యాంత్రికమైన మనిషి జీవితాన్ని పట్టి కుదిపి మాంత్రికమైన మాటల అల్లికలతో అమేయంగా, అనూహ్యంగా గొప్ప తాదాత్మ్యతకు గురి చేస్తాయి ఆయన పాటలు. ‘అనంతమైన విశ్వం బ్రహ్మాండంగా మనకు తోడు నిలబడింది’ అన్నంత ధైర్యాన్ని ఇస్తాయి- అక్షరాలతో ఆయన నిర్మించిన కోటలు.
దేహమున్నా, ప్రాణమున్నా, నెత్తురున్నా, సత్తువున్నా ఇన్నిటినీ సైన్యంగా మధించి ఆశను, శ్వాసను అస్త్రాలుగా ఇచ్చి బతుకు పోరులో బెరుకు లేకుండా యుద్ధం చేసే ధైర్యాన్ని పంచి వెళ్లిన కల కరవాలం పట్టిన సేనాధిపతి ఆయన.
“లక్ష్యాన్ని చేరుకోవాలంటే ముందు ఆ లక్ష్యాన్ని మరచిపో, పనిని ప్రేమించు.. పిచ్చిగా ప్రేమించు, నిన్ను నువ్వు మరచిపోయి ప్రేమించు, నీలో ఏకమయ్యేంతలా, నీవు వేరు కాదు అన్నంతలా ఆ పనిని ప్రేమించు.. అప్పుడు ప్రపంచమంతా నిన్ను ప్రేమిస్తుంది” ఇదే చెబుతుందేమో ఆయన జీవితం.
ఎన్నెన్ని అవార్డులు, ఎన్నెన్ని ప్రశంసలు.. ఊరికే వచ్చాయా? కోట్లాది మంది అభిమానులు ఊరికే పిచ్చి అభిమానాన్ని చూపారా? ఆయన నిద్ర లేని రాత్రులెన్ని గడిపితే.. ఛిద్రమైన హృదయాల్ని సేదతీర్చే పాటల్ని ఇచ్చి ఉంటారు! అక్షరాలతో ఎంతటి మిత్రుత్వం చేస్తే జీవితం తాలూకు గాయాలతో శత్రుత్వం పెట్టుకునేంత బాకుల్లాంటి అక్షరాల్ని అందించి ఉంటారు. 67 ఏళ్ల జీవితాన్ని సంపూర్ణంగా కాగితాలపై పరిస్తేనే కదూ.. పరిపూర్ణమైన అస్తమయాన్ని, అనంత లోకాల పయనాన్ని ఆయన పొందింది.
ఇవన్నీ అనుకుని చేసారా? అవార్డుల కోసమో, పేరు కోసమో, ప్రశంసల కోసమో, అభిమానం కోసమో చేసారా? కాదు ప్రేమతో చేశారు.. లక్ష్యాన్ని మరచి, ఆయన్ను ఆయన మైమరచి ఆయనే అక్షరమైనంతలా ఆత్మను పనిలో లీనం చేసి తన జీవిత అర్థమైన పాటలు రాసారు. అందుకే ఆయన పాట రాసినప్పుడు వెళ్లి కనిపించి, ఒక అర్థ గంట తర్వాతో, గంట తర్వాతో మళ్లీ కనిపిస్తే ‘ఏం రాఘవ ఎప్పుడు వచ్చావు’ అని మళ్లీ అడిగిన సందర్భాలు ఎన్నో!
ఆయన పాటల నుండి పాఠాలు నేర్చుకోవాలే కానీ.. ఎదగాలనే పరితపన ఉన్న ప్రతి వ్యక్తి ఆయనకు ఏకలవ్య శిష్యరికం చేయొచ్చు. అయితే నేరుగా ఆయన శిష్యరికం చేసే అవకాశం రావటం మాత్రం నా అదృష్టం. 2000 వ సంవత్సరంలో ఆయనను కలవటం నా జీవితంలో కీలక మలుపు. ఆ ఏడాది నా జీవితంలో కీలకదశ.. IAS కోల్పోయిన గాయం, జీవితాన్ని కొత్తగా చూస్తున్న వైనం, ప్రారంభమైన వైవాహిక జీవితం, వీటికి తోడు అప్పుడే ఉద్యోగంలో చేరి అసలు సిసలు జీవితాన్ని ప్రారంభిస్తున్న సంవత్సరం అది. సరిగ్గా అలాంటి కీలక సమయంలో సిరివెన్నెల గారిని కలిసే అవకాశం నాకు తొలిసారి లభించింది.
ఆ తర్వాత ఏడాదికి నేను పని చేస్తున్న సంస్థ కోసం ఇంటర్వ్యూ తీసుకునే అవకాశం లభించింది. నాలో దాగిన ప్రతిభను గుర్తించి, “ఆ ప్రతిభే నిన్ను సమున్నత శిఖరాలకు తీసుకువెళుతుంది రాఘవ” అని నా భుజం తట్టి ఆయన పలికిన మాటలు కొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని నాకిచ్చాయి. జీవితం తాలూకు నైరాశ్యాన్ని ఎదురించే ఆత్మవిశ్వాసాన్ని, దైర్యంగా ముందడుగు వేసే మనో స్థైర్యాన్ని. జీవితంలో ఏదైనా, ఎంతటి విషయమైనా సాధించే శక్తి నీకుంది అనే దృఢ సంకల్పాన్ని నాకు అందించింది ఆయనే. ఆయనను కలిసి ప్రతిసారి ఒక కొత్త పాఠం, ఒక కొత్త ధైర్యం. నిరాశ కమ్మిన ప్రతిసారీ ఆయన పాట చూపిన బాట, ఆయన నేర్పిన బ్రతుకు ఆట.. ఇవే కొత్తగా ఊపిరిని ఇస్తూ ఉండేవి, ఉంటాయి.
ఆయన ఎప్పుడూ తనలో ముగ్గురు ఉన్నారని చెబుతూ ఉండేవారు “1. క్రియేటర్ (సృష్టికర్త) 2. క్రిటిక్ (విమర్శకుడు) 3. ఫిలాసఫర్ (తత్వవేత్త)’’
‘‘సృష్టికర్త సాహిత్యాన్ని సృష్టిస్తే, విమర్శకుడు అందులో తప్పొప్పుల్ని సరి చేస్తాడు, తత్వవేత్త ఈ సమాజానికి ఆ సాహిత్యం వలన మంచి జరుగుతుందా? లేదా? ఇంకా ఉపయోగపడాలి అంటే ఏం చేయాలి అనేది తూకం వేసి చెబుతాడు” అంటారు ఆయన.. అందుకే ఏది రాసిచ్చినా కళ్ళకు అద్దుకుని స్వీకరించే దర్శక, అభిమానులు ఉన్నా కూడా ఆయన అలా చేయలేదు. కొన్ని పదుల సార్లు పాటను తిరగరాసి, ఆయనలోని తత్వవేత్త, విమర్శకుడు సంతృప్తి చెందిన తరవాత మాత్రమే ఆ పాటను బయటకు ఇచ్చేవారు. ప్రతి వ్యక్తిలో ఒక సృష్టికర్త ఉంటాడు. కానీ విమర్శకుడిని, తత్వవేత్తను తమలో సృష్టించుకున్న వారే గొప్పవాళ్ళు అవుతారు.
పని మీదకంటే ఆ పని తెచ్చిపెట్టే సంపాదన మీదనే దృష్టిపెడుతున్న రోజులు ఇవి. కానీ పనిని ఎలా ఆరాధించాలో, ఎంత పవిత్రంగా ఆ పనిని చూడాలో సిరివెన్నెల గారిని చూసే నేర్చుకోవాలి. దాదాపు పది, పదిహేనేళ్ల కిందట నేను ఆయనతో ఉన్నప్పుడు ఒక నిర్మాత వచ్చారు. ఆయన సినిమాకు పాటల రచన కోసం కొంత నగదును అడ్వాన్స్ గా ఇచ్చేందుకు వచ్చారు ఆయన. కానీ సిరివెన్నెల గారు ఆ నగదును తిరస్కరించి, పాటలు రాయలేనని చెప్పి ఆ నిర్మాతను పంపించేశారు. ఆ క్షణం అలా ఎందుకు చేశారు సర్ అని నేను అడిగిన ప్రశ్నకు ఆయన చెప్పిన సమాధానం నేటికీ నా చెవుల్లో మోగుతుంది.
“రాఘవ! ఆ నిర్మాత చెప్పిన సినిమా కథ నాకు నచ్చలేదు, కథ నచ్చని సినిమాకు పాట రాస్తే ఆ పాటకు కూడా అర్థం ఉండదు. పైగా నా చేతుల్లో ఇప్పటికే 10, 15 పాటలు ఉన్నాయి. వీటికి సంపూర్ణంగా న్యాయం చెయ్యడానికే నాకు మరో రెండు మూడు నెలలు పడుతుంది. ఆ పాటలకు న్యాయం చేయకుండా కొత్త పాటలు ఒప్పుకోలేను. అడ్వాన్స్ ఇచ్చిన ఆ నిర్మాత రేపటి నుండే తన పాట కోసం తొందరపెడతాడు, అందుకని కంగారుగా రాసేసి ఇచ్చెయ్యనూలేను. అందుకే ఆ నిర్మాత అడిగిన పాటల గురించి ఒప్పుకోలేదు. రాఘవా! పాటను ఎలా పడితే అలా రాసి ఇవ్వటం నాకు చేతకానిపని.. కాదు.. చేయలేని పని.. కాదు కాదు.. నేను చేయని పని. పాటను నమ్మటం తప్ప అమ్మటం తెలియదు రాఘవా నాకు!” అన్నారు ఆయన. పనిని అంతలా ఆరాధించారు కాబట్టే, తెలుగు జాతి మొత్తం నేడు ఆరాధిస్తుంది ఆ వెన్నెల రేడును!
పురాణాలూ, ఇతిహాసాలు, వేదాలు, దైవం, జీవితంలో ఎదురయ్యే ఆత్మన్యూనత, కష్టాల్ని ఎదిరించే ఆత్మవిశ్వాసం ఇలా ప్రతి అంశాన్ని ఎవ్వరూ దర్శించని రీతిలో మనచేత దర్శింపజేసే ఒకానొక అద్భుతం ఆయన. ఇది ఆయనకు దేవుడిచ్చిన వరమో, ఆయన- దేవుడు మనకు ప్రసాదించిన వరమో! మాటల్ని పాటలుగా మలచి, హృదయపు ద్వారాల్ని తెరచి, జీవితపు శిఖరాల్ని వలచేలా చేసే శక్తి రచయిత సొంతం. పాటల్లో జీవిత తత్వాన్ని ఒంపిన రచయిత ఆయన, వయసుతో సంబంధం లేకుండా ఏ పాట అయినా గొప్ప అనుభూతిని పంచే పాటలు రాసిన వ్యక్తి ఆయన.
శరీరాన్ని దాటి, మనసును దాటి, చిత్తాన్ని, ఆత్మను అమృతంలో ముంచే మాటల అల్లిక ఆయన పాటల సొంతం. ఆయన శిష్యరికంలో నేను నేర్చుకున్న ఈ అంశాలన్నీ నా జీవితాన్ని అత్యున్నతమైన స్థాయికి చేరేందుకు సహకరించిన, సహకరిస్తున్న నిచ్చెనలే. నేడు ఆయన నాతో లేకపోవచ్చు. కానీ ఆయన మాటలు నాతోనే ఉన్నాయి, ఉంటాయి. జీవితంలో సమస్య ఎదురైన ప్రతిసారీ, కష్టం నా తలుపు తట్టిన ప్రతి సందర్భంలో ఆ మాటలు నాలో మేల్కొంటాయి, నన్ను మేల్కొలుపుతాయి.
.. ఆకెళ్ల రాఘవేంద్ర
Discussion about this post