‘సూపర్ సిక్స్’ హామీల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న ‘స్త్రీ శక్తి’ పథకం సూపర్ హిట్ అయింది. ఈ పథకానికి మహిళల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఉచిత బస్సుల్లో ఆరు రోజుల్లో 65లక్షల మందికి పైగా ప్రయాణించారు. తిరుమలకూ ఉచిత బస్సులు ఏర్పాటు చేయడానికి పరిశీలన జరుగుతోంది. అదే అమలు చేస్తే వెంకన్న భక్తుల ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. ఉచిత బస్సు కూటమి ప్రభుత్వానికి మంచి మైలేజీ తెస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఢిల్లీలో మొదలైన ఈ పథకం దక్షిణాది రాష్ట్రాలలోనూ గేమ్ చేంజర్ గా మారింది. కర్ణాటక, తెలంగాణ ఎన్నికల సమయంలో ఉచిత బస్సు పథకం కల్పిస్తామని చెప్పిన పార్టీలు… ఆ తర్వాత ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టి అధికార పగ్గాలు చేపట్టాయి. ఇదే సంప్రదాయం ఏపీలోనూ కొనసాగింది.
ఆగస్టు 15వ తేదీ నుంచి మన రాష్ట్రం మరో కొత్త అధ్యాయానికి సాక్షిగా నిలిచింది. స్త్రీ శక్తి పేరుతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకం ప్రారంభించింది. ఇది కేవలం ఒక ప్రయాణ సదుపాయం మాత్రమే కాదు. ఇది మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, సమాజంలో లింగ సమానత్వం వంటి అంశాల్ని బలపరచే పెద్ద అడుగుగా భావించాలి. ఈ పథకం ద్వారా మహిళలు, ట్రాన్స్ జెండర్లు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు.
ఏడాదికి భారం రూ.1,950కోట్లు
ఆర్థికంగా చూస్తే… ఈ పథకం ఏపీఎస్ ఆర్టీసీపై ఏడాదికి సుమారు రూ.1,950 కోట్లు భారం పడుతుంది. దీనిలో ఉచిత టికెట్ల విలువ రూ.1,453 కోట్లు కాగా… నిర్వహణ ఖర్చులు రూ.201 కోట్లు. ప్రభుత్వం ఈ మొత్తాన్ని ఏపీఎస్ఆర్టీసీకి తిరిగి చెల్లించనుంది. ఇప్పటి పరిస్థితుల్లో ఇది రాష్ట్ర ప్రభుత్వానికి భారమే. అయితే ఇది భారం కాదని… బాధ్యతని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. మంత్రి చెప్పే మాటల్లో కూడా వాస్తవం ఉందనే భావించాలి.
మహిళల కోసం 8,459 బస్సులు
‘స్త్రీ శక్తి’ పథకం కోసం ఇప్పటికే 8,459 బస్సులు కేటాయించారు. కొత్తగా 700 ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేశారు. రాబోయే రెండేళ్లలో మరో 1,400 బస్సుల కొనుగోలుకు సిద్ధమవుతున్నారు. కండక్టర్ల పోస్టులు కూడా భర్తీ చేస్తామని రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తాజాగా ప్రకటించారు. ఈ పథకం వల్ల మహిళల ప్రయాణ శాతం గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం ఆర్టీసీల్లో ప్రయాణిస్తున్నవారిలో 40శాతం మహిళలు కాగా… ఇది 67 శాతానికి పెరగవచ్చని అంచనా.
మహిళలకు ఆర్థిక స్వతంత్రత..!
ఈ మార్పు తాత్కాలిక ప్రయోజనానికి పరిమితం కాదు. ఇది ఉద్యోగం, విద్య, వ్యాపారం వంటి రంగాల్లో మహిళల పాల్గొనదలచిన సమర్థతను పెంచుతుంది. రోజువారీ బస్సు ఛార్జీలు ఆదా కావడం వల్ల, ఆ డబ్బును కుటుంబ ఖర్చులు, పిల్లల చదువు, ఆరోగ్య సంరక్షణ వంటి అవసరాలకు విని యోగించవచ్చు. ఇదే మహిళల ఆర్థిక స్వతంత్రతను మన్నించే దారిగా నిలుస్తుంది. భద్రత కోణంలోనూ ప్రభుత్వం నూతన చర్యలు తీసుకుంటోంది. మహిళా కండ క్టర్లకు బాడీ వార్న్ కెమెరాలు, బస్సుల్లో సీసీ కెమెరాలు అమరికతో పాటు… బస్ స్టేషన్లలో ఫ్యాన్లు, కుర్చీలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాల మెరుగుదలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.
మహిళల భవితకు వెలుగు
ఉచిత బస్సు పథకం రాష్ట్రానికి కొంత ఆర్థిక భారం తెచ్చి పెడుతుందన్నది సత్యం. సేవల నాణ్యత తగ్గే ప్రమాదం ఉంది. బస్సుల్లో రద్దీ పెరగవచ్చు. పురుషుల ప్రయాణశాతం తగ్గి ప్రైవేటు వాహనాలపై ఆధారపడే పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే, పథకం దుర్వినియోగం జరగకుండా పర్యవేక్షణ.. నియంత్రణ కీలకం. దీన్ని ఒక సంక్షేమ పథకంగా మాత్రమే చూడకూడదు. ఇది మహిళల భవిష్యత్తును వెలుగు చూపే మార్గం. ఈ పథకం విజయవంతం కావాలంటే పక్కా ప్రణాళిక, సమర్థవంతమైన అమలు, సమగ్ర పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వానికి ఇది తక్షణ ఆర్థిక భారంగా ఉన్నా… దీర్ఘకాలంలో సామాజికంగా, ఆర్థికంగా రాష్ట్రానికి గొప్ప లాభాన్ని తెచ్చిపెడుతుంది. మొత్తానికి, స్త్రీ శక్తి పథకం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మహిళా సాధికారత పట్ల చూపుతున్న ఆత్మీ యతకు ప్రతిరూపం. ఇది ఒక ప్రయాణ సదుపాయం కాదుమహిళల పురోగతికి, సమాజ సమతా స్థితికి, సమగ్ర అభివృద్ధికి దోహదపడే సామాజిక విప్లవానికి నాంది.
సంస్థ ఆదాయం కోల్పోవద్దంటే…
స్త్రీ శక్తి పథకం మహిళల ప్రయాణ సౌకర్యానికి దోహద పడగా… పురుష ప్రయాణీకుల వలన సంస్థ ఆదాయం కోల్పోకుండా ఉండాలంటే పురుషులకు అదనపు బస్సు సౌకర్యాలు కల్పించాలి. ఆటో, టాక్సీ డ్రైవర్ల ఆదాయ నష్టాన్ని తగ్గించేందుకు సబ్సిడీలు, రుణాలు ఇవ్వాలి. ఈ చర్యల ద్వారా మహిళల సాధికారతతో పాటు పురుష ప్రయాణికులు, ఆటో డ్రైవర్లు కూడా నష్టపడకుండా, సమతౌల్యమైన వాహన వ్యవస్థను ఏర్పాటు చేయవచ్చు.
ఉచిత బస్సుకు విశేష స్పందన
ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత బస్సు పథకానికి విశేషమైన స్పందన వస్తోంది. అధికారిక సమాచారం మేరకు కేవలం ఆరు రోజుల్లో 65లక్షల మంది మహిళలు ప్రయాణించడం ఇందుకు నిదర్శనం.పథకం తొలిరోజే ఉచిత బస్సు ప్రయాణాలతో మహిళలు రూ.5 కోట్లు మేర ఆదా చేసుకున్నారు. ఆధార్, ఓటరు, రేషన్ కార్డు చూపించి బస్సులో ప్రయాణించొచ్చు. ‘స్త్రీ శక్తి’ పథకం ద్వారా దాదాపు 2.62 కోట్లు మంది మహి ళలకు లబ్ధి చేకూరుతుండగా, పథకం అమలు వల్ల ప్రభుత్వంపై ప్రతి యేటా రూ.1,942 కోట్లు భారం పడనుంది. ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్ జెండర్లకు సైతం వర్తింపు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Discussion about this post