“మతం అనేది ఒక మత్తు మందు. మతంతో ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలు ముడిపడి ఉన్నాయి. ప్రస్తుతం మతం సాహిత్యంలోకీ చొచ్చుకు పోతోంది, ఇది చాలా ప్రమాదకరం. మతం అనే దుర్మార్గం, చాంధసవాదం నుంచి సమాజాన్ని కాపాడుకోవాలి. ఇది కేవలం వామపక్ష భావజాలం ఉన్న వారితోనే సాధ్యమవుతుంది. సమాజ శ్రేయస్సు కోసం కమ్యూనిస్టులందరూ ఆచరణలో ఏకం కావాలి” అని విప్లవ రచయితల సంఘం (విరసం) పూర్వ కార్యదర్శి వి.చెంచయ్య పిలుపునిచ్చారు. తిరుపతి నగరం బైరాగపట్టెడలోని గంధమనేని శివయ్య, కృష్ణారెడ్డి భవన్ లో జరిగిన అభ్యుదయ రచయితల సంఘం (అరసం) 20వ రాష్ట్ర మహాసభల ముగింపు రోజైన ఆదివారం నాడు ఆయన హాజరయ్యారు.
ఈ మహాసభల్లో భాగంగా మన్నవ భాస్కరనాయుడు వేదికపై జరిగిన ఆరవ సదస్సులో ‘మతం-వర్తమాన సమాజం’ అనే అంశంపై చెంచయ్య ముఖ్య ప్రసంగం చేశారు. కాకినాడ జిల్లాకు చెందిన అరసం నేత సి.సబ్బరాజు అధ్యక్షత వహించిన ఈ సభను తెలుగు భాషోద్యమ సమితి అధ్యక్షులు తమటం రామచంద్రారెడ్డి సమన్వయం చేశారు. ఈ సందర్భంగా వి.చెంచయ్య మాట్లాడుతూ… మతం మీద గట్టి పోరాటం చేయడానికి వామపక్షాలు ఐక్యం కావాలన్నారు. ఇది కేవలం ఒకచోట కూర్చొని మాట్లాడితే కుదిరే పని కాదని, ఆచరణలోనే దీనిని నిరూపించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
దేవుడిని కొలవడంలో నియంతృత్వం
ప్రస్తుతం మనం ‘జై శ్రీరామ్’ నినాదంతో పోరాడాల్సిన క్లిష్ట పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇందుకు ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక కారణాలు బలంగా ఉన్నాయని విశ్లేషించారు. అసలు శ్రీరాముడినే ఎందుకు కొలవాలి? అని ప్రశ్నించిన ఆయన… మతం, దేవుడిని కొలవడంలో స్పష్టమైన నియంతృత్వ ధోరణి కనపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. “రక్షించేవాడు మనిషి, రక్షించమని కోరేవాడు భక్తుడు, కానీ ఏమీ చేయకుండా మిన్నకుండే వాడు దేవుడు” అని వ్యాఖ్యానించారు. మతం, దేవుడు అనేవి పూర్తిగా ఎవరి వ్యక్తిగత ఇష్టాలపై ఆధారపడి ఉంటాయన్నారు. మతం అనేది తాత్కాలిక ఓదార్పునిచ్చే మత్తు మందు మాత్రమేనని, ఇది నమ్మకంపై ఆధారపడిన మూఢ విశ్వాసమే తప్ప సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేశారు.
కమ్యూనిస్టులే ప్రధాన శత్రువులా?
ప్రస్తుత పాలకుల విధానాల వల్ల మన సమాజం చాలా ప్రమాదకరమైన స్థితిలో పడిపోయిందని చెంచయ్య ఆందోళన వ్యక్తం చేశారు. పాలకులు భక్తులపై కూడా నియంతృత్వ ధోరణిని అవలంభిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో క్రైస్తవులు, ముస్లింలు ఉండాలంటే వారు హిందువుల లాగే ఉండాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత పాలకులు క్రైస్తవులను, ఇస్లాం అనుసరించే వారిని, కమ్యూనిస్టులను శత్రువులుగా చూస్తున్నారని… వీరందరికంటే ప్రధానంగా కమ్యూనిస్టులనే తమ ముఖ్య శత్రువులుగా ప్రకటిస్తున్నారని, ఇది చాలా బాధాకరమైన విషయమని అన్నారు. నేటి పాలకులు చివరకు ‘జనగణమన’ను కూడా పక్కన పెట్టి.. ‘వందేమాతరం’ మాత్రమే పాడాలంటూ ఒత్తిడి తెస్తున్నారని పేర్కొన్నారు.
మార్క్సిస్టు భావజాలంతోనే రక్షణ
మతం అనేది ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉన్నందున, ఈ మతం అనే మత్తు నుంచి సమాజాన్ని తక్షణమే కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రమాదాన్ని సామాన్య జనం ఒంటరిగా ఎదుర్కోలేరని, ఇది కేవలం మార్క్సిస్టు భావజాలం ఉన్న వారికే సాధ్యమవుతుందని, అందుకే కమ్యూనిస్టులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేవలం మతాన్ని, దేవుని తిట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, సమస్య యొక్క మూలాలను ఆలోచించి పరిష్కారం కనుగొనాలని సూచించారు.
సనాతనం పేరిట మార్పును అడ్డుకుంటున్నారు
ప్రస్తుత పాలకులు సమాజంలో మళ్లీ ‘సనాతనం’ అనే భావనను పైకి తీసుకువస్తున్నారని, ఇది చాలా బాధాకరమని చెంచయ్య అన్నారు. సనాతనం అంటే అసలు మార్పు లేనిదని అర్థమని… సమాజంలో మార్పు అనేది లేనే లేదా? అని ప్రశ్నించారు. మార్పు అనేది ప్రకృతి యొక్క సహజ ధర్మమని, ఈ సత్యాన్ని నేటి పాలకులు గమనించాలని హితవు పలికారు. మతం, దేవుడు, విశ్వాసం అనే అంశాలు కేవలం ఒక వ్యక్తికి సంబంధించినవి మాత్రమేనని, వీటికి సమూహంతో లేదా సమాజంతో సంబంధం లేదన్నారు. మతానికి ఒక ప్రమాదకరమైన చాంధసరూపం ఉంటుందని హెచ్చరించారు. ప్రస్తుతం సాహిత్యంలోకి కూడా మతం ప్రవేశిస్తోందని, ఈ నేపథ్యంలో అభ్యుదయ రచయితలందరూ తక్షణమే మేల్కోవాలని వి.చెంచయ్య పిలుపునిచ్చారు.
.
Discussion about this post