నెల్లూరులో వీఆర్ హైస్కూలు రూపురేఖలను మార్చి, పునఃప్రారంభానికి బాటలు వేసిన ఘనత మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ కు దక్కుతుంది. కోట్ల రూపాయల తన సొంత నిధులతో పాటు, కొన్ని కంపెనీల సీఎస్సార్ నిధులను కూడా కలిపి దాదాపుగా 15 కోట్ల రూపాయల వ్యయంతో ఈ పాఠశాలకు ఆయన కృషితో కొత్తరూపు దక్కింది. వీఆర్ హైస్కూలు బయట ‘అడ్మిషన్స్ క్లోజ్డ్’ బోర్డు పెట్టినప్పుడు.. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చాలా సంబరంగా ఆ విషయాన్ని తన ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆయన చేతుల మీదుగానే ఆ స్కూలు పునః ప్రారంభం కూడా జరిగింది. నారాలోకేష్ ఈ సందర్భంగా ఒక మంచి విషయం కూడా ప్రకటించారు.
రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో, ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒకటి వంతున ఉన్నత పాఠశాలలను ఈ స్థాయికి అభివృద్ధి చేయడం గురించి ప్రభుత్వం శ్రద్ధ పెడుతుందని అన్నారు. తన నియోజకవర్గమైన మంగళగిరి పరిధిలో నిడమర్రులో పాఠశాలను కూడా ఇదేతరహాలో తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఆ మంచి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ.. రాష్ట్రంలో 175 ఉన్నత పాఠశాలలను బాగు చేయాలనుకోవడం గొప్ప విషయమే. ఈ నిర్ణయాన్ని ఆహ్వానించాలి.
అయితే చంద్రబాబు నాయుడు సంకల్పంగా పీ4 పేరుతో దాతల విరాళాల్ని పేదల జీవితాల్ని బాగు చేయడానికి, పలు అభివృద్ధి పనులకు ప్రభుత్వం ఆహ్వానిస్తోంది. నారా లోకేష్ సంకల్పించినట్టుగా నియోజకవర్గానికి ఒక ఉన్నత పాఠశాలను డిజిటల్ స్కూలుగా తయారుచేసే ప్రయత్నానికి పీ4 ను అనుసంధానిస్తే గనుక.. ఈ కార్యక్రమం చాలా బాగా, సజావుగా, ప్రభుత్వానికి భారం లేకుండా పూర్తయ్యే అవకాశం ఉంది. చాలా ఉన్నత పాఠశాలల నుంచి చదువుకున్న వాళ్లు.. ఎంతెంతో పెద్ద స్థాయులకు ఎదిగి దేశవిదేశాల్లో స్థిరపడిన వారుంటారు. ఇప్పుడు మంత్రి నారాయణ ఏ విధంగా అయితే పూనుకుని.. తాను చదువుకున్న పాఠశాలను బాగు చేశారో.. అదే స్ఫూర్తిని వారిలో కూడా కలిగించాలి. అలా.. ప్రతి నియోజకవర్గంలోని ఉన్నత పాఠశాలలనుంచి ఉన్నత స్థాయికి ఎదిగిన వారిని గుర్తించి.. వారిని సంప్రదిస్తే.. నిధులు చాలా సులభంగా సమకూరుతాయి. వీఆర్ హైస్కూలు స్థాయిలోనే నియోజకవర్గానికి ఒక పాఠశాలను తీర్చిదిద్దడం సులభంగా జరుగుతుంది.
అంతే కాదు.. ఇంకా చిన్న ఊర్లలోని ఉన్నత పాఠశాలల నుంచి కూడా ఉన్నత స్థానాలకు ఎదిగిన వారు అనేకమంది ఉంటారు. ప్రభుత్వం ఇంకొంత శ్రద్ధగా.. ఒక్కో డిజిటల్ తరగతి గదికి అవసరమైన ఏర్పాట్లను, వాటికి కాగల మొత్తం వ్యయాన్ని విడివిడిగా లెక్కలు తయారు చేయించి ఆ మేరకు పీ4 కింద విరాళాలను ఆహ్వానిస్తే ఖచ్చితంగా మంచి స్పందన ఉంటుంది. దాదాపుగా ప్రతి ఉన్నత పాఠశాలలో కూడా ఒకటిరెండు డిజిటిల తరగతి గదులు అందుబాటులోకి వస్తాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏర్పాటు కూడా చిన్న విషయం ఎంతమాత్రమూ కాదు. కాబట్టి నారా లోకేష్ ఆ దిశగా ఆలోచించి.. వ్యవస్థీకృతంగా ఈ ఆలోచనను నడిపిస్తే చాలా బాగుంటుందని ప్రజలు ఆశిస్తున్నారు.
Discussion about this post