జీవితం విలువైనది. కాదని ఎవరంటారు? ఆ గమనం ఏమీ పూలదారి కాదు. రాళ్ళు ముళ్ళు అన్నీ దాటుకొని వెళ్ళాల్సిందే. ఆ దారిలో ఎన్నో నిరాశానిస్పృహలు. జీవితం మీద విరక్తి కలిగే బలహీన క్షణాలు ఆవరిస్తాయి. అప్పుడు ధైర్యం చెప్పి.. ఓదార్పు ఇచ్చేవాళ్ళు కావాలి.
ఆ బాధ్యత తీసుకున్న కౌన్సెలర్ ఆయన. జీవితానుభవాలను పాటలుగా మలచి.. జీవితమ్మీద ఆశలు పెంచి కర్తవ్య బోధ చేసిన గీతాచార్యుడాయన. కుమిలిపోయి బాధపడే ఘటనలను కూడా అదేంటో అదృష్టం అని చెప్పి ఊరడించే పెద్దతనం ఆయన కలం సొంతం. ఆ కలం పేరు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి.
సినీ కవి అంటే సామాజిక బాధ్యత ఉంది అని బలంగా నమ్మిన కవి సీతారామ శాస్త్రి గారు. సినిమా పాటలు అంటే లొల్లాయి పాటలో, కాలక్షేపం అల్లరి పాటలో కాదని.. కలం బలంతో సాహిత్యాన్ని అందించవచ్చని చెప్పిన కవివరేణ్యుల సరసన కచ్చితంగా శ్రీ శాస్త్రి గారి ఘనమైన స్థానమే ఉంది.
‘ప్రేమ, కోపం, బాధ, సంతోషం, భయం, ఉత్సాహం.. ఇలాంటి భావాల్ని మామూలు ప్రజలు ఏ విధంగా వ్యక్తీకరిస్తారో, పాటల్లో ఉన్న పదాలు కూడా అలాగే వ్యక్తీకరించాలి’ అనేది శాస్త్రి గారి సిద్ధాంతం. ఆయన ఏ తరహా పాట రాసినా ఒక ప్రయోజనం ఉండాలని తపించేవారు. ప్రధానంగా ఆశావహ దృక్పథంతో ఉన్న గీతాలు రాయడానికి మక్కువ చూపేవారు. మనిషిలో కచ్చితంగా ఉండి తీరాల్సిన దృక్పథం ఆశావాదం అని బలంగా చెప్పేవారు. జీవితం అనేది ప్రతి క్షణం పోరాటమే.. ప్రకృతితో, సమాజంతో, కాలంతో పోరాడితేనే ఉనికి కాపాడుకోవచ్చు అంటారు. అలా ఆశావాదాన్ని ప్రభావశీలంగా చెప్పే గీతాలెన్నో శ్రీ శాస్త్రి గారి కలం నుంచి జాలువారాయి.
‘పట్టుదల’ అనే సినిమా ఎంతమదికి గుర్తు ఉంటుంది. అది వచ్చినట్లు వెళ్ళినట్లు కూడా చాలామందికి తెలియకపోవచ్చు. అందులోని పాటే ‘ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి/ ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి/ విశ్రమించవద్దు ఏ క్షణం.. విస్మరించవద్దు నిర్ణయం/ అప్పుడే నీ జయం నిశ్చయంరా..’ అనేది. ఆ పాట- నిరాశ అనే నిశి కమ్మిన జీవితాల్లో వెలుగు రేకలు ప్రసరింపచేస్తుంది. అందులో కవి ఏం చెబుతారంటే – ‘నింగి ఎంత గొప్పదైనా రివ్వుమన్న గువ్వ పిల్ల రెక్క ముందు తక్కువేనురా/ సంద్రమెంత పెద్దదైన ఈదుతున్న చేప పిల్ల మొప్ప ముందు చిన్నదేనురా..’ అంటూ నీ కష్టం, బాధ ఎంత పెద్దవి అయినా- నీ ముందు చిన్నవే నిరాశ వద్దు అంటారు. నీ గుండెను రగిలించు అంటూ ‘నిశా విలాసమెంత సేపురా/ ఉషోదయాన్ని ఎవ్వడాపురా’ అని ధైర్యం చెబుతారు. జీవితాన నొప్పి తప్పదు అది జననమైనా, మరణమైనా అని చెబుతూ దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది అంతకన్న సైన్యముండునా అని నీవే ఒక సైనికుడివి, పోరాటం చేయి అని వీర తిలకం దిద్దారు తన కలంతో.
సినిమా హిట్ అయితే పాట కూడా జనానికి చేరుతుంది అనేది ఒక సూత్రం. కాలక్రమంలో ఆ పాట నెమ్మదిగా జనంలోకి వెళ్లింది. నేటి స్టార్ డైరక్టర్ ఎస్.ఎస్.రాజమౌళికి ఈ పాట ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందట. తనలో, తన తండ్రిలో విశ్వాసం ఎగదన్నుకు రావడానికి ఈ పాట ఎలా దోహదపడిందో రాజమౌళి చెప్పారు. ఈ పాట విని కనీసం పాతిక మంది ఆత్మహత్య ప్రయత్నం నుంచి బయటకు వచ్చారనీ, ఆ విషయాన్నే వాళ్ళే తనకు చెప్పారని శ్రీ శాస్త్రి గారు ఎంతో సంతోషంగా చెప్పేవారు.
జీవితంలో ఏదీ సాధించలేకపోయామనో, లక్ష్యాన్ని అందుకోలేదనో, అవమానభారంతోనో ఆత్మహత్యలకు ప్రయత్నించేవారు తమకున్న వ్యతిరేక పరిస్థితుల్ని తట్టుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళేలా పాటలు రాయడాన్ని ఇష్టపడతాను అని చెప్పేవారు.
‘రుద్రవీణ’లో ‘తరలిరాద తనే వసంతం.. తన దరికి రాని వనాల కోసం’ పాటలో ‘వెన్నెల దీపం కొందరిదా – అడవిని సైతం వెలుగును కదా/ ఎల్లలు లేని చల్లని గాలి – అందరికీ అందును కదా’ అంటారు. మనకున్నది అది విద్య కావచ్చు, ఆస్తి కావచ్చు.. మనకు మాత్రమే సొంతం అనుకోవద్దు పదిమందికీ పంచడం ప్రకృతి ధర్మం అంటారు. అందుకే ఆ పాటలోనే ఇలా చెప్పారు ‘పంచే గుణమే పోతే – ప్రపంచమే శూన్యం/ ఇది తెలియని మనుగడ కథ- దిశనెరుగని గమనం కద’ అని బలంగా తన వాదన వినిపించారు.
అవకాశం దొరికితే మహిళలపై ఈ లోకం సూటిపోటి మాటలతో దాడి చేస్తుందో తెలుసు. ఈ నైజాన్ని నిరసిస్తూ బాధిత మహిళకు ఊరటనిస్తూ ధైర్యాన్ని నూరిపోశారు ‘నువ్వేమి చేశావు నేరం – నిన్నెక్కడంటింది పాపం’ పాటలో. ‘పెళ్లిచేసుకుందాం’లో అత్యాచార బాధితురాలైన నాయికను ఓదార్చే ఈ గీతంలో ‘కన్నీటి వర్షానికి కష్టాలు చల్లారునా/ మార్గం చూపే దీపం కదా ధైర్యం’ అంటారు. శీలం అంటే గుణం అని అర్థం అని చెబుతారు. సమాజ ధోరణిని ఈ విధంగా నిరసించారు – ‘గురువింద ఈ సమాజం – పరనింద దాని నైజం/ తనకింద నలుపు తత్వం – కనిపెట్టలేదు సహజం’. అంతేకాదు ‘ఆనాటి ద్రౌపదికి ఈనాటి నీగతికి/ అసలైన అవమానం చూస్తున్న ఆ కళ్లది/ అంతేగానీ నీలో లేదే దోషం’ అని చెప్పారు. దాదాపుగా ఇలాంటి సన్నివేశానికే ‘శ్రీకారం’ చిత్రంలో ‘మనసు కాస్త కలతపడితే మందు ఇమ్మని మరణాన్ని అడగకు/ కనుల నీరు తుడుచువారు ఎవరూ లేరని చితి ఒడికి చేరకు/ ప్రాణమన్నది బంగారు పెన్నిధి – నూరేళ్ళు నిండుగా జీవించామన్నది/ వేటాడు వేళలో పోరాడామన్నది’ అని కొండంత ధైర్యాన్ని నూరిపోశారు. ‘అంకురం’లో ‘ఎవరో ఒకరు ఎపుడో అపుడో’ పాటలో ‘మొదటివాడు ఎప్పుడూ ఒక్కడే మరి/ మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి/ వెనుక వచ్చు వాళ్ళకు బాట అయినది’ అంటారు.
మనిషిలో మాధవుణ్ణి చూడలేనన్ని రోజు ఎన్ని పూజలు చేసినా అది గుడ్డి జపమే అని చెబుతూ తనలోని సామ్యవాద భావాన్ని చూపారు.. రుద్రవీణలో చుట్టూపక్కల చూడరా చిన్నవాడా పాటలో. ‘స్వర్గాన్ని అందుకొనాలని వడిగా గుడి మెట్లెక్కావు/ సాటిమనిషి వేదన చూస్తూ జాలిలేని శిలవైనావు’ అని మడి, తడి, ఆచారం, వ్యవహారం అంటూ వర్ణ, ధనిక- పేద తారతమ్యాలు చూపే పెద్దవారిని తెగనాడారు.
వ్యంగ్య గీతాల్లో కూడా అవకాశం ఉంటే ఆశావాదాన్ని వదలలేదు. ‘మనసిచ్చి చూడు’లో ‘బోడి చదువులు వేస్టు నీ బుర్రంతా భోంచేస్తూ’ పాటలో క్రికెట్ ఆడు అయితే టెండూల్కర్ అయ్యేలా’ అంటారు. చదువుపై ఆసక్తి లేకపోతే ఉన్నదానిపైనే దృష్టిపెట్టి ఉన్నత స్థాయికి ఎదిగేలా ప్రయత్నించమంటారు. ‘నీక్కూడా వుండే వుంటుంది ఏదో ఒక టాలెంటు/ నీకు నీవు బాసవ్వాలంటే దాన్ని బయటపెట్టు/ రేసు హార్సువై లైఫ్ గెలిచే పరుగు మొదలుపెట్టు’ అంటారు.
కరుణ రస ప్రధాన గీతాల్లో కూడా ఆశావాదం ఉంటుంది. అమ్మానాన్న లేని అనాథను ఉద్దేశించిన పాటలో అసలు అమ్మానాన్న లేకపోవడమే గొప్ప అంటారు.. ‘అమ్మైనా నాన్నైనా ఎవరైనా ఉండుంటే..’ (సింహాద్రి) పాటలో. ‘అమ్మానాన్నా ఉంటే అమ్మో మా ఇబ్బందే/ కాస్తయినా అల్లరి చేసే వీల్లేదే/ సూరీడుకి నాన్నుంటే స్కూల్లో పెడతానంటే.. పగలైనా వెలుతురు వస్తుందా/ జాబిల్లికి అమ్ముంటే ఒళ్ళో జోకొడుతుంటే.. రాతిరేళ వెన్నెల కాస్తుందా’ అంటూ ఊరడిస్తారు.
శ్రీ శాస్త్రి గారు రచనల్లో నిక్షిప్తమై ఉన్న ఆశావాదం.. జీవితం అంటే పోరాడి గెలవాలనే బోధ ఎంతో ప్రభావశీలమైనది. ఈ గీతాచార్యుడు తన రచనలతో ఇచ్చే కౌన్సెలింగ్ ముందు- శాస్త్రం చదివి వ్యక్తిత్వాన్ని వికసింపచేసేస్తాం, ఆత్మన్యూనత పోగొడతాం అనేవాళ్ళు దిగదుడుపే.
.. వట్టికూటి చక్రవర్తి
Discussion about this post