ఈమె పేరు మన్న రోశమ్మ. తిరుపతి జిల్లా తొట్టంబేడు మండల పరిధిలోని చిట్టత్తూరు. ఈమెకు 90శాతం వైకల్యం ఉన్నట్లు 2011 మే 28న తిరుపతి మెడికల్ కళాశాల బోర్డు వారు ధృవీకరణ పత్రం ఇచ్చారు. అప్పటి నుంచి మన్న రోశమ్మ పింఛను తీసుకుంటోంది. ఈ పింఛనే ఈమెకు జీవనాధారం. అయితే మన్న రోశమ్మకు 40శాతం కంటే వైకల్యం తక్కువ ఉందని… పింఛను పొందడానికి అనర్హురాలివి అంటూ మండల పరిషత్ అధికారులు ఈ నెల 13న నోటీసు జారీ చేశారు. ఈ నోటీసు రాకతో మన్న రోశమ్మ ఆందోళన చెందుతోంది. పింఛను పోతే తన ఆకలి తీరే మార్గం ఏదంటూ… వెక్కి వెక్కి ఏడుస్తోంది. ఇది కేవలం మన్న రోశమ్మ కన్నీటి గాథ మాత్రమే కాదు. అధికారిక నివేదికల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 1.20లక్షల మందికి పైగా ఈ బాధ అనుభవిస్తున్నారు.
ప్రభుత్వం అందించే సామాజిక భద్రత పింఛను పేదలకు ఓ భరోసా. ఈ పింఛను వలన చాలా మందికి కుటుంబంలో గౌరవం ఉంటోంది. ఈ పింఛను అభాగ్యుల ఆకలి తీర్చుతోంది. ప్రత్యేక ప్రతిభావంతులకు, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఉన్న వారికి పింఛన్లు మంజూరు చేయడంలో వైసీపీ ప్రభుత్వం నిబంధనలు పాటించలేదని… రాజకీయ స్వార్థంతో చాలా మంది అనర్హులకు ఈ పింఛన్లు మంజూరు చేసిందని కూటమి ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు రకాల పింఛను లబ్దిదారులపై విచారణకు ఆదేశించింది. గ్రామ,వార్డు సచివాలయాల ఉద్యోగులచే విచారణ చేయించింది. అదేవిధంగా సదరంలో వైకల్య నిరూపణ పరీక్షలు చేయించింది. అంగవైకల్య పరీక్షలు పారదర్శకంగా నిర్వహించేందుకు ఇతర జిల్లాల వైద్యులకు ఈ బాధ్యతలు అప్పగించింది. ఈ పరీక్షల్లో చాలా మందికి 40శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్నట్లు తేలింది. కొంతమంది మంచానికే పరిమితం కాకపోయినా… వారు కూడా ధృవీకరణ పత్రాలు తీసుకుని పింఛను పొందుతున్నట్లు అధికారులు గుర్తించారు.
1.20లక్షల మందికి పైగానే…!
ప్రత్యేక ప్రతిభావంతుల విభాగంలో అర్హత లేకపోయినా సామాజిక భద్రత పింఛన్లు పొందుతున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా 1.20లక్షలు పైగానే ఉన్నారని అధికారులు ప్రాథమికంగా తేల్చారు. ఉదాహరణకు తిరుపతి, చిత్తూరు జిల్లాలు పరిశీలిస్తే… తిరుపతి జిల్లాలో 83మందికి ఆరోగ్య పింఛన్లు… 6,397 మందికి వైకల్యం పింఛన్లు తీసుకునే వారికి పింఛన్లు రద్దు చేయాలని నిర్ణయించి వారికి నోటీసులు జారీ చేశారు. ఇక చిత్తూరు జిల్లా విషయానికి వస్తే 233మందికి ఆరోగ్య పింఛన్లు… 4,361మందికి వైకల్యం పింఛన్లు రద్దు చేయాలని నిర్ణయించి… వారికి నోటీసులు జారీ చేశారు. ఇక తిరుపతి జిల్లాలో ఆరోగ్య పింఛన్లు తీసుకుంటున్న 477మందిని వైకల్య పింఛను జాబితాలోకి… వైకల్యం పింఛను తీసుకుంటున్న 1,708మందిని వృద్దాప్య పింఛను జాబితాలోకి మార్చారు. చిత్తూరు జిల్లాలో ఆరోగ్య పింఛను తీసుకుంటున్న 71మందిని వైకల్యం జాబితాలోకి… వైకల్యం పింఛను తీసుకుంటున్న 913మందిని వృద్దాప్య పింఛను జాబితాలోకి మార్పు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాల్లో ఇదే తరహాలో రద్దు, మార్పులు చేశారు.
కోత విధిస్తూ…
ప్రత్యేక ప్రతిభావంతుల విభాగంలో అర్హులకే మాత్రమే సామాజిక భద్రత పింఛను ఇచ్చే ఉద్దేశ్యంతో… ఇలా మార్పు చేయడం వలన వైకల్యం జాబితాలో ఉన్న వారికి రూ.6వేలు, వృద్ధాప్య జాబితాలో ఉన్న వారికి రూ.4వేలు మాత్రమే ఇక నుంచి పింఛను అందుతుంది. ఆరోగ్య పింఛను జాబితాలో ఉన్న వారు రూ.15వేలు, వైకల్యం జాబితాలో ఉన్న వారు రూ.6వేలు వంతున ప్రతి నెలా పింఛను పొందుతున్న సంగతి తెలిసిందే. అయితే జాబితాలు మార్పు చేసిన వారికి పింఛను తగ్గనుంది. ఇక అనర్హులకు ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. వచ్చే నెల (సెప్టెంబరు) నుంచే ప్రభుత్వం ఈ నిర్ణయం అమలు చేయనుంది.
పారదర్శకతపై అనుమానాలు
ప్రత్యేక ప్రతిభావంతులను గుర్తించే విషయంలో పారదర్శకత లోపించిందనే విమర్శలు బలంగా ఉన్నాయి. వైద్యుల నిర్లక్ష్యం… ప్రత్యేక ప్రతిభావంతుల పాలిట శాపంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు వందలాది మంది ప్రత్యేక ప్రతిభావంతులు సాక్ష్యంగా నిలుసస్తున్నారు. ఇందుకు మన్న రోశమ్మ ప్రత్యక్ష ఉదాహరణ. సదరంలో పరీక్షలు నిర్వహించే సమయంలో కొందరు వైద్యులు ఇష్టానుసారంగా పరీక్షలు చేసి… తమకు తోచిన విధంగా ధృవీకరణ పత్రాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఈ విషయం అదికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఇద్దరూ చెబుతుండటం కొసమెరుపు.
చంద్రబాబు, నారా లోకేష్ ఏమంటున్నారంటే…
ప్రత్యేక ప్రతిభావంతుల పింఛన్లు రద్దు, మార్పులపై అనేక విమర్శలు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్యగా మారింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్పందించారు. అర్మ్హులైన వారికి ఎవరికీ పింఛన్లు రద్దు చేసే ప్రసక్తే లేదని… అదే సమయంలో అనర్హులకు ఎవరికీ పింఛను ఇవ్వమని తేల్చి చెప్పారు. అధికార పక్షం అయినా… ప్రతిపక్షం అయినా ఇదే నియమం పాటిస్తామన్నారు. సామాజిక భద్రత పింఛను అనేది రాజకీయ పార్టీలకు అతీతంగా… అర్హులందరికీ ఇచ్చేదని వారు స్పష్టం చేశారు.
రద్దుపై భిన్నాభిప్రాయాలు
పింఛనుదారుల విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ నిర్ణయం పట్ల హర్షిస్తుండగా… కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇంతకాలం పింఛను తీసుకున్న వారు లబోదిబో మంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆర్థిక భారం తగ్గించుకోవడానికే ఇలా చేస్తోందని పలువురు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. అనర్హుల జాబితాలోకి వెళ్లిన వారిలో అధికార, ప్రతిపక్ష పార్టీల సానుభూతిపరులు అందరూ ఉన్నారు. ఈ నిర్ణయం ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుతుందని అన్ని వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.
నోటీసులు అందుకున్న వారికి మరో అవకాశం
ప్రత్యేక ప్రతిభావంతుల విభాగంలో పింఛను తీసుకోవడానికి అనర్హులు అంటూ నోటీసులు అందుకున్న వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. పింఛను తీపుకోవడానికి తాము అర్హులని భావిస్తే వారు తమ సమీప ఎంపీడీవో లేదా పురపాలక కమిషనరుకు దరఖాస్తు చేసుకోవచ్చు. వారు ఈ దరఖాస్తు వారు పెన్షన్ పోర్టల్ లో అప్ లోడ్ చేసి తదుపరి కార్యాచరణ చేపడతారు. షెడ్యూల్ ప్రకారం ఆస్పత్రికి వెళ్లి వైకల్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అక్కడ వైకల్యం నిరూపించుకుంటే పింఛను యథాతథంగా ఇస్తారు. ఇందుకోసం కొంతకాలం వేచియుండక తప్పదు.
Discussion about this post