్ణ గృహ హక్కు పేరిట పేదలకు ఏదో గొప్ప మేలు చేస్తున్నామంటూ భారీగా నగదు వసూలు చేసేందుకు తెరపైకి వచ్చిన పథకం. గత ఏడాది డిసెంబరు 8నుంచి అనధికారికంగా ఈపథకం ప్రారంభం కాగా.. అధికారికంగా పేదలకు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని అదే నెల 21న పశ్చిమగోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి జగన్ ఆర్భాటంగా ప్రారంభించారు. పేదలకు ఇంత మేలు ఏ ప్రభుత్వమూ చేయలేదంటూ ‘వసూళ్ల’ పథకాన్ని ‘మేలు’ చేసేదిగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే సీఎం మాటలు విన్న తర్వాత ఏమైందో ఏమో గానీ ఓటీఎ్‌సకు స్పందన కరువైంది. జగన్ సభకు ముందు పశ్చిమ గోదావరి జిల్లాలో ఓటీఎస్ కింద పేదలు రూ.15.4 కోట్లు చెల్లిస్తే.. నాటినుంచి ఈనెల 10 వరకూ కేవలం రూ.5లక్షలు రాబట్టేందుకు అధికారులు నానా తంటాలు పడ్డారు. సీఎం వచ్చి స్వయంగా రిజిస్ర్టేషన్ పత్రాలు అందజేయడంతో ఇక పథకం పరుగులు పెడుతుందని, లబ్ధిదారులు వెల్లువలా ముందుకొస్తారని అనుకున్న అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. సీఎం వచ్చి వెళ్లాక స్పందన పెరగకపోగా.. ఒక్కసారిగా ఎందుకు పడిపోయిందనేది ఎవరికీ అంతుబట్టడం లేదు.
అయితే ఓటీఎస్ ద్వారా కనీసం రూ.4వేల కోట్లు రాబట్టాలని వైసీపీ ప్రభుత్వం లెక్కలు వేసింది. అందుకు తగ్గట్టుగానే దానిపై ఊకదంపుడు ప్రచారం చేసి మరీ వసూళ్లకు రంగంలోకి దిగింది. ఒక్క పదివేలు కడితే చాలు.. ఇంటిపై శాశ్వత హక్కులు లభిస్తాయంటూ ఇప్పుడేదో ఇళ్ల యజమానులకు అసలు హక్కులు లేవన్నట్టుగా ప్రచారం చేసింది. రిజిస్ర్టేషన్ పత్రాలు చేతికందడంతోనే ఇంటి విలువ భారీగా పెరిగిపోతుందని పేదలంతా లక్షాధికారులు అయిపోతారన్న స్థాయిలో కలరింగ్ ఇచ్చింది. ఈ పథకం ద్వారా ఇప్పటికప్పుడు ప్రభుత్వానికి తక్షణం కనీసం రూ.వెయ్యి కోట్లు వచ్చిపడతాయని, రెండు మూడు నెలల్లో మిగిలిన రూ.3వేల కోట్లు దశల వారీగా వచ్చి చేరతాయని భావించారు. కానీ క్షేత్రస్థాయిలో మొత్తం రివర్స్ అయింది. ఇంటి పత్రాలు తీసుకోవాలని భావించిన వారంతా సీఎం సభ కంటే ముందే నగదు కట్టేశారు. ఆ సమయంలోనే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ.200కోట్లకు పైగా వసూలయ్యాయి. సీఎం పథకాన్ని ప్రారంభించి నెల రోజులు అవుతున్నా ఆ తర్వాత వసూళ్లు రూ.100కోట్లు కూడా దాటలేదు. అంటే మొత్తం కలిపినా రూ.500కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం ఆశలు పెట్టుకున్న రూ.4వేల కోట్ల సంగతి ఇక అంతే అన్నట్టుగా తయారైంది.
ప్రజల్లో స్పందన అంతంతమాత్రంగా ఉండటంతో ప్రభుత్వం జవనరి 10న ఓటీఎస్ మెగా మేళా నిర్వహించింది. కానీ ప్రొబేషన్ కోసం సచివాలయాల ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో ఈ మేళా అట్టర్ ఫ్లాప్ అయింది. ఉద్యోగులంతా ఆందోళనలో ఉండటంతో అనేకచోట్ల మేళాను నిర్వహించేవారే కరువయ్యారు. యంత్రాంగం నుంచే పెద్దగా ఆసక్తి లేకపోవడంతో లబ్ధిదారులూ పాల్గొనలేదు. దీంతో ఇప్పుడు కాకుండా మరోసారి మెగా మేళా నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు.
ఒకవైపు కరోనా పరిస్థితుల కారణంగా ఉపాధి లేకపోవడం, పంటలకు తెగుళ్లు లాంటి అనేక సమస్యలతో ప్రజలు ఆర్థికంగా సతమతమవుతున్న సమయంలోనే ప్రభుత్వం ఓటీఎస్ తేవడంతో దానిపై ఎవరూ ఆసక్తి చూపలేదు. అందులోనూ ఎప్పటినుంచో ఉంటున్న ఇళ్లకు ప్రభుత్వం కొత్తగా ఇచ్చే హక్కులు ఏమిటంటూ పలుచోట్ల లబ్ధిదారులు నిలదీస్తున్నారు. ఓటీఎ్‌సలో నగదు చెల్లిస్తే ఇంటిని అమ్ముకోవచ్చంటూ ప్రభుత్వం చేసిన ప్రచారం కూడా నెగెటివ్ అయింది. ఏళ్ల తరబడి ఉంటున్న సొంత ఇంటిని అమ్ముకోవడమేంటని అధికారులను పేదలు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు తాము అధికారంలోకి వస్తే ఉచితంగా రిజిస్ర్టేషన్ చేయించి ఇస్తామని టీడీపీ ఇచ్చిన హామీ కూడా ప్రజలపై ప్రభావం చూపింది. ఇంతకాలం లేని హడావిడి ఇప్పుడు ఎందుకని.. కొంతకాలం ఆగుదామని పేదలు పునరాలోచనలో పడ్డారు.
.

Discussion about this post