నాకు ఊహ తెలిసినంతవరకూ అమ్మే అన్నీ సమకూర్చేది. నాకే కాదు ఎవరి జీవితంలోనైనా జరిగేది ఇదే. కానీ ఓరోజు… మా నాన్న నన్ను పిలిచి, గుండ్రంగా ఉండే ఒక బిళ్ళను నా చేతిలో పెట్టి.. “రేయ్ నీకు ఇష్టమైనది ఏదైనా కొనుక్కోరా” అన్నాడు. నాకు కొత్తగా అనిపించింది. ఎందుకంటే అప్పటివరకు కొనుక్కోవడం అంటే ఏమిటో నాకు తెలియదు. పైగా అలాంటి బిళ్ళను ప్రత్యక్షంగా చూడడం అదే మొదటిసారి. అందుకే అమ్మ దగ్గరకు వెళ్ళి.. “అమ్మా! నాన్న ఇది ఇచ్చాడు. దీంతో కొనుక్కోమంటున్నాడు” అన్నాను అమాయకంగా. అమ్మ నావైపు చూసి.. “రేయ్!చిన్నా…అది ఇటు ఇవ్వు. నీకు అప్పుడప్పుడు ఇస్తుంటానే నువ్వులుండ. అది వీధి చివరన అమ్ముతారు. నీకు తెలియదులే. నేను తెచ్చిస్తాను” అంది. కానీ కుతూహలం ఆపులేక.. “దీంతో నువ్వులుండ ఎందుకిస్తారు?” అన్నాను ఆ బిళ్ళను అమ్మ చేతికిస్తూ.
“ఇప్పుడు నీకు చెప్పినా అర్థంకాదు. నీవెళ్ళి ఆడుకో” అని చెప్పడంతో నేను వీధిలోకి వెళ్ళాను ఆడుకోవడానికి.
కొన్నాళ్ళకు అర్థమయింది ఆరోజు నాన్న చేతిలో పెట్టిన బిళ్ళ రూపాయని, మనుషుల బంధాలను శాసించేది అదేనని.
కొందరు అంటుంటారు.. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా ఉన్నతమైనది ప్రేమేనని. కానీ ఎందుకో ఈ వాక్యాన్ని నా మనస్సు అంగీకరించదు. ఎవరి బిడ్డ వారికి ముద్దు కావచ్చు. అలాగే ఎవరి తల్లి వాళ్ళకు గొప్ప కావచ్చు. కానీ ఈ ముద్దులు, ఈ గొప్పలు కొంత పరిధి వరకే ఉంటాయనే విషయం సుస్పష్టం చేసింది ఓ సంఘటన.
మా ఎదురింట్లో ఓ కుటుంబం ఉండేది. ఆ ఇంట్లో ఓ భార్యాభర్త.. వాళ్ళకు ఇద్దరు మగపిల్లలు. ఆ ఇద్దరి పిల్లల్లో ఒకతను ఆటో నడుపుతాడు. మరోతను పాలు అమ్ముతాడు. భర్త టైలరు. అలా వాళ్ళ జీవితం సాఫిగా జరుగుతుండేది. ఓరోజు.. ఆటో నడిపే అతనికి యాక్సిడెంట్ జరిగి రెండూ కాళ్ళు విరిగిపోవడంతో నడవలేని పరిస్థితి ఎదురైంది. కొన్నాళ్ళు అతనిని బాగానే చూసుకున్నారు. ఆ తర్వాత అతనిని ఒంటరిగా వదలివెళ్ళింది ఆ కుటుంబం. అప్పటినుంచి అతను భిక్షాటన చేసుకుని బతకడం నేను కళ్ళారా చూశాను.
అప్పుడనిపించింది అసలు ఈ ప్రపంచంలో ప్రేమ అనేది లేదని. మనుషుల మధ్య ఉండేది కేవలం అవసరమేనని. ఆ అవసరానికి ఆధారమైనది డబ్బేనని.
కొందరనవచ్చు ఎక్కడో కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని అసలు ఈ ప్రపంచంలో ప్రేమేలేదనడం ఎంతవరకు సమంజసమని. కానీ బాగా పరికించి చూస్తే తెలుస్తుంది. జీవితంలో ఎప్పడోకప్పుడు ఏదోక సందర్భంలో ప్రతి ఒక్కరూ ఈ వివక్షతకు గురైవుంటారని. కానీ పైకి చెప్పకపోవచ్చు. ఎవరో విషయం ఎందుకు నా జీవితంలో నేనూ చవిచూశాను ఈ రకమైన వివక్షతను. మా తల్లితండ్రులకు నేను, నా తమ్ముడు సంతానం. ఎందుకో నాకు చదువు అబ్బలేదు. మా తమ్ముడుకి ఆ సరస్వతిదేవి కటాక్షం ఉండడం వల్ల వాడు బాగానే చదువుకున్నాడు. మా తమ్ముడికి నేనన్నా, నాకు వాడన్నా ఇష్టం. దురదృష్టం ఏటంటే నేను బాగా చదువుకోలేదని నన్ను చిన్నచూపు చూసేవారు ఇంట్లోవాళ్ళు. పైగా మా నాన్నకు చెడు అలవాట్లు ఉండడంవల్ల, సంపాదించిన డబ్బు ఇంట్లో ఇవ్వకపోవడంవల్ల కుటుంబ బాధ్యత నాపై పడింది. అంచేత నేను రకరకాల కూలిపనులకెళ్ళి కుటుంబాన్ని పోషించేవాణ్ణి. కొన్నాళ్ళకు మా తమ్ముడికి ఉద్యోగం వచ్చింది. అప్పటినుంచి వాడూ కుటుంబ పోషణలో భాగస్వామ్యం అవడం వల్ల నాకు కొంత భారం తగ్గింది. ఆ సమయంలోనే నాకు పెళ్ళైంది. ఎందుకో తెలియదు.. నాకు పెళ్ళైనప్పటి నుంచి ప్రతి చిన్న విషయానికి అమ్మా,నాన్న నన్ను విసుక్కునేవారు.. అదీ నా భార్య ఎదురుగా. మొదట్లో నాకు అర్థమయ్యేదికాదు. ఆ తర్వాత తెలిసింది నన్ను విసుక్కోవడానికి కారణం నా సంపాదన తక్కువని. కానీ మా తమ్ముడు మాత్రం ఏంతో కొంత తన ఖర్చులకు పెట్టుకుని మిగతా జీతమంతా ఇంట్లో ఇచ్చేసేవాడు. వాడివైపు నుంచి ఎలాంటీ దోషంలేదు. పైగా వాడు మనీ కంటే మనుషులకే విలువిచ్చేవాడు. కానీ నేను ఆ అవమానాలను భరించలేక మంచిగానే వేరు కాపురం పెట్టేశాను.
అందుకే కాబోలు ఓ మహనీయుడు అన్నాడు.. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’నని. ఇది అక్షరసత్యం. ఇక్కడ నేను ఎవరినీ తప్పుపట్టడంలేదు. మనిషి నైజమే అంతేనని అంటున్నాను. ఇక్కడ భార్యాభర్తలయినా, కొడుకైనా కూతురైనా, అక్కాచెల్లెళ్ళైనా, అన్నాతమ్ముళ్ళైనా అందరూ స్వార్థపరులే. డబ్బు అనే అందమైన ముసుగుతో అందరూ మంచిగా కనిపిస్తారు. దురదృష్టవశాత్తు ఆ అందమైన ముసుగు తొలగినా, చినిగినా అసలు రూపం బయటకు వస్తుంది.
కానీ మనం పుస్తకాలు, ఫేస్ బుక్, వాట్సప్ లలో ప్రేమ అనేది అజరామమైనదని, అద్భుతమైనదని, అనుభూతులకు అందదని, మధురమైనదని, అది లేకపోతే మనిషి మనుగడే లేదని తెగ వ్రాసేస్తుంటాం. అంత గొప్పదైన, అమూల్యమైన ప్రేమకు చిరునామా ఎక్కడుందో…? మరి.
…దేవీప్రసాద్ ఒబ్బు
9866251159.
.

Discussion about this post