ఏపీలో ప్రభుత్వమే ఆన్ లైన్ పద్ధతిలో సినిమా టకెట్లను విక్రయించడమూ, ఆ సొమ్మును తమ వద్దనే ఉంచుకుని నెల తర్వాత.. నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎవరికి దక్కవలసిన వాటాలు వారికి చెల్లించే లాగా చేయబోతున్న ఏర్పాటు పట్ల రకరకాల అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఒకవైపు సినీ పెద్దలు కోరితేనే.. ఈ ఏర్పాటు తెస్తున్నట్లు పేర్ని నాని ప్రకటించగా మరోవైపు.. చిరంజీవి నాగార్జున సీఎం జగన్మోహన్ రెడ్డిని కోరడం వల్లనే ఈ ఏర్పాటు జరిగిందని సినీనటి, రోజా కూడా అన్నారు.
నాయకులు ఇలా మాట్లాడడం మీదనే, అంటే సినిమా వాళ్లు అడిగితేనే ఈ ఏర్పాటు చేశాం అనడం మీదనే బోలెడు సెటైర్లు పేలుతున్నాయి. ఆ నేపథ్యంలో ప్రతి విషయాన్నీ తనదైన శైలిలో దెప్పిపొడుస్తూ విమర్శలు చేసే సీనియర్ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఒక లేఖ రాశారు.
ఆయన ముందుగా.. సినిమా టికెట్ల అమ్మకం వ్యవహారానికి సంబంధించి అభిప్రాయం తెలియజేయడానికి తనకున్న అర్హత ఏమిటో స్పష్టంగా తెలియజెప్పుకున్నారు. ఒక మాజీ ఎగ్జిబిటర్ గా ఈ సూచన చేస్తున్నా అంటూ ముఖ్యమంత్రికి విన్నవించారు.
సినిమా టికెట్లు ఆన్ లైన్లో విక్రయించాలని.. గౌరవ ప్రముఖ నటులు కోరిన విధానం చాలా మంచిదండి అంటూనే ముద్రగడ తనదైన వ్యంగ్యాన్ని కూడా జోడించారు. సినిమా ఇండస్ట్రీ మరింత పారదర్శకంగా ఉండడానికి తాను ఇంకొక సూచన కూడా చేస్తున్నానంటూ తెలియజెప్పారు.
చిత్రనిర్మాణం కోసం నటించే హీరో హీరోయిన్లు మొదలుకుని ఆఖరి వ్యక్తి వరకు వారికి ఇచ్చే రెమ్యునరేషన్లు, ఖర్చులు వగైరా అన్నింటికి సంబంధించిన డబ్బును కూడా నిర్మాతనుంచి ప్రభుత్వం ముందుగా తమ వద్ద జమ చేయించుకుని.. ఆన్ లైన్ టికెట్ల విక్రయం మాదిరిగా ప్రభుత్వం నుంచి వారి వారి అకౌంట్లలోకి పంపడం మంచిదని అన్నారు. ఎక్కడా బ్లాక్ మనీకి అవకాశం ఉండదని కూడా అన్నారు. నిర్మాణం ఖర్చు కూడా కోట్ల రూపాయలు తగ్గుతుందని అన్నారు.
చిరంజీవి నాగార్జున కోరిన సంగతి ఏమో గానీ.. రోజా ఆ మాట చెప్పేసరికే వారిమీద సోషల్ మీడియాలో బీభత్సంగా ట్రోలింగ్ జరుగుతోంది. ఇప్పుడిలా ముద్రగడ కూడా ఒ రేంజిలో ఆటాడుకుంటున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి లేఖ రాసిన ముద్రగడ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానికి కూడా కాపీ పెట్టడం విశేషం.

.

Discussion about this post