గాలి పల్లకిలోన తరలి నా పాట పాప ఊరేగి వెడలె
గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలె”
సాహితీలోకపు గొంతు ఇప్పుడు మూగబోయింది. సాహితీ సిరులను పంచిన వెన్నెల శివైక్యం చెందింది. వెన్నెలకు మరణం లేదు. నింగిలో అందనంత దూరాన ఉన్నా మనకోసం నేలకి దిగి ఎప్పుడూ మనపై వెలుగులు చిందిస్తూనే ఉంటుంది చావు, పుట్టుకలు తనువుకే కానీ హృదయానికి కాదు. అది ఎప్పుడు నిత్యం, సత్యం, సుందరం. జీవన చక్రంలో సుఖదుఃఖాలు ఒకదాని వెంబడి ఒకటి పున్నమి వెన్నెల, అమావాస్య చీకటిలా పయనించే సినీవాలి (అమావాస్య వెళ్లిన తర్వాతిరోజు కనిపించే చంద్రవంక) ఈ జీవితం. ఇక మనసుకి మరణం ఎక్కడ..?
ఎన్నో అద్భుతమైన పాటలు మనకి అందించారు.. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు.
వారి సాహితీ ప్రయాణంలో “అది భిక్షువు వాడినేది కోరేది , బూడిదిచ్చే వాడినేది అడిగేది “, తొలి అడుగు ఎప్పుడూ ఒంటరిదే, అది వెనుక నడిచేవారికి దారిచూపుతుంది, ఎపుడో అపుడు ఎవరో ఒకరు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు”, జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది, ఏదారెదురైనా ఎటు వెళుతుందో అడిగానా, ఏం తోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా” లాంటి పాటలు వింటుంటే జీవిత సారాన్నంతా వడగట్టి పాటల చరణాల్లో పొందుపరచిన కర్మయోగి మనకి కనిపిస్తాడు.
ఆయన పాటల్లో నా హృదయాన్ని కదిలించి జీవన మార్గాన్ని నిర్దేశించిన రెండు పాటలను ఇక్కడ ప్రస్తావిస్తాను.
జగమంత కుటుంబం నాది -ఏకాకి జీవితం నాది
సంసార సాగరం నాదే- సన్యాసం శూన్యం నావే
మనం ప్రపంచంలో ఉంటాం. కానీ మనలో ప్రపంచం ఉండదు. ఇక్కడ మనది ఒంటరి ప్రయాణమే. అందుకే మన చుట్టూ ఎందరు ఉన్నా, ఈ బాహ్య ప్రాపంచిక సంసార బంధాలు అన్నీ మనిషిని బంధించినా మన మనసు మాత్రం ఆప్తకామునిలా (జీవితంలో అన్నీ అనుభవించిన వారు) తామరాకు మీద నీటిబొట్టులా ఎప్పటికప్పుడు మనసుని నిర్మలం చేసుకుంటే ఇక ఏ బాధలు మనలను అంటవు కదా.
“మల్లెల దారిలో – మంచు ఎడారిలో
పన్నీటి జయగీతలో- కన్నీటి జలపాతాల”
జీవిత ప్రయాణపు రహదారిలో ఒకసారి పూల బాటలు ఎదురుకావచ్చు, మరోసారి ఎండమావులున్న ఎడారి ముళ్ళలో నడవాల్సి రావచ్చు. గెలుపు, ఓటములు ఒకదానివెంట ఒకటి వస్తూ, పోతూ ఉండవచ్చు. కానీ ఇవన్నీ మనసుకి మాత్రం అంటకూడదు. కాలం చేసే మయాజాలాన్ని స్థిత ప్రజ్ఞత తో సాధించవచ్చు అంటూ ఈ పాటలో గొప్ప తాత్విక భావనలను పొందుపరచారు సిరివెన్నెల గారు.
2.
ఏదారెదురైనా ఎటువెళుతుందో అడిగానా
ఏంతోచని పరుగై ప్రవహిస్తూ పోతున్నా
కదలని ఓ శిలనే అయినా తృటిలో కరిగే కలనే అయినా
నా వెంట పడి నువ్వెంత ఒంటరి అనద్దు దయుంచి
ఎవరు.. ఇంకొన్ని జన్మాలకి సరిపడు స్మృతుల్ని ఇతరులు ఎరుగరు
నా ఊపిరిని ఇన్నాళ్లుగా తన వెన్నంటి నడిపిన చేయూత
ఎవరిది”
ఈ ప్రపంచంలో తాను ఒంటరి కాదు. అనుక్షణం తను ఆరాధించిన వ్యక్తి అనురాగం తన వెంట ఉండి తనని నడిపిస్తోంది. ఎవరూ తను ఒంటరి అని జాలి చూపవద్దు.
గాలివాటంలాగా తను ఓ చోట నిలకడగా లేకుండా పరుగులు తీస్తూ ఉన్నా, ఎందరినో కలుస్తూ ఉన్నా తన జ్ఞాపకాలు మాత్రం చెదిరిపోకుండా తన మనసుకి జీవాన్ని పోస్తున్నాయి . తన ఏకాంత పయనంలో తను, తన నీడ ఈ ఇద్దరమే నాకు చాలు, ఆనాడు తీరని ఆశలతో నేను ఉన్నా, నింగిలో ఎంతో దూరంలో ఉన్న జాబిలి వెన్నెల రూపంలో ప్రతిక్షణం మన చెంతకి చేరినట్లు తన స్మృతులే మనసుని అంటిపెట్టుకుని తనని ప్రతిక్షణం లాలిస్తున్నాయి” అంటూ నిగూఢమైనా భావనలతో ఈ పాటకు ప్రాణం పోశారు సిరివెన్నెల గారు.
.. రోహిణి వంజారి
రచయిత్రి
Discussion about this post