ఖజానా నిండడానికి ఒక మార్గం అని మాత్రమే అనుకున్నారు. కానీ.. వాస్తవంలో ఆ ఆలోచన బెడిసి కొట్టింది. ఓటీఎస్ పేరుతో.. టార్గెట్లు పూర్తి చేయడానికి క్షేత్రస్థాయిలో ప్రభుత్వ యంత్రాంగం.. లబ్దిదారుల వెంటపడుతున్న కొద్దీ.. వారిలో ఆగ్రహం పెరుగుతోంది. ఈ పరిణామాలు ప్రభుత్వానికి, జగన్ ప్రతిష్ఠకు గండంగా మారే అవకాశం కనిపిస్తోంది.
‘జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం’ పేదలకు భారంగా మారుతోంది. వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్) పూర్తి స్వచ్చందమంటూనే అధికార యంత్రాంగం బలవంతపు వసూళ్లకు పాల్పడుతోంది. వసూళ్ల కోసం వివిధ శాఖల ఉద్యోగులకు లక్ష్యం (టార్గెట్) విధించారు. మీరు ఏం చేస్తారో టార్గెట్ చేసి తీరాల్సిందేనని హెచ్చరికలు చేస్తున్నారు. అధికారుల హెచ్చరికలతో వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు ఓటీఎస్ జాబితాలో ఉన్న పేదలందరికీ నిత్యం ఫోన్లు చేస్తూ వేధిస్తున్నారు. వారి మెడపై కత్తి పెట్టి ఇస్తారా…? చస్తారా…? అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. ఇలా చేయడం వలన కొంతమంది అవమానం భరించలేక ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడిన సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. స్వచ్ఛందమంటూనే ప్రభుత్వం ఇలా బలవంతపు వసూళ్లకు పాల్పడటం వెనుక ప్రభుత్వ ఉద్దేశ్యం వేరేనని స్పష్టంగా తెలుస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేరుతో అమలు చేసే సంక్షేమ పథకాల కారణంగా ఇప్పటికే పీకల లోతు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకు పోయింది. సంక్షేమ పథకాలకు, ఉద్యోగుల జీతాలకు నిధులు సమకూర్చడం పెద్ద సవాల్ గా మారింది. ఇప్పటికే పెద్ద మొత్తంలో అప్పులు చేశారు. అప్పులు పుట్టక ప్రభుత్వ ఆస్తులూ తాకట్టు పెట్టారు. ఇంకా పెడుతూనే ఉన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినందున.. వారి ఆదాయంలో వాటా ఇవ్వాలంటున్నారు. ఇవే గాకుండా విశ్వ విద్యాలయాల నిధులను కూడా తీసుకుంటున్నారు. డబ్బు వచ్చే ఏ ఒక్క వనరును.. మార్గాన్ని జగన్ ప్రభుత్వం వదలడం లేదు. అలాంటి కోవకు చెందిందే జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేరుతో చేసే వన్ టైమ్ సెటిల్ మెంట్ (ఓటీఎస్).
రాష్ట్రంలో 1983 నుంచి 2011 సంవత్సరాల మధ్య ప్రభుత్వం నిర్మించి ఇచ్చిన గృహాలకు రుణ విముక్తి చేయడానికి ఓటీఎస్ పథకం అమల్లోకి తెచ్చినట్లు నేటి రాష్ట్ర పాలకులు చెబుతున్నారు. ఈ పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలక సంఘాల పరిధిలో రూ.15వేలు, నగర పాలక సంస్థల పరిధిలో రూ.20వేలు వంతున చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఒకవేళ అసలు లబ్దిదారుల నుంచి ఇతరులు ఇళ్లను కొనుగోలు చేసి ఉంటే… గ్రామీణ ప్రాంతంలో రూ.20వేలు, పురపాలక పరిధిలో రూ.30వేలు, నగర పాలక పరిధిలో రూ.40వేలు వంతున డబ్బు చెల్లిస్తే వారి పేరున ప్రభుత్వం రిజిస్టరు చేయిస్తుంది. సాధారణంగా రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టరు కార్యాలయాల్లోనే చేయాలి. అయితే ఓటీఎస్ కోసం జగన్ ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది.
గ్రామ, వార్డు సచివాలయాల్లోనే ఇళ్లను రిజిస్టరు చేసే విధంగా 1908 రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 6ను పాక్షిక మార్పులు ఇటీవలనే నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిషికేషన్ ప్రకారం గ్రామ సచివాలయాల్లో పంచాయతీ కార్యదర్శులు, వార్డు సచివాలయాల్లో వార్డు అడ్మినిస్ట్రేటివ్ కార్యదర్శులు సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. సచివాలయాల్లోని డిజిటల్ అసిస్టెంట్లు వీరికి సహకారం అందించాల్సి ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రాష్ట్రంలో ఓటీఎస్ కోసం 52లక్షల మందికి పైగా అర్హత సాధించారు. వీరిలో 45లక్షల మందికి పైగా జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద ఇళ్ళను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అంగీకారం తెలిపినట్లు ప్రభుత్వం చెబుతోంది. ఓటీఎస్ పేరుతో పేదల నుంచి రూ.10వేల కోట్లుకు పైగా వసూలు చేయడానికి ప్రభుత్వం పథకం రచించిందని ప్రతిపక్ష పార్టీలు చెబుతుండగా… రూ.4వేల కోట్లు మాత్రమే వస్తుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెబుతున్నారు.
ఇదిలా ఉండగా ఓటీఎస్ పూర్తి స్వచ్ఛంధమని ముఖ్యమంత్రి జగన్ ఇప్పటికే పలు పర్యాయాలు ప్రకటించారు. ఇటీవల జరిగిన ఉన్నతాధికారుల సమీక్షలో కూడా జగన్ ఇదే విషయం స్పష్టం చేశారు. పేదల కోసమే ఈ బృహత్తర కార్యక్రమం చేపట్టామని… బలవంతపు వసూళ్లకు ఎవరూ పాల్పడకూడదని ఆయన ఆదేశించారు. అయితే క్షేత్ర స్థాయిలో ఇందుకు విరుద్ధంగా ఉంది.
ఓటీఎస్ జాబితాను చేత పట్టుకుని వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లు ఇళ్లిళ్లూ తిరుగుతున్నారు. ఈ నెల 21న పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రిజిస్ట్రేషన్ కార్యక్రమం ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నందున రెండు, మూడు రోజుల వ్యవధిలో ఓటీఎస్ పూర్తి చేయాలని క్షేత్రస్థాయి సిబ్బందికి ఉన్నతాధికారులు టార్గెట్ విధించారు. దీంతో వారు నిద్రాహారాలు మాని పేదల చుట్టూ తిరుగుతున్నారు. ఓటీఎస్ చేసుకోక పోతే ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామని కొంతమంది ప్రత్యక్షంగా.. మరికొంతమంది పరోక్షంగా లబ్దిదారులను హెచ్చరిస్తున్నారు.
ఈ హెచ్చరికల నేపథ్యంలో పేదలు అడకత్తెరలో పడ్డారు. కరోనాతో అసలే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ఓటీఎస్ పేరుతో వేధింపులకు గురి చేయడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీ రామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో నిర్మించిన ఇళ్లకు జగన్ ప్రభుత్వానికి తాము ఎందుకు డబ్బు చెల్లించాలని కొంతమంది అధికారులను నిలదీస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా తమ ఆధీనంలో ఉన్న ఇళ్లకు తాము ఇపుడు ఎందుకు డబ్బు చెల్లించాలన్నది వారి ప్రశ్న. గతంలో ఏ ప్రభుత్వమూ పేదల నుంచి ఇలా డబ్బు వసూలు చేయలేదని.. జగన్ ప్రభుత్వం తమ స్వార్థం కోసం ఓటీఎస్ పేరుతో వసూళ్లకు పాల్పడుతోందని పేదలు అంటున్నారు.
EXCLUSIVE ARTICLES
సీనియర్ జర్నలిస్టు గోవిందరాజు చక్రధర్ వ్యాసాల ప్రత్యేకపేజీ కోసం క్లిక్ చేయండి
‘సుభాషితం’ సంస్కృతశ్లోకాలకు భావవివరణల వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు బీరక రవి ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సీనియర్ జర్నలిస్టు డాక్టర్ ఎస్ రాము ప్రత్యేక వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
దేవీప్రసాద్ ఒబ్బు లోపలిమాట వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
సంపాదకుడు సురేష్ పిళ్లె వ్యాసాల కోసం ఈ పేజీ క్లిక్ చేయండి
ఓటీఎస్ పూర్తి స్వచ్చంధమని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించినపుడు.. క్షేత్రస్థాయి ఉద్యోగులకు టార్గెట్ విధించడం వెనుక ఆంతర్యమేమిటన్నది ప్రతి సామాన్యునిలో ఉత్పన్నమయ్యే ప్రశ్న. చిత్తూరులో ఆదివారం జరిగిన జిల్లా పరిషత్ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్ధిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా ప్రజాప్రతినిధులకు ఓటీఎస్ టార్గెట్ విధించారు. దీనిని బట్టి ఏం అర్థం చేసుకోవాలి..? జగన్ మాటలు వినాలా…? లేక క్షేత్ర స్థాయిలో అధికారులు చెప్పే మాటలు వినాలా..? జనానికి అర్థం కావడం లేదు.
పేదలకు నిజంగా మేలు చేయాలనుకున్నపుడు ఉచితంగానే ఇళ్లపై సంపూర్ణ హక్కు ఎందుకు కల్పించకూడదన్నది ప్రతి క్కరూ వేస్తున్న ప్రశ్న. ఓటీఎస్ కు డబ్బు కట్టక పోయినంత మాత్రాన తమ ఇళ్లను ఎవరు లాక్కుంటారో చూద్దామనే తిరుగుబాటు కూడా ప్రజల్లో వస్తోంది. మొత్తానికి ఓటీఎస్ పథకం జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెంచుతోంది. ఇది గ్రహించి ప్రభుత్వం తగిన విధంగా ముందుకు పోతే మంచిదనే అభిప్రాయం వైసీపీ నేతల్లో సైతం వ్యక్తమవుతోంది. అందుకే ఓటీఎస్ విషయంలో జగన్ పునరాలోచించుకుంటే మంచిది.
.. వలిపి శ్రీరాములు
.

Discussion about this post