బుచ్చినాయుడుకండ్రిగ: మండల కేంద్రమైన బుచ్చినాయుడుకండ్రిగలో ట్రాఫిక్ నియంత్రణ చేయగలిగితే బాగుంటుందని తెదేపా తిరుపతి పార్లమెంటు జిల్లా కార్యదర్శి సముద్రాల సుధాకర్ నాయుడు ప్రకటనలో కోరారు.
శ్రీకాళహస్తి-తడ ప్రధాన రోడ్డుతో పాటుగా జడ్పీ ఉన్నత పాఠశాల, ఈ సేవ మార్గంలో వాహనాలను ఎక్కడ పడితే అక్కడ నిలిపివేయడం కారణంగా పాదచారులు, విద్యార్ధులు ఇక్కట్లు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో పాటుగా కొంతకాలం క్రితం రోడ్డుకి ఓ వైపు తాగునీటి పైపులను ఏర్పాటు చేస్తూ మట్టిని ఎత్తుగా వదిలేయడంతో వాహనాలు ఆ వైపు వెళ్లలేకపోవడం, మరోవైపు దుకాణదారులు కూడా రోడ్డుమీద వరకు మట్టిని పోయడంతో ఇరుకుగా మారి రవాణాకు ఇబ్బందిగా మారిందన్నారు.
ఆర్ అండ్ బీ శాఖ యంత్రాంగం ప్రస్తుతం రోడ్డు మరమ్మత్తులు చేస్తుండటంతో రోడ్డుకి రెండువైపులా అడ్డంకులను తొలగించాలని డిమాండ్ చేశారు.
అలాగే ఉదయం, సాయంత్రపు వేళల్లో సిబ్బందిని పెడితే పోలీస్ శాఖకు కూడా ప్రజలలో కృతజ్ఞత ఏర్పడుతుందన్నారు. ఆ దిశగా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు.
Discussion about this post