ఆంధ్రపదేశ్ లో ఏడేళ్ల తరువాత ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న నిరుద్యోగుల కల నెరవేరింది. సుదీర్ఘ కాలం తరువాత ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల ఆనందానికి అవధులు లేకుండా పోతోంది. ఈ ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు పుణ్యమేనని అభ్యర్థులు అంటున్నారు. నవ్యాంధ్రలో మొట్ట మొదటి సారిగా మెగా డీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి… అతి తక్కువ వ్యవధిలో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తూ… వారి కుటుంబాల్లో వెలుగులు నింపుతోంది. నిజంగా ఇది చాలా హర్షించ దగ్గ విషయం. అనేక అడ్డంకులను అధిగమించి ఉపాధ్యాయ ఉద్యోగాలు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వ విజయంగా చెప్పవచ్చు.
వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలన వికేంద్రీకరణ పేరుతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు. అందులో భాగంగానే సచివాలయాలకు సంబంధించి సుమారు 1.20లక్షల ఉద్యోగాలు భర్తీ చేశారు. అయితే జ్ఞాన సంపదకు ప్రధాన కేంద్రాలైన పాఠశాలల బలోపేతంపై అశ్రద్ధ చూపారు. నాడు-నేడు పేరుతో ప్రభుత్వ బడుల్లో మౌళిక వసతులు కల్పనకు కృషి చేశారు. కానీ… నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైన ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంలో నిర్లక్ష్యం చూపారు. ఒక దశలో మిగులు ఉపాధ్యాయులు ఉన్నారంటూ వైసీపీ హయాంలో మంత్రులు ప్రకటన కూడా చేశారు. ఈ కారణంగా జగన్ డీయస్సీ అభ్యర్థుల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నారు. అయితే సాధారణ ఎన్నికలు సమీపించే వేళ… 6,100 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడానికి అప్పటి జగన్ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. న్యాయపరమైన చిక్కులతో ఆ ప్రకటన అమలుకు నోచుకోలేదు. ఇలా ఐదేళ్ల జగన్ పాలనలో ఒక్క ఉపాధ్యాయ పోస్టు భర్తీకి నోచుకోలేదు.
టీడీపీ హయాంలో…
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో మొదటిగా టీడీపీ ప్రభుత్వం ఏర్పడింది. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత 2014లో 9,061 పోస్టులతో డీయస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పూర్తి చేశారు. ఆ తరువాత 2018లో 7,729 పోస్టులతో డీయస్సీ ప్రకటించగా… ఆ ప్రక్రియ వైసీపీ ప్రభుత్వంలో పూర్తయింది. ఆ తర్వాత జగన్ ప్రభుత్వంలో ఒక్క ఉపాధ్యాయ ఉద్యోగాన్నీ భర్తీ చేయలేదు. ఈ కారణంగా ఉపాధ్యాయ ఖాళీలు పెరిగి పోయాయి.
ఎన్నికల హామీ మేరకు…
చంద్రబాబునాయుడు తన సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా మెగా డీయస్సీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని ప్రకటించారు. అంతేగాకుండా తన మేనిఫెస్టోలో కూడా ఈ విషయం పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల్లో మెగా డీయస్సీని కూడా కలిపారు. ఆ హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే… చంద్రబాబు తన మొదటి సంతకం మెగా డీయస్సీ ఫైల్ పైనే చేశారు. అలా ఒకేసారి 16,347 పోస్టులు ప్రకటించిన కూటమి ప్రభుత్వం… డీయస్సీ ప్రక్రియ రికార్డు సమయంలో పూర్తిచేసింది. ఈ ఏడాది ఏప్రిల్ 20న మెగా డీయస్సీ నోటిఫికేషన్ ప్రకటించారు. జూన్ 6 నుంచి జూలై 2 వరకు మొత్తం 67 విభాగాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,36,307 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా… వారిలో 3.12 లక్షల మంది పరీక్షలు రాశారు. మొత్తం ప్రక్రియను పాఠశాల విద్యాశాఖ ఆన్ లైన్ లో నిర్వహించింది. టెట్ మార్కుల్లోనూ వివాదాలకు అవకాశం లేకుండా సరిదిద్దు కోవడానికి అనేకసార్లు అవకాశం కల్పిం చింది. ఎంపికైన వారి జాబితాలు నేరుగా ప్రకటించాలని భావించినా… అభ్యర్థుల్లో అనుమానాలకు తావివ్వకూడదనే ఉద్దేశంతో ఈ నెల 22వ తేదీ రాత్రి మెరిట్ జాబితాలు ప్రకటించింది. నేడు అనగా 24వ తేదీ (ఆదివారం) అభ్యర్థులకు కాల్ లెటర్లు అందించనుంది. ఈ మొత్తం ప్రక్రియకు 125 రోజులు మాత్రమే పట్టింది. మరో వారం రోజుల్లో భర్తీ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరే విధంగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది.
జగన్ హామీ ఇచ్చినా…
2019ఎన్నికల సదర్భంగా ఏపీలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని… తాను అధికారంలోకి వచ్చిన వెంటనే వాటిని మెగా డీఎస్సీ ద్వారా భర్తీ చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చాక జగన్ ఈ హామీ విస్మరించారు. అంతేగాకుండా జీవో నంబరు:117 తీసుకువచ్చి పోస్టులు హేతుబద్ధీకరణ చేశారు. ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీలే లేవనే కొత్త వాదన తెరపైకి తెచ్చారు. నిరుద్యోగుల నుంచి ఒత్తిడి రావడంతో తప్పని పరిస్థితుల్లో ఎన్నికలకు కొద్ది నెలల ముందు 6,100 పోస్టులతో వైసీపీ ప్రభుత్వం డీయస్సీ ప్రకటించింది. అది కూడా న్యాయ వివాదాల్లో చిక్కుకుని ఆదిలోనే ఆగిపోయింది. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఎన్నికల హామీ మేరకు మెగా డీయస్సీ నిర్వహించి… 16,347పోస్టులు భర్తీ చేయడానికి మెరిట్ జాబితా విడుదల చేసి… ప్రజల మన్ననలు పొందుతోంది. చంద్రబాబు హామీ ఇస్తే… తప్పకుండా నెరవేరుస్తారని ఈ డీయస్సీ ద్వారా నిరుద్యోగులకు నమ్మకం ఏర్పడింది.
ఒక్కొక్కరికే పిలుపు…
డీయస్సీలో మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన కోసం ఆదివారం కాల్ లెటర్లు అందనున్నాయి. ఏపీడీఎస్సీ వెబ్సైట్ అభ్యర్థుల లాగిన్లలో పాఠశాల విద్యాశాఖ వీటిని అందుబాటులో ఉంచనుంది. ఒక పోస్టుకు ఒకరు చొప్పున మొత్తం 16,347 పోస్టులకు గాను అంతమందినే సర్టిఫికెట్ల పరిశీలనకు పిలుస్తారు. సోమవారం నుంచి సర్టిఫికెట్ల పరిశీలన జిల్లాల్లో ప్రారంభమవుతుంది. ప్రతి 50మంది అభ్యర్థులకు ఒక బృందాన్ని కేటాయించారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని భావిస్తున్నారు. సర్టిఫి కెట్ల పరిశీలనకు ఎవరైనా హాజరు కాకపోయినా… సరైన సర్టిఫికెట్లు సమర్పించకపోయినా ఆ స్థానాలను ఖాళీగా చూపించి… వాటి భర్తీ కోసం మెరిట్ జాబితాలో తర్వాత నిలిచిన అభ్యర్థులకు అవకాశం కల్పిస్తారు.
Discussion about this post