ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్త్రీశక్తి పేరుతో మహిళలకు ఉచిత బస్సుప్రయాణం పథకాన్ని ప్రారంభించిన రోజున.. కొందరు మహిళలతో కలిసి ఒక బస్సులో ప్రయాణించారు. సహజంగా ఆయన వారితో కొన్ని ముచ్చట్లు పెట్టారు. ఈ పథకం తనకు ఎలా ఉపయోగపడుతుందో ఓ మహిళ నిజాయితీగా చెప్పుకుంది..
ఆమె, భర్త కలిసి ఊర్లలో వీధుల్లో తిరిగి చేపలు అమ్ముకుని జీవిస్తారు. ఆమె సంపాదన రోజుకు 500 రూపాయల వరకు ఉంటుంది. ఆమె తన పల్లెనుంచి చేపలు అమ్మే పట్టణాలకు తిరగడానికి ఇంచుమించు రోజుకు వంద రూపాయలు ఖర్చవుతుంది. స్త్రీశక్తి వలన ఆమెకు ఈ వంద మిగులుతోంది.
ఈ ముచ్చట విన్నప్పుడు ఎవరికైనా చాలా సంతోషం కలుగుతుంది. ప్రభుత్వ పథకం- ప్రజల జీవితాల్లో ఇలాంటి మార్పులు తీసుకురావడం చాలా మంచి పరిణామం అనిపిస్తుంది. ప్రభుత్వం ఎప్పుడూ కూడా కష్టపడి బతికే వారికి ఆధరవుగా ఉండాలి. కానీ సోమరిపోతులను తయారుచేసేలా ఉండకూడదు. ఈ కోణంలో చూసినప్పుడు స్త్రీశక్త్తి పథకం ఎంతబాగా మహిళా సమాజానికి ఉపయోగపడుతుందో మనకు తెలుస్తుంది. కానీ ఈ పథకం విధివిధానాల్లో తెస్తున్న సడలింపులు దుర్వినియోగానికి దారితీసే ప్రమాదం ఉంది.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ అవకాశం కల్పించింది. దీనివలన ఎంతోమందికి మేలు జరుగుతుంది. వారి జీవితాలు స్థిరపడడానికి స్త్రీశక్తి పథకం కారణం అవుతుంది. జీవితాలను మెరుగు పరచుకోవడానికి ప్రభుత్వం అందించే ఉచిత సదుపాయాలను వాడుకునే వారికి ఇది అవసరం. అంతేతప్ప విహారయాత్రలు, ఆధ్యాత్మిక యాత్రలు, సరదాల కోసం పర్యటనలు చేసేవారికి ఇది వెసులుబాటు కాకూడదు. కానీ ఆ విచక్షణను ప్రభుత్వం పక్కన పెట్టినట్లుగా కనిపిస్తోంది.
స్త్రీశక్తి పథకానికి సంబంధించి ప్రభుత్వం కొన్ని విధివిధానాలను ప్రభుత్వం రూపొందించింది. ఒక పథకాన్ని ప్రారంభిస్తే… అది సాగుతున్న అమలు తీరుతెన్నులు, సాధిస్తున్న స్పందన గురించి తెలుసుకుంటూ ఉండే చంద్రబాబునాయుడు.. వెంటనే కొన్ని సవరణలు చేశారు. కొండ ప్రాంతాల్లో తిరిగే బస్సల్లో తొలుత ఉచితం అనుమతించలేదు. అయితే మన్యం, కొండ ప్రాంతాల్లో అనేక గ్రామాలు ఉంటాయి గనుక.. అక్కడి పేద మహిళలకు ఈ పథకం వర్తించకపోవవడం అన్యాయం అవుతుందనే భావనతో వెంటనే దానిని సరిదిద్దారు. అంతవరకు ప్రభుత్వం శ్రద్ధను మెచ్చుకోవాలి.
కానీ.. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి కూడా.. ఉచిత ప్రయాణం అనుమతించడం అనేది.. కేవలం దుర్వినియోగానికి దారి తీస్తుందే తప్ప.. మరొకటి కాదు. ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం అంటే.. కేవలం రాజకీయ ప్రత్యర్థుల ప్రచార వ్యూహాలలో చిక్కుకుపోయి తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలే అని అనుకోవాలి.
తిరుపతి- తిరుమల మధ్య కూడా ఉచిత ప్రయాణం కల్పించడం వంటి సడలింపులు వ్యవస్థకు మంచిది కాదు. ఇది కేవలం రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు తలొగ్గి, వారి ట్రాప్ లో పడి తీసుకున్న నిర్ణయం లాగా కనిపిస్తోంది. నిజానికి చంద్రబాబు ప్రభుత్వం విధివిధానాల్లో నాన్ స్టాప్ బస్సుల్లో ఉచితానికి అనుమతి లేదు. తిరుపతి- తిరుమల మద్య కూడా బస్సు నాన్ స్టాప్ సర్వీసుగానే నడుస్తుంది కదా. కాబట్టి ఇక్కడ అనుమతిని మినహాయించవచ్చు.
తిరుమల కు కూడా ఉచితం అనుమతించడం అనేది.. కేవలం ఆధ్యాత్మికంగా దేవుడి కోసం వెళ్లాలనుకునే వారికి తప్ప మరొకరికి ఉపయోగకరం కాదు. ఆ మాటకొస్తే.. తిరుమల దేవుడి దగ్గరకు వెళ్లాలనుకున్న అందరికీ ఆ నిబంధన అడ్డంకి కాదు. శ్రీకాకుళం మహిళ అయినా సరే.. తిరుపతి వరకు ఉచితంగా రాగలదు. కొండ ఎక్కడానికి మాత్రమే టిక్కెట్ కొనాలి. కానీ.. ప్రభుత్వం మహిళల జీవితాల్లో స్థిరత్వానికి, ఆర్థిక స్వావలంబనకు, స్వాతంత్ర్యానికి తదితర ఏ లక్ష్యాలకైతే ఈ పథకాన్ని ఉద్దేశిస్తున్నదో వాటిలో ఏ ఒక్కటి కూడా తిరుమలకు ఉచితం కల్పించడం వల్ల నెరవేరే అవకాశం లేదు. ప్రత్యర్థుల ప్రచారాలకు తలొగ్గకుండా.. విధివిధానాలను తమ సమీక్షల ద్వారా గుర్తెరిగిన లోపాలను మాత్రమే దిద్దుకుంటూ ముందుకు సాగితే.. పథకాలు ప్రజాదరణను చూరగొనడంతో పాటు, వ్యవస్థలు దెబ్బతినకుండా ఉంటాయి.
..కె. ఎ. మునిసురేష్ పిళ్లె
సంపాదకుడు, ఆదర్శిని
Discussion about this post