తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత తన పదవికి రాజీనామా చేశారు. అయితే తన పదవికి గండం ఉన్నది గనుకనే.. రేపో మర్నాడో ఎట్టి పరిస్థితుల్లోనూ వేటు పడుతుంది గనుకనే.. ఆమె రాజీనామా చేసినట్లుగా రాష్ట్రంలో ప్రజలందరూ అనుకుంటున్నారు. ప్రజలు ఏం అనుకుంటారో.. తన మీద ఎలాంటి నిందలు వస్తాయో.. పోతుల సునీతకు ముందే అవగాహన ఉన్నట్టుంది. అందుకే.. ఆమె.. తన వంతుగా కౌంటర్ ఇచ్చేస్తున్నారు. అనర్హత వేటు వేస్తారని భయపడి రాజీనామా చెయ్యలేదు.. అని సునీత రాజీనామా అనంతరం తన చర్యను సమర్థించుకున్నారు. ఎటూ పార్టీని వీడిపోయారు గనుక.. పార్టీ మీద నిందలు వేయడం చాలా సహజం. అదే మాదిరిగా ఆమె కూడా చంద్రబాబు మీద లోకేష్ మీద నిందలేశారు. 15 నెలలుగా చంద్రబాబు ప్రతిపక్ష నేతగా విఫలం అయ్యారన్నారు. ఎస్సి, ఎస్టీ, బీసీ మైనారిటీ వర్గాల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడన్నారు. చంద్రబాబు, లోకేష్ విధానాలు నచ్చక రాజీనామా చేశానని తూలనాడారు.అదే సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తేయడానికి కూడా ఆమె ప్రయత్నించారు. తెలుగుదేశం ఎమ్మెల్సీగా ఉంటూనే.. శాసనమండలి ఛైర్మన్ అనర్హత పిటిషన్ మీద విచారణ నిమిత్తం పిలిస్తే.. తల్లికి కరోనా అనే నెపం పెట్టి డుమ్మా కొట్టిన సునీత.. అదే రోజున జగనన్న విద్యాకానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడం లాంటివి జరిగాయి. ఆమె తాజాగా, జగన్ అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని.. అందుకే జగన్ మద్దతు ఇస్తున్నానని చెప్పారు. వైసీపీలో చేరే అంశం పార్టీ పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అన్నారు గానీ.. అధికారికంగా కండువా కప్పుకోవడం పెండింగ్ ఉన్నదే తప్ప.. ఆల్రెడీ ఆమె పార్టీలో చేరినట్టే అని అంతా అనుకుంటున్నారు.
.