ఆ పేదదంపతుల పరిస్థితి దయనీయమైనది. ఉన్న భూమి ఆక్రమణకు గురైంది. అదే మని అడిగితే.. కనీసం మాట ఆలకించిన దిక్కు లేదు. ఎమ్మెల్యేకు మొరపెట్టుకుంటే న్యాయం జరుగుతుందని అనుకుంటే.. ఆయన ఎదుటే.. ఆక్రమించిన వారు దాడికి తెగబడ్డారు. ఇదేమని అడగడానికి కూడా వీల్లేని దైన్యం.
పోలీసులను ఆశ్రయించారు. ఏ అండదండా లేని వారి గోడు వినడానికి ఏ పోలీసు స్టేషను మాత్రం సిద్దంగా ఉంటుంది గనుక.. చంద్రగిరి పోలీసు స్టేషన్లో వారికి అలాంటి అనుభవమే ఎదురైంది. అనేక మార్లు పోలీసు స్టేషన్ చుట్టూ ఫిర్యాదు చేయడానికి తిరిగారు. తమ ఫిర్యాదును పోలీసులు పట్టించుకోకపోవడంతో.. వారికి ఇక గత్యంతరం లేకపోయింది.
ఇద్దరు పేద దంపతులు.. ఆ కుటుంబానికి ఓ పసికందు. ఉన్న ఆస్తి పరాధీనం అయిపోతుండగా.. అగమ్యగోచరంగా కనిపిస్తున్న భవిష్యత్తు. వేరే గతిలేక వారు రోడ్డు మీదే బైఠాయించారు. తమ ఫిర్యాదును పట్టించుకోని పోలీసుల తీరుకు నిరసనగా.. చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డుపై పసిబిడ్డతో సహా బైఠాయించి భార్యభర్తలు నిరసన తెలిపారు.
చంద్రగిరి మండలం జక్కలవారిపల్లి గ్రామంలోని తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని దంపతులు హేమాద్రి, చంద్రిక ఆరోపిస్తున్నారు. విచారణకు వచ్చిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి సమక్షంలోనే బాధితులైన తమపైనే దాడి చేశారనేది ఆ దంపతుల ఆవేదన.
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం లేదని నిరసన తెలియజేస్తున్నారు. పోలీసు స్టేషన్ ఎదుటే పసిబిడ్డతో సహా వారు బైఠాయించడంతో.. పోలీసులు స్టేషనులోంచి బయటకు వచ్చి వారిని విచారించారు. అక్కడినుంచి ఖాళీ చేయించి పంపేసేందుకు ప్రయత్నించారు. తమ గోడు వినాలని.. వారు పోలీసుల కాళ్ళుపట్టుకుని రక్షణ కల్పించాలని కోరారు.
Discussion about this post