ప్రత్యర్థులు ఇంకా తేరుకోనే లేదు. ఎన్నికల వాతావరణం, వేడి వారిలో జ్వలిస్తున్నట్లే లేదు. ఈలోగా… ఆపద్ధర్మ ముఖ్యమంత్రి గులాబీ బాస్ కేసీఆర్.. తమ పార్టీ ప్రచారాన్ని రెండో అంచెలోకి తీసుకువెళ్లిపోతున్నారు. అసెంబ్లీని రద్దు చేసిన రెండో రోజే.. భారీ బహిరంగ సభ పెట్టి.. ఎన్నికల ప్రచారానికి శ్రీకారం దిద్దిన కేసీఆర్.. అక్టోబరు 3వ తేదీని మలి ముహూర్తంగా ఎంచుకుని.. అక్కడినుంచి వరుస సభలతో దూసుకుపోబోతున్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి.. ఈ ఎన్నికలను చాలా కాన్ఫిడెంట్ గా ఎదుర్కొంటోంది. ప్రత్యర్థుల బలంపై వారికే సరైన ఆత్మవిశ్వాసం లేకపోవడం.. కూటమిగా తప్ప.. ఒంటరిగా కేసీఆర్ ను ఎదుర్కొనే స్థితిలో లేం అన్నట్లుగా వారంతా వ్యవహరిస్తుండడం కేసీఆర్ కూటమికి అదనపు బలం అని చెప్పాలి.
మహా కూటమి ముసుగులో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం, తెజస, సీపీఐ ఇంకా సీట్ల పంపకంలో కుమ్ములాడుకుంటూనే ఉన్నాయి. వీటి మధ్య పంపకాలు ఇప్పట్లో ఒక కొలిక్కి వచ్చే వాతావరణం కనిపించడం లేదు. తెరాస తర్వాత భాజపా కూడా భారీ బహిరంగ సభతో ప్రచారం మొదలెట్టేసింది. మహా కూటమి ఇంకా సోదిలోకి రాలేదు. ఈ ఎడ్వాంటేజీని కేసీఆర్ వాడుకుంటున్నారు.
అక్టోబరు 3 నుంచి ఆయన వరుస బహిరంగసభలతో దూసుకెళ్లబోతున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో ఏకగా 100 బహిరంగసభలు నిర్వహించాలనేది తెరాస టార్గెట్ గా చెబుతున్నారు. అన్ని సభలు పెట్టకపోయినప్పటికీ.. సాధ్యమైనన్ని ఎక్కువ సభలు పెడతారని మాత్రం పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
.

Discussion about this post