తెలుగుదేశం పార్టీకి మరో దెబ్బ పడనుందా? అసలే ఆ పార్టీ పరిస్థితి దారుణంగా ఉండగా. . మరో ఎమ్మెల్యే కూడా ఆ పార్టీని వీడిపోనున్నారు. కష్టాల్లో ఉన్న చంద్రబాబునాయుడుకు ఇది మరొక దెబ్బ. రేపల్లె తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్.. వైఎస్సార్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా పుకార్లు గుప్పుమంటున్నాయి.
విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సుమారు 5 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రత్యేక విమానంలో రష్యాయాత్రకు వెళ్లిన సంగతి.. ఇంకా వివాదంగానే రాజుకుంటోంది. రాష్ట్రంలో రోడ్లన్నీ గతుకులమయంగా అధ్వానంగా తయారైఉండగా.. ప్రత్యేకవిమానంలో రష్యా వెళ్లాల్సిన అవసరమేంటనే విమర్శలు బాగానే వినవస్తున్నాయి. అయితే.. ఇది కేవలం మంత్రిగారు వెళ్లిన విహార యాత్ర మాత్రమే కాదు. రాజకీయ ఆకర్షక యాత్ర కూడా! తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ను వైసీపీలోకి రప్పించేందుకు ఉద్దేశించిన యాత్ర కూడా అని తెలుస్తోంది.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి చాలా దయనీయంగా తయారవుతోంది. పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఆల్రెడీ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ పట్ల విముఖంగా, పార్టీకి దూరంగా మెలగుతున్నారు. ఇలాంటి కష్టాల్లో ఉండగా అనగాని సత్యప్రసాద్ కూడా అదే పార్టీ తీర్థం పుచ్చుకుంటారనే గుసగుసలు ఇప్పుడు ప్రబలంగా వినిపిస్తున్నాయి.
నిజానికి రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ తెలుగుదేశాన్ని వీడిపోతారనే ప్రచారం ఇవాళ్టిది కాదు. కొన్ని నెలలుగా ఆయన పార్టీకి దూరంగానే ఉన్నారు. సత్యప్రసాద్ భారతీయ జనతా పార్టీలో చేరుతారనే ప్రచారం కూడా కొన్ని నెలలుగా జరుగుతూనే ఉంది.
తాజాగా, మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేక విమానంలో రష్యాకు వెళ్లిన విహారయాత్రలో ఆయన వెంటవెళ్లిన మిత్రబృందంలో ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ కూడా ఉన్నారు. ఇందులో విశేషం గానీ, రహస్యంగానీ ఏమీ లేదు. ఆయన స్వయంగా ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్వయంగా చెప్పారు. తన వెంట దగ్గరి మిత్రులతో ఆ యాత్రకు వెళ్లానని, ఆ యాత్రలో తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఉన్నారని ఆయన అన్నారు.
అయితే తాజాగా మంత్రిగారితో ఆప్తమిత్రుడి హోదాలో పర్యటన ఫలితాల్లో.. వైసీపీ లో చేరడం కూడా ఖరారు అయినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే అనగాని చేరికకు ముహూర్తం ఉంటుందని సమాచారం. జగన్మోహన్ రెడ్డి.. అధికారికంగా పార్టీలో చేర్చుకోవడాన్ని తాను విశ్వసించే రాజకీయ నైతిక విలువలకు విరుద్ధంగా భావిస్తారు గనుక.. అనగాని సత్యప్రసాద్ ఇతర ఫిరాయింపు ఎమ్మెల్యేల మాదిరిగానే.. జగన్మోహన్ రెడ్డిని కలిసి.. కండువా కప్పుకోకుండా.. తన అనుచరులకు మాత్రం కండువా కప్పించి.. జగన్ పరిపాలన పట్ల విశ్వాసం ప్రకటించి.. తాను కూడా ఆయన పాలనకు మద్దతుగా నిలుస్తానని ప్రకటించే రోజు తొందర్లోనే ఉన్నదని అనుకోవచ్చు.
.

Discussion about this post