భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. మ్యాచ్ పూర్తయిన తర్వాత విజేత ఎవరో మనం గమనిస్తాం తప్ప.. ఎలా గెలిచాం అనేదానికి ప్రాధాన్యం ఉండని మాట వాస్తవమే. ఆసియాకప్ సూపర్ ఫోర్ లో మూడో మ్యాచ్ ఆఫ్గనిస్తాన్ తో ఆడిన భారత్.. పసికూన లాంటి ఆ దేశం మీద చెమటోడ్చి నెగ్గింది. ఒక దశలో ఫలితం ఊహకందని విధంగా వస్తుందేమో అని భయం కలిగించేలా మ్యాచ్ సాగింది.
ఆసియా కప్ ప్రారంభం కావడానికి ముందు.. పాకిస్తాన్- శ్రీలంక మినహా.. మనకు ఎదురు నిలవగల మరో జట్టు ఉండదనే అభిమానులు అంతా అనుకున్నారు. పాకిస్తాన్ తో మ్యాచ్ ను సహజంగానే ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగానే భావించారు. క్రీడాభిమానుల ఆశలను నిలబెడుతూ… పాక్ తో జరిగిన రెండు మ్యాచ్ లలోనూ భారత్ ఘన విజయం సాధించింది.
కానీ సూపర్ ఫోర్ లో మూడో మ్యాచ్ లో ఆఫ్గనిస్తాన్ తలపడడంలో ఎందుకు తడబడిందో అర్థం కాని సంగతి. భారత్ బౌలింగ్ అంటే పాకిస్తాన్ భయపడిందేమో గానీ.. ఆఫ్గనిస్తాన్ లెక్క లేకుండా ఆడింది. ఏ దశలోనూ వారిని మనవాళ్లు కంట్రోల్ చేయలేకపోయారు. వారు ఏకంగా 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఇంత చిన్న దేశంతో పోరాడుతూ.. కేవలం చేతిలో మూడు వికెట్లు పెట్టుకుని 23 బంతుల్లో 21 పరుగులు చేయాల్సిన టెన్షన్ లోకి అభిమానుల్ని నెట్టారంటే మన బ్యాటింగ్ కూడా ఎంత చెత్త ప్రతిభను కనబరిచిందో అర్థం చేసుకోవచ్చు. ఆఫ్గనిస్తాన్ తెగించి ఆడిందనే కితాబివ్వాలి.
ఈ ఆసియాకప్ ను భారత్ గెలవవచ్చు గాక.. కానీ.. అది పూర్తి సంతృప్తి కరమైన విజయం కాదనే చెప్పాలి. ఈ టోర్నీలో లో విజయం దక్కినా కూడా.. మన బలహీనతలు కూడా చాలా బయటపడ్డాయని ఒప్పుకోవాలి.
.

Discussion about this post