ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమీపిస్తున్నాయి. ఏడాది కంటే తక్కువ వ్యవధిలోనే ఎన్నికలు జరగనున్నాయి. అయితే అక్కడ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఒకటి రెండు నెలల దూరంలోనే ఎన్నికలు జరగబోతున్నాయా? అని అనుమానం కలిగేంతగా హడావుడి చేస్తున్నాయి.
అధికార పార్టీగా ఉంటూ ఈసారి ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లో గెలుచుకోవాలని.. ప్రజలు ఎరుగని అనూహ్యమైన సంక్షేమ పథకాలను అమలు చేయడం ద్వారా మరో 30 ఏళ్ల పాటు నిరాటంకంగా అధికార పీఠంపై ఉండగల విధంగా మంచి పేరు తెచ్చుకోవాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అందుకు తగినట్లుగా ఆయన వ్యూహరచన చేసుకుంటున్నారు. ఇప్పటికే గడపగడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్, జగనన్న సురక్ష వంటి పథకాలను ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి తాజాగా వై ఎపి నీడ్స్ జగన్ అనే మరో కొత్త కార్యక్రమాన్ని కూడా ప్రకటించారు.
జగన్ ఎన్నికలకు సిద్ధం అవుతున్న తీరును గమనిస్తే జగన్ కొంత మేర రైట్ ట్రాక్ లోనూ కొంత మేర రాంగ్ ట్రాక్ లోను వెళుతున్నట్టు కనిపిస్తోంది. అవేంటో చూద్దాం.
రైట్ ట్రాక్
తమ ప్రభుత్వం ఏం పనిచేసిందో ప్రజలకు చెప్పుకుని వారి పాజిటివ్ ఓటును దక్కించుకోవడం మీద జగన్ ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. గడపగడపకు వైసీపీ కార్యక్రమం గానీ, ఇప్పుడు ఆయన కొత్తగా ప్లాన్ చేస్తున్న ‘వై ఎపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంగానీ అలాంటివే. నిజానికి ఇవి పార్టీకి మైలేజీ సృష్టించే పరంగా మంచి కార్యక్రమాలు. ప్రజల్లో మంచి పేరును నిలబెట్టే కార్యక్రమాలు.
సాధారణంగా ఏ పార్టీ అయినా గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత.. జనం వెళ్లి ఎమ్మెల్యేలను కలవాల్సిందే తప్ప.. ఎమ్మెల్యేలు ప్రజల ఇంటిదాకా వచ్చి వారితో మాట్లాడడం అనేది జరగదు. మహా అయితే ఊర్లలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంతే తప్ప.. గెలిచిన తర్వాత కొన్నేళ్లు పాలన సాగిన తర్వాత.. ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరగడం గతంలో ఎన్నడూ లేని వ్యవహారం. దీనిని ఒక కార్యక్రమంలాగా రూపుదిద్ది ఇంటింటికీ ఎమ్మెల్యేలను తీసుకువెళ్లడం అనే మంచి ఆలోచనను జగన్ అమలు చేస్తున్నారు. ప్రతి ఇంటికీ తాము ఎంత లబ్ధి చేకూర్చామో డబ్బుల లెక్కలు చెబితే ప్రజలు తమకు రుణపడిన భావనతో ఉంటారని ప్రభుత్వం ఆశిస్తున్నట్టుగా జరుగుతుందో లేదో గానీ.. గెలిచిన తర్వాత కూడా ఎమ్మెల్యే ఇంటికి వచ్చి పలకరించడం అనేది వారి పట్ల ఖచ్చితంగా సానుకూల అభిప్రాయం ఏర్పాటుచేస్తుంది.
Also Read :
దేవీప్రసాద్ ఒబ్బు కథ : మాతృదేవోభవ
‘వై ఎపీ నీడ్స్ జగన్’ అనే కార్యక్రమం కూడా ఇలాంటిదే. అది కూడా జగన్ సర్కారు రైట్ ట్రాక్ లో నడుస్తున్న కార్యక్రమంగా భావించాలి. ఎందుకంటే.. గత చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేసిన పనులతో పోల్చి, తాము ఏం చేశామో ఈ ప్రభుత్వం చెప్పుకోబోతోంది. అలా చెప్పడంలో అబద్ధాలు, అతిశయోక్తులు, అర్థసత్యాలు ఏమైనా ఉంటే ఉండవచ్చు గాక.. కానీ.. కార్యక్రమం పరంగా ఇది రైట్ ట్రాక్ అని అనుకోవాలి. ఎందుకంటే.. రాజకీయ ప్రత్యర్థిని బూతులు తిట్టడమూ, చంద్రబాబునాయుడు ముసలివాడై పోయాడని ఎద్దేవా చేయడమూ కాకుండా.. వాళ్ల పరిపాలన తీరు ఎలా సాగింది.. మా పరిపాలన ఎలా సాగుతోంది.. పోల్చి చెప్పడం కచ్చితంగా రైట్ ట్రాక్ అవుతుంది.
రాంగ్ ట్రాక్
రాజకీయ ప్రత్యర్థుల పట్ల తిట్లు, దూషణలు, వేధింపులు లాంటివి ఖచ్చితంగా జగన్ అనుసరిస్తున్న రాంగ్ ట్రాక్ అని చెప్పాలి. రాజకీయ ప్రత్యర్థుల పట్ల నాయకులు ద్వేషం, వైషమ్య భావాలు ఉండడం చాలా సహజం. వారు తమను వేధించారనే ఆరోపణలు, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉండడం కూడా సహజం. అందుకే చాలా సందర్భాల్లో అధికారం దక్కిన వారు, ప్రత్యర్థుల మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉంటారు.
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల విషయంలో ద్వేష రాజకీయాలు నడిపిందనే ఆరోపణలు విరివిగానే మూటగట్టుకుంది. తెలుగుదేశం నాయకుల ఇళ్లు, ఆస్తులు నిబంధనలు అతిక్రమించినట్లుగా ఎక్కడ కనిపించినా సరైన రీతిలో నోటీసులు ఇవ్వకుండా, క్రమబద్ధీకరించుకునే అవకాశం ఉన్నా ఇవ్వకుండా.. వాటిని ఎడాపెడా కూల్చివేయిస్తూ కక్ష సాధించారనే ఆరోపణలున్నాయి. తెదేపా నాయకుల్ని వేర్వేరు కేసుల కింద అరెస్టు చేయడం వెనుక కూడా ద్వేషకారణాలే ఎక్కువ అని అనేవాళ్లున్నారు.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో గానీ, ఇతరత్రా వేదికల మీద గానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ అభిప్రాయం వెలిబుచ్చిన ప్రతి ఒక్కరినీ కూడా ప్రభుత్వం శత్రువులుగా పరిగణించడం అనేది ఘోరం. సోషల్ మీడియా విస్తృతం అయిన తర్వాత.. తెలుగుదేశం లేదా ఇతర రాజకీయ ప్రత్యర్థులకు చెందిన వారు కూడా కుట్రపూరితంగా ప్రభుత్వాన్ని బద్నాం చేసే పోస్టులు పెట్టడం చాలా సహజం. అదే సమయంలో, తటస్థమైన వ్యక్తులు కూడా ప్రభుత్వం తీరుతెన్నుల పట్ల తమకు భిన్నాభిప్రాయాలు ఉంటే వాటిని ఖచ్చితంగా సోషల్ వేదికల మీద వ్యక్తం చేస్తారు. ఇలాంటి విమర్శలు చేయడంలో కూడా.. అనుచితమైన భాషతో అసహ్యమైన పోస్టులు పెట్టేవారికి, సద్విమర్శ చేసే వారికి తేడా లేకుండా ప్రభుత్వం వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిందనే విమర్శలున్నాయి. ఈ రెండు వర్గాల వారిని ఒకే గాటన కట్టేసి, అలాంటి వారందరి మీద సీఐడీ కేసులు పెట్టడం, అరెస్టులు చేసి వేధించడం వంటివి ప్రభుత్వం స్థాయికి తగవు. ఖచ్చితంగా ఇది జగన్ అనుసరిస్తున్న రాంగ్ ట్రాక్.
ఉదాహరణకు మార్గదర్శి సంస్థల మీద దాడుల వ్యవహారాన్ని తీసుకుంటే మనకు అర్థమవుతుంది. తన పార్టీకి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తున్నందుకు ఈనాడు మీద కక్ష కట్టి ఈ సంస్థ మీద ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని అందరూ అనుకుంటున్న సంగతి. ఈనాడు కూడా ప్రభుత్వంలో చిన్న లోపం ఉన్నా దాన్ని భూతద్దంలో చూపిస్తూ గోరంతల్ని కొండంతలుగా చెప్పే నిందలు వేస్తున్నదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే అందుకు ప్రభుత్వం కక్ష సాధించదలచుకోవడానికి మార్గదర్శిని టార్గెట్ చేయడం రాంగ్ ట్రాక్ గమనం. ఈనాడు రాతలు విషం చిమ్మాయని అనిపిస్తే.. తమ సాక్షి పత్రిక ద్వారా.. జగన్ ఆ రాతలకు విచ్చలవిడిగా కౌంటర్ ఇవ్వవచ్చు. ఆ విషపు వార్తల మాయలో పడిన ప్రజలపై సాక్షి ద్వారా అమృతం చిలకరించవచ్చు. అది సరైన పని అవుతుంది. కానీ.. మధ్యలో మార్గదర్శి ద్వారా కక్ష తీర్చుకోవాలని అనుకోవడమే తమాషా. పైగా మార్గదర్శి పై జరుగుతున్న దాడులు ఇప్పట్లో తేలవు. వారు చందాదారుల పట్ల నేరం చేసినట్టుగా అంత త్వరగా నిరూపించడం కష్టం. ఎన్నికలదాకా కూడా ప్రభుత్వం వేధిస్తూ వస్తున్నదనే మాట చెలామణీలోనే ఉంటుంది. అప్పటికి ప్రజల్లో.. ఈ ప్రభుత్వం ద్వేషరాజకీయాలు నడిపిస్తున్నదనే భావన కలిగితే అది వారికి శ్రేయస్కరం కాదు. ఇదంతా రాంగ్ ట్రాక్ పోకడల కిందికి వస్తుంది.
ఎన్నికలకు ఇంకా ఏడాదిదూరం కూడా లేదు. ఈ చివరి ఏడాదిలో జగన్ తాను ప్లాన్ చేస్తున్న రైట్ ట్రాక్ కార్యక్రమాలను మరింత దూకుడుగా ప్రజల్లోకి తీసుకు వెళ్లడం మంచిది. అదే సమయంలో రాంగ్ ట్రాక్ పనులను తగ్గించుకోవాలి. దానివల్ల రైట్ మార్గంలో.. ప్రభుత్వానికి ప్రజల్లో మరింత ఎక్కువ సానుకూల పవనాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
Discussion about this post