‘అదిగో జూసినావా… ఆకాసెంలో కుక్కా నక్కల పెళ్లవతండాది’ అనేటోడు ప్రసాదన్న, మేం చిన్నప్పుడు…! ఎప్పుడైనా మిట్టమద్దేనం పెళపెళ ఎండగాస్తా ఉండేటప్పుడు… ఎండ తెల్లంగా ఉండగానే.. దబదబ నాలుగు చినుకులు రాల్నాయనుకో… గబుక్కున ఆ మాటనేటోడు. అట్టామాదిరిగా ఎండావానా ఒకేసారి వొస్తే… ఆకాసెంలో కుక్కా నక్కల పెళ్లి జరగతా వుంటాదంట. అన్నకి ఎవురో వాళ్ల నాయినమ్మో.. యింకో ముసిల్దో ఆ మాట జెప్పినారంట. నాకు మటుకేం దెల్సు. వోడు నాకంటే పెద్దోడు గాబట్టి… నిజిమేననుకున్నా. యింకోటుండాది. మా నాయిన నన్ను ఆరో తరగతిలో యేసేది లేదన్నాడు. నన్ను అయిస్కూల్లో ఎయ్యాల్సిందే అని నేలమీద బడి పొర్లాడి ఏడస్తా ఉంటే.. పక్కింటి ప్రసాదన్నని తొడుకోనొచ్చి… ‘ఇదిగో మ్మేయ్.. నువు నీ తోకేసాలేమీ ఎయ్యకుండా.. అన్నతో కూడా మూస్కోని పొయ్యొచ్చే పనైతే.. బళ్లో యేస్తా’ అని కండీసను పెట్నాడు. అందుకని వోడేం జెప్పినా సరే నేను యినేదాన్ని. ఎండలో వాన గురిసినప్పుడెల్లా కుక్కానక్కల పెళ్లవతంటాది.. లడ్డూ కారాసూ కొంచిమైనా జారి కిందికి పడకపోతాయా.. అని మోర పైకెత్తి ఆకాసానికేసి జూసేదాన్ని.
వయసు పెరగతా వొచ్చింది. సదూకున్నాను. బళ్లో అయ్యోరమ్మ నైనాను. బతుకులో యెండావానా జమిలిగా గురిసినప్పుడెల్లా… యిస్టం కస్టం రెండూ కూడబలుక్కుని నన్ను నొక్కేసినప్పుడెల్లా.. కుక్కా నక్కల పెళ్లి గెమనానికొచ్చేది. యిప్పుడు గూడా వొస్తండాది. మనసులో ఎండా వానా ముసురుకుంటండాయి.
***
ఎండాకాలం లీవులు. సంసారాన్నంతా యేసుకోని అరవదేశానికి ఎలబార్నాము. గుళ్లూ గోపురాలూ జూసేసొస్తే పున్నెం దండుకోవచ్చునని తిరగతా వుండాము. ఏమాటకామాటే జెప్పుకోవాల… దేవుళ్ల సత్తె మెట్టాంటిదో పైనోడికే తెలియాల. గుళ్ల మాటకొస్తే మాత్తరం అరవోళ్ల గుళ్లే జూడాల. యెంతా పెద్దవి.. యెంతా పెద్దవీ… ఈ కొస నుంచి ఆ కొసకు జూడాలంటే.. పనసకాయిలంత కళ్లుండాల. పెట్టిపుట్టాల. అయ్యన్నీ జూస్కుంటా.. ఊరూరా గుళ్లలో దణ్నాలు పెట్టుకుంటా… తిరగతావుంటే.. అప్పుడొచ్చింది ఫోను. ఏదో తెలవని నెంబర్నించి. ఎత్తితే.. అవతల సమంత. సమంతమ్మ సినిమా రిలీజైన్రోజే యీ పిల్ల పుట్టిందంట.. వోళ్ల నాయినకి సినిమాలో పిల్ల నచ్చి… పుట్టిన్దానికి ఆ పేరెట్టుకున్నాడంట!
ఆ పిల్ల నా క్లాసులోనే చదవతంది. యిప్పుడే నాలుగో క్లాసైంది. ‘ఏవమ్మా…’ అన్నాన్నేను లాలనగా. ‘టీసీ గావాల టీచా’ అనిందా పిల్ల. ముందూ యెనకా యేమీ లేకుండా. గుండెలో రాయి పడింది. నా తరగతిలో అంతో యింతో సుబ్బరంగా జదివే పిలకాయిల్లో యిదొకటి. బాగా జదివే పిలకాయిలుంటేనే గద… టీచరు బాగా జెప్తండాది అని నలుగురూ అనుకునేది. కాపు బాగుంటేనే మనం మొక్కకి కాసిని నీళ్లు బోస్తాం.. లేకుంటే పీకి పారేస్తాం అంతే గద! యిప్పుడీ పిల్ల టీసీ అడగతండాదేందబ్బా.. యీళ్ల నాయిన సేద్దెం సాగట్లేదా యెట్టా.. కూలిపన్లకి టౌనుకి వలసెళ్లిపోతండాడా ఎట్టా.. అని గుండెకాయంతా గుబగుబలాడిపోయింది. ‘ఎందుకమ్మా..’ అనడిగినాను.. చిక్కబట్టుకోని.
పకపక నవ్విందా పిల్ల.. ‘చూసినా టీచా.. యాది మర్సిన. గురుకుల్లో సీటొచ్చింది’ అనింది మురిపెంగా. నాకు చాలా గర్వంగా అనిపించింది. ఒకటో తరగతి కాణ్నించి.. యీ పిలకాయిల్ని దిద్దుకుంటా వొస్తే.. యిప్పుడు ఆ పిల్ల ఎంట్రెన్సు పరీచ్చ రాసి, నెగ్గి, గురుకుల్ సీటు గొట్టిందంటే సంబరమే గదా. ‘కంగ్రాట్స్..’ అన్నాను. ‘జల్దీ టీసీ గావాలంట టీచా..’ అనింది- నా మాట పట్టకుండా. ‘యిప్పుడు సెలవులు గదమ్మా… బడి తెరవగానే… హెడ్మాస్టరు మేడం యిస్తుంది..’ అన్జెప్పి అప్పుటికి పెట్టేసినా. మొత్తానికి గుళ్లలో దేవుళ్లని మొక్కతా తిరగతండాం గదా.. యీ శుభవార్త వొచ్చి పడింది. మన బిడ్డలకి మంచి జరగడానికంటే.. మనం గోరుకునే మంచేముంటాది.
అవతల్నాడు రామేశ్వరం దాటి కన్యాకుమారికి జేర్నాం. వివేకానందుడు ఆడ తపసు జేసినాడంట. సముద్రం మద్దెన ఆ పెద్ద బండ మీదకి పడవలో బొయ్యినాం. ఆడుండగా వచ్చింది యింకో ఫోను. యీసారి నా క్లాసులో జదివే పిలగాడి నాయిన. ‘మేడం అర్జంటుగా టీసీ కావాలి మేడం’ అన్నాడు. యిదేం ఉపద్రవం రా నాయినా… ఏడాదికేడాది కాళ్లు పడిపోయే లాగా ఊరంతా తిరిగి పిలకాయిల్ని బళ్లో జేర్పించీ.. నానా కస్టం బడి వాళ్లని సానబట్టి.. గరిక లాగొచ్చినోళ్లని మెరికలాగా జేసుకుంటా వుంటే… ఏడాది ముగిసే సరికి.. అందురూ యిట్టా జారిపోతే ఎట్టా? అని బేజారెత్తిపోయినా! ‘ఏం సార్? మీకేమైనా ట్రాన్స్ ఫరా?’ అనడిగినా.. నా ఏడుపంతా బయటబెట్టకుండా! ‘లేదు మేడం.. మా వాడికి గురుకుల్ సీటొచ్చింది గదా..’ అన్నాడు. ‘డాం’ అనింది గుండెలో! యీడు కొంచిం హుషారైనోడే గదాని.. ‘మన బళ్లో యెంతమంది కొచ్చింది సార్’ అని ఆరా తీసినా…! ‘నలుగురైదుగురికి వొచ్చినట్టుంది మేడం..’ అన్నాడు.
సరిపాయె… వుండేదే నలబై నాలుగు మంది పిలకాయిలు. అందురూ ఒక తీరుగా చదవరు గదా…! ఈ నలుగురైదుగురూ కాసింత మన కస్టానికి పలితం లాగా తయారవతారనుకుంటే.. ఆళ్లంతా గురుకుల బళ్లకి యెళ్లిపోతండారు. ఆయన్తోగూడా టీసీ సంగతి హెడ్మాస్టరు మీద నెట్టేసి తప్పించుకున్నా.
తీరా బడి తెరిసినాక జూద్దును గదా… నా అయిదో తరగతి- మిడతలదండు కొల్లగొట్టేసిన పంట మాదిరిగా బోసిగా ఉండాది. తెరవగానే అందరు వొస్తారా యెట్టా అని సర్దుకున్నా. రెండోనాటికి, మూడో నాటికి తెలిసింది… ఏకంగా పదకొండు మంది పిలకాయిలకి వొచ్చిందంట గురుకుల సీటు. పేణం జావగారిపోయింది. గట్టిగింజలన్నీ గెద్దలేరుకుపోతే.. తాలు మిగిలిన పంటకళ్లాం లాగా ఉండాది తరగతి. క్లాసులో బాగా సదివేది యీళ్లే. ఎవురో ఒకరికి అయిదు అయినంక నవోదయలో సీటొచ్చిందంటే.. బలే ఉంటాదబ్బా అనుకుంటా నేర్పించినా. యిప్పుడు ఆళ్లంతా యెళ్లిపాయె. ఏడుపొస్తండాది. ఎక్కడబడితే అక్కడ ఎట్టా ఏడిసేది? అందుకే యింటికి బొయినంక మా ఆయిన్తో జెప్పుకోని బోరుమన్నా. యీ కతనంతా మొదుట్నించి జూస్తానే వుండాడు గదా… కొంచిం నిమ్మళం మాటలు జెప్తాడ్లే అనుకున్నా.
‘సాల్లే మూస్కో మే..’ అన్నాడు. ‘యిదిగో యీళ్లంతా బాగా చదివే పిలకాయిలు.. ఆళ్లకి సీట్లొస్తే నీ గొప్పేముండాది. మిగిలిపొయినారే సరిగ్గా సదవనోళ్లు.. ఆళ్లలో ఒక్కరికి నువు నవోదయ వొచ్చేమాదిరిగా జెప్పినావనుకో.. అదీ సెబాసైన పనంటే… సవాలుగా దీస్కో..’ అని డయిలాగులేసినాడు. నా కర్మం ఎట్ట గాలిందో సూడు.. యీ మడిసికి జెప్పుకునే దానికంటే కుంకాలు బెట్టిన రాయికో.. దారాలు జుట్టిన సెట్టుకో నా యేడుపు జెప్పుకోడం మేలు! స్సీ… యెదవ బతుకు యీన పాలబడింది. యేడుపొస్తే తుడవడం కూడా తెలీని మడిసి… అని సీదరించుకున్నా లోలోన.
బోలుగా ఉన్న తరగతిన్జూస్తే కడుపు దేవినట్టుండాది. నేను సదువు జెప్పిన పిలకాయిలు యింత మంది గురుకుల బళ్లకి బొయినారని పండగ జేసుకునేదా..? తరగతి ఖాళీ అయిపోయిందని దిగులు పడేదా? ఎండా వానా ఒక్కపాలిగా కమ్ముకుంటాండాయి లోపల. యీ ముదనష్టపు కుక్కా నక్కల పెళ్లి నా నెత్తిన జరగతండాదో ఏందో ఖర్మ!
నా మడిసి జెప్తావుండేటోడు.. పోగా మిగిలింది ఆస్తి.. పోయిన్దాని గురించి యెప్పుడూ యేడవబాక… అని! అది గేపకం దెచ్చుకోని.. ఉన్నోళ్లని మళ్లీ సానబట్టేదానికి మళ్లుకున్నా! యీళ్లని రతనాల్లాగా జేసేస్తా.. వొక్కడికైనా నవోదయలో సీటొచ్చేయాల… గురుకుల బళ్లకి యెళ్లినోళ్లంతా కుళ్లుకోవాల… అని పంతం బట్టినా…!
నాలుగు దినాలు గడిసినాయి. యింకో ఫోనొచ్చింది. యెత్తగానే అవతల గొంతు తెలిసిపోతండాది. ‘యేమ్మా శారదా.. యెలా వుంది కొత్త స్కూలు’ అనడిగినా.. ఆ యమ్మి నా తరగతిలో మెరికలాంటి పిల్ల. నాతో బిడ్డ మాదిరిగా చేరిగ్గా ఉండేది. యిప్పుడు గురుకుల బడికెళ్లింది.
‘నాకీ బడి నచ్చలే టీచా.. మా డేడీతో జెప్పేసిన. నీ బడికే వొచ్చేస్తా టీచా. యీ బడి నాకు నచ్చలే. నిన్నొదిలి పోను టీచా.. మా డేడీ రేపు దీస్కొచ్చి నీ బళ్లో యేస్తాడంట..’ కుశాలగా యింకా యేదో జెప్తానేవుండాది. నాకు యినబడ్డం లే!
కళ్లెదట ఎండ. కళ్లల్లో వాన! కుక్కా నక్కల పెళ్లి పూర్తయిపోయిండాదో ఏమో… నా మనసు మాత్రం పూలపల్లకీ యెక్కి ఊరేగతండాది.
.. టి. అన్నపూర్ణ
94417 55488
Discussion about this post