చారిత్రక నగరిలో నవశకం ఆరంభం!
మదనపల్లి ‘జిల్లా’ స్వప్న సాకారం
జనగణమన స్వరధార… జ్ఞాన గంగల పురిటిగడ్డకు రాజముద్ర
అనంత కాలప్రవాహంలో అక్షరానికి, ఆత్మగౌరవానికి చిరునామాగా నిలిచిన మదనపల్లి గడ్డపై నేడు నూతన ఉషస్సు ఉదయించింది. ఆకాశమంత ఆశతో, సముద్రమంత ధైర్యంతో ఆ ప్రాంత ప్రజలు కన్న ‘జిల్లా కేంద్రం’ కల నిజమవుతోంది. కూటమి ప్రభుత్వం తన ఎన్నికల వాగ్దానాన్ని శిరోధార్యంగా భావించి… మదనపల్లిని జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు సోమవారం నాడు మంత్రివర్గ ఆమోదముద్ర వేయడంతో ఈ ప్రాంతంలో పండగ వాతావరణం నెలకొంది. డిసెంబరు 31న వెలువడనున్న అధికారిక నోటిఫికేషన్, మదనపల్లి చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి నాంది కానుంది. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా రూపుదిద్దుకుంది.
చరిత్ర పుటల నుంచి.. విశ్వ యవనికపైకి!
మదనపల్లి కేవలం ఒక పట్టణం కాదు.. అది ఒక మేధోమథన క్షేత్రం. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ కవిత్వధారతో పునీతమైన ఈ నేల… భారత జాతీయ గీతానికి స్వరకల్పన జరిగిన పవిత్ర స్థలి. ఇక్కడి బిసెంటు థియోసాఫికల్ కళాశాల ప్రాంగణంలోనే ‘జనగణమన’ ఆంగ్లంలోకి అనువదించబడి, భారతావని గుండె చప్పుడైంది.
జ్ఞాన ధారల ప్రవాహం
ఐరిష్ కవయిత్రి అనీబిసెంట్ అక్షర దీపాన్ని వెలిగించిన చోటు.. దార్శనిక వేత్త జిడ్డు కృష్ణమూర్తి ‘రిషి వ్యాలీ’ ద్వారా ప్రపంచానికి జీవన తత్వాన్ని బోధించిన దివ్యధామం. ప్రకృతి ఒడిలో సంస్కృతీ సంప్రదాయాల కలబోతగా మదనపల్లి నిలిచింది.
632 రోజుల అలుపెరుగని ‘పోరాట యాగం’
గత ప్రభుత్వ నిర్లక్ష్యపు నీడలో మదనపల్లి అస్తిత్వం మరుగున పడిపోతుండగా, ఇక్కడి ప్రజలు కంఠమెత్తి గర్జించారు. ‘జిల్లా సాధన సమితి’ ఆధ్వర్యంలో అలుపెరుగని దీక్షతో సాగిన 632 రోజుల ప్రజా ఉద్యమం ప్రజాస్వామ్య చరిత్రలో అరుదైనది. ఎండకు ఎండి, వానకు తడిసి.. పాలకుల ఉదాసీనతను ఎదిరించి, తమ జిల్లా హక్కు కోసం సాగించిన ఈ సుదీర్ఘ పోరాటం నేడు విజయతీరాన్ని తాకింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ఈ ప్రజా ఆకాంక్షను గౌరవిస్తూ మదనపల్లికి జిల్లా కిరీటాన్ని అలంకరించింది.
అస్తిత్వ పోరాటం: పేరుపై రేగుతున్న నిరసన జ్వాల
విజయోత్సాహం ఒకవైపు ఉంటే.. జిల్లాకు ‘అన్నమయ్య’ పేరును స్థిరీకరించడంపై అసంతృప్తి సెగలు పుడుతున్నాయి. పదకవితా పితామహుడు అన్నమయ్య పట్ల అపారమైన గౌరవం ఉన్నా.. మదనపల్లి చారిత్రక ప్రాభవం దెబ్బతినకూడదన్నది ఉద్యమకారుల వాదన. రాజంపేట సంస్కృతికి ప్రతీకగా ఉన్న పేరును, జాతీయ గీతానికి నిలయమైన మదనపల్లిపై రుద్దడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. “మదనపల్లి గడ్డ.. మదనపల్లి పేరే ముద్దు” అన్న నినాదం ఇప్పుడు పట్టణమంతా మార్మోగుతోంది.
విజయోత్సవాల జైత్రయాత్ర..
జిల్లా కేంద్రం ఆవిర్భావానికి సాక్ష్యంగా బుధవారం ఉదయం 11 గంటలకు మదనపల్లి జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఒక మహా ప్రదర్శన జరగనుంది. తదనంతరం.. మదనపల్లి, తంబళ్లపల్లి, పీలేరు, పుంగనూరు నియోజకవర్గాల నుండి జనసమీకరణ చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించి ఘనంగా కృతజ్ఞతలు తెలియజేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని.. మదనపల్లి కీర్తి దశదిశలా వ్యాపించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పరిపాలనా వికేంద్రీకరణతో మదనపల్లి ప్రగతి పథంలో పరుగులు తీయాలని, చారిత్రక అస్తిత్వాన్ని కాపాడుకుంటూ నవశకాన్ని నిర్మించాలని ఆకాంక్షిద్దాం!
-వలిపి శ్రీరాములు.
.

Discussion about this post