రాష్ట్ర విభజన అనేది మానని గాయం. నిజానికి ఇది రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా గాయమే. విభజన ద్వారా తాము కలగన్న సొంత రాష్ట్రాన్ని సాధించుకున్నాం గానీ.. రాష్ట్రానికి దక్కవలసిన ప్రయోజనాలు అన్నీ మిస్సవుతున్నాయనేది తెలంగాణ అభిప్రాయం. అదే సమయంలో.. ఆంధ్రప్రదేశ్ కు ఈ గాయం ఇంకా పెద్దది. విభజన ద్వారా రాష్ట్రం రెండు ముక్కలు అయిన గాయాన్ని వారు మరచిపోగలరేమో గానీ.. విభజన తర్వాత కేంద్రం ప్రత్యేకహోదా విషయంలో చేసిన వంచనను ఎప్పటికీ మరచిపోలేరు. అలా వారికి అది చాలా పెద్దగాయం.
అలాంటి గాయాన్ని ఇప్పుడు నరేంద్రమోడీ కెలికారు. కాంగ్రెస్ పార్టీని నిందించడానికి పార్లమెంటులో సుదీర్ఘమైన ప్రసంగం చేసిన ప్రధానమంత్రి.. సందర్భం కాకపోయినప్పటికీ.. మధ్యలో ఏపీ విభజన అంశాన్ని తీసుకువచ్చారు. ఆయన ప్రసంగంలోకి చొరబడిన ఆ విభజన గాయం మళ్లీ ఇరు రాష్ట్రాల్లో అందరినీ బాధపెడుతున్నది.
విభజన అన్నది.. తమ పార్టీ కూడా సమర్థించేదే అయినప్పటికీ.. కాంగ్రెస్ పార్టీ విభజన చేసిన తీరు బాగాలేదన్నది మోడీ విమర్శ. అక్కడికేదో.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ మాట్లాడినట్లుగా ఆయన మాటలకు అర్థాలు పులుముతూ.. తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్నాయి. అధికార తెరాస ఈ విషయాన్ని బాగా క్యాష్ చేసుకుంటున్నది.
అయితే.. మోడీ ఏదో కాంగ్రెస్ ను నిందించడానికి విభజన టాపిక్ తెచ్చారు గానీ.. విభజన చేసిన గాయం కంటె పెద్ద వంచన ప్రత్యేక హోదా ఎగవేత. ఆయన విభజనను ప్రస్తావించిన ఈ సందర్భంలో.. ఏపీ నేతలు ఈ విషయాన్ని ప్రస్తావిస్తే బాగుండేది. విభజన సరిగా చేయకపోయినప్పటికీ.. ప్రత్యేకహోదా, రైల్వేజోన్ వంటివి ప్రకటించి కాంగ్రెస్ ఎంతో కొంత మేలు చేసింది. అయితే.. అవేమీ రాష్ట్రానికి దక్కకుండా మోడీ సర్కారు వంచించింది. ఈ చర్చ ఈ సమయంలో తెరపైకి రావడం అవసరం. కానీ.. అంత ధైర్యమున్న నాయకులెవ్వరు?
ఏపీలో ఉన్న పార్టీలన్నీ కేంద్రలోని బీజేపీ మోచేతి నీళ్లు తాగడానికి అలవాటు పడ్డ పార్టీల్లాగా తయారయ్యాయి. బీజేపీతో సదా సత్సంబంధాల కోసం వైసీపీ ఆరాటపడుతూ ఉంటుంది. జనసేన ఆల్రెడీ వారి చంకలో కూర్చుని గారాలు పోతోంది. ఇక తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకోక తప్పదేమో అనే ఉద్దేశంతో మోడీని, బీజేపీని పల్లెత్తు మాట అనకుండా.. వారు తమను తిడుతున్నా భరిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో మానని గాయాన్ని మోడీ ఎంతగా కెలికినా మాట్లాడే వారే కరవవుతున్నారు.
.

Discussion about this post