సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు కేవలం ఒక అద్భుతమైన సినీ గీతరచయిత మాత్రమే కాదు. అంతకంటె అద్భుతమైన తెలుగు భాషా ప్రేమికుడు, భాషా సేవకుడు. తెలుగు భాష పట్ల మమకారంతో పరితపించి పోయే మనీషి. సహృదయుడు, నిగర్వి, ఆత్మీయంగా పలకరించే మంచి మనిషి- సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
అమెరికాలో- తెలుగునేలకు దూరంగా స్థిరపడిన తర్వాత.. అలాంటి తెలుగుదనం నిలువెత్తు ప్రతిరూపాన్ని, తెలుగుతల్లి ముద్దు బిడ్డని ప్రత్యక్షంగా చూడడం, ఆయనతో కలిసి జీవితపు అత్యంత విలువైన మధుర క్షణాలను గడపడం.. ఆయనలోని స్నేహ మాధుర్యాలు, విజ్ఞాన పరిమళాలను ఆస్వాదించే అదృష్టం దక్కడం నా భాగ్యం.
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.. సిలికానాంధ్ర నిర్వహించే అనేక కార్యక్రమాలకు చాలా సార్లు అమెరికా వచ్చారు. కాలిఫోర్నియా, బే ఏరియా ప్రాంతాల్లో ఇక్కడ నిర్వహించే అనేక కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ప్రత్యేకించి సిలికానాంధ్ర నిర్వహించే ‘మనబడి’ లో ఆయనతో అనుభవాలు ప్రత్యేకమైనవి.
ప్రవాసాంధ్రుల పిల్లలకు తెలుగు భాషను నేర్పడానికి ఏర్పాటైనది మనబడి. సీతారామశాస్త్రి మనబడిలో ఇక్కడి మా పిల్లలకు తెలుగు పాఠాలు చెప్పారు. తెలుగు భాష, తెలుగుదనం ఔన్నత్యం గురించి వారిలో గౌరవం కలిగేలా, ప్రేమ పుట్టేలా.. ఆయన తన అనుభవసారాన్ని జోడించి వారికి చెప్పారు.
ఆ సందర్భంలోనే ఓసారి సిలికానాంధ్ర సారథి ఆనంద్ కూచిభొట్ల ఇక్కడి తెలుగు వారందరితో కలిసే చిన్న సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలోనే శాస్త్రిగారు.. తన తండ్రి డాక్టర్ సివి యోగి గారి గురించి రాసిన పుస్తకాన్ని కూడా ఆవిష్కరించారు. ఆ కార్యక్రమంలో తన సుదీర్ఘమైన సినిమా గీతరచయిత ప్రస్థానం నుంచి.. అనేక అనుభవాలను పంచుకున్నారు. ప్రత్యేకించి కొన్ని సినిమాల ఒక్కొక్క పాటను ప్రస్తావిస్తూ.. ఆయా పాటల వెనుక నేపథ్యం, వాటిని రాయడంలో జరిగిన మధనం ఇత్యాది విషయాలను అన్నీ మాకు వివరించి చెప్పారు.

సిరివెన్నెల అంతరంగాలు అనే కార్యక్రమం పేరిట, సీతారామ శాస్త్రి గారు అమెరికాలో పలు నగరాల్లో పర్యటిస్తూ శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియా కూడా వచ్చారు. ఆ పర్యటన నిమిత్తం, సాహితీ అభిమానులందరినీ కలిసి వారు రాసిన పాటల వెనుక అంతరార్థాన్ని, వాటిలో ఉన్న సామాజిక స్పృహని అందరితో పంచుకున్నారు.
ఆ క్రమంలో వారితో ప్రత్యేకంగా ఒక పది నిముషాలు మాట్లాడే అదృష్టం కూడా కలిగింది. ఎంతో ఆప్యాయంగా భుజం మీద చేయి వేసి పలకరించారు. వారి స్నేహ భావానికి, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరితో నవ్వుతూ అరమరికలు లేకుండా మాట్లాడటం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేసింది. అంతటి సరస్వతీ పుత్రుడు, అందరూ అడిగిన ప్రశ్నలకు ఎంతో ఓపికగా మంచి చతురోక్తులతో సమాధానం చెప్పడం, ఎన్నో మంచి జ్ఞాపకాలను మిగిల్చింది.
ఆ తరువాత వారు పలుమార్లు అమెరికా వచ్చినప్పుడు వారిని కలవడం జరిగింది. మొదటి సారి ఎంత ప్రేమగా పలకరించారో, ప్రతిసారీ అదేరీతిన అంతే అభిమానంతో ముచ్చటించారు. వారితో సంభాషించిన తరువాత వారు ఒక మానవతా వాది, సామజిక స్పృహ కలిగిన వారు అని నాకు అనిపించింది. రోజు రోజుకు విలువలు పతనమైపోతున్న నేటి తరంలో, తన మాటలతో పాటలతో ఎంతోమంది హృదయాలను స్పృశించి నేటి యువతరంలో మార్పునకు కారకులైన ఆదర్శ మూర్తి అని అనడానికి ఏ మాత్రం సందేహం లేదు.
సిరివెన్నెల ఒక అద్భుతం. ఆయనతో గడిపే ప్రతి క్షణం కూడా.. తెలుగుతల్లికి నీరాజనం పడుతున్నట్లే ఉంటుంది. అలాంటి సీతారామశాస్త్రి గారు ఇక లేరంటే గుండె బరువెక్కుతుంది. ఆయన అస్తిత్వం, ఆయన ముద్ర లేని తెలుగు సినిమా పాటను ఊహించుకోవాలంటేనే భయం కలుగుతుంది.
ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటూ..
.. కాజ రామకృష్ణ
శాన్ రమోన్, కాలిఫోర్నియా, యూఎస్ఏ
Discussion about this post