శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడి మనోగతం అంతు చిక్కడం లేదు. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసనమండలి ఎన్నికల ప్రచారానికి ఏ కారణంగానో ఆయన దూరంగా ఉంటున్నారు. ఆయన అనుచర వర్గం కూడా శాసనమండలి ఎన్నికల్లో ఎక్కడా పాల్గొనడం లేదు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డికి, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడికి మధ్య అంతరం పెరగడం వలనే ఎన్నికల ప్రచారానికి దూరమయ్యారనే ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రభావం అధికార పార్టీ అభ్యర్థులపై పడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదనరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ఎన్నికల సన్నాహక సమావేశంలో కూడా ఎస్సీవీనాయుడు పాల్గొనక పోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలు ఎక్కడకు దారి తీస్తాయోనేనని పలువురు అంటున్నారు.
శ్రీకాళహస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సీవీ నాయుడు శాసనమండలి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆ హామీతోనే ఆయన 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలో చేరారు. మొదటి విడతలోనే ఎస్సీవీనాయుడుకు శాసనమండలి పదవి వస్తుందని ఆయనతో పాటు ఆయన అనుచరవర్గం ఆశించారు. మొదటి విడతలో ఆయనకు మొండి చెయ్యి చూపారు. అయినా ఆయన అసంతృప్తి చెందలేదు. రెండవ విడతలోనైనా వైసీపీ అధిష్టానం తనకు అవకాశం కల్పిస్తుందనే నమ్మకంతో ముందుకు వెళ్లారు.
అయితే రెండవ విడతలో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈయనకు మళ్లీ మొండి చెయ్యి చూపారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా ఉన్న తిరుపతి రష్ ఆస్పత్రి అధినేత డాక్టర్ సిపాయి సుబ్రహ్మణ్యంను అప్పటికపుడు ఆ పార్టీకి రాజీనామా చేయించి స్థానిక సంస్థల కోటాలో శాసనమండలి పదవి ఇచ్చారు. ఈ కారణంగా ఎస్సీవీ నాయుడుకు శాసనమండలి పదవి దక్కలేదు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థుల విజయానికి కీలక పాత్ర పోషించిన ఎస్సీవీనాయుడుకు… ఎన్నికల తరువాత ఆ పార్టీ సరైన గుర్తింపు ఇవ్వలేదు.
ఆయన అనుచర వర్గానికి కూడా ఏ పనులు జరగడం లేదనే అసంతృప్తి ఉంది. అయినా ఎస్సీవీనాయుడు ఏనాడూ వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడలేదు. స్థానిక నేతల తీరు పట్ల కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన దాఖలాలు లేవు. ఇందుకు కారణం అధిష్టానం తనకు న్యాయం చేస్తుందనే బలమైన నమ్మకం ఆయనలో ఉండటమే. అయితే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నమ్మకం నిలబెట్టు కోలేదు. చివరి నిమిషంలో సిపాయి సుబ్రహ్మణ్యంను తెరమీదకు తీసుకువచ్చి శాసనమండలి పదవి ఎస్సీవీనాయుడుకు దక్కకుండా చాలా మందే ప్రయత్నం చేశారు.
చివరకు వారి మాటే నెగ్గించుకున్నారు. దీంతో ఎస్సీవీనాయుడుకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదు. చివరి నిమిషం వరకు తనకు ఉన్న అన్ని మార్గాల్లో ఎస్సీవీ నాయుడు ప్రయత్నించినా ఫలితం లేక పోయింది. తనకు అన్యాయం జరగడంతో ఎస్సీవీనాయుడు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. అయినా ఆయన ఎక్కడా అసంతృప్తిగా మాట్లాడలేదు. శాసనమండలి అభ్యర్థులను ప్రకటించిన తరువాత మౌనంగా ఉంటున్నారు. భవిష్యత్ ప్రణాళిక ప్రకటించాలని అనుచరులు ఆయనపై ఒత్తిడి తెస్తున్నప్పటికీ పెద్దాయన మాత్రం సహనం పాటించాలని సూచిస్తున్నారే తప్ప ఎక్కడా రాజకీయం మాట్లాడటం లేదు. ఈ నెల 13న జరగనున్న శాసనమండలి ఎన్నికలకు సంబంధించి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ, పీడీఎఫ్ అభ్యర్థులు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు.
అయితే ఎస్సీవీ నాయుడు కానీ… ఆయన అనుచర వర్గం కానీ ఎక్కడా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం లేదు. వీరంతా మౌనంగా ఉంటున్నారు. వీరు మౌనంగా ఉండటం వలన శ్రీకాళహస్తి, సత్యవేడు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ఎస్సీవీనాయుడు వర్గానికి చెందిన పట్టభద్రుల ఓట్లు చీలి పోయే అవకాశం ఉంది. ఇది ప్రతి పక్ష పార్టీకి లాభం చేకూరుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. శాసనమండలి ఎన్నికల్లో అధికార పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీనాయుడును దూరంగా ఉంచుతారో… లేక కలుపుకుని ముందుకు వెళతారో వేచి చూడాల్సి ఉంది.
.

Discussion about this post