సమకాలీన సామాజిక సంక్షోభాలకు సజీవ దర్పణం: ‘కథానిధి’ కథల అంతరంగ ఆవిష్కరణ
(ఆగస్టు 23, 2026 నాటి ఆదివారం అనుబంధాల కథలపై ఒక సమగ్ర విమర్శనాత్మక పరిశీలన)
భూక్యా గోపినాయక్ ,
9989159196.
****************
సాహిత్యమంటే కేవలం అచ్చు కాగితం మీద అందంగా పేర్చిన నల్లటి అక్షరాల సముదాయం కాదు.. అది నెత్తురూ మాంసమూ ఉన్న ఒక సజీవ మానవ అనుభవం. మనిషి అంతరంగంలోని అగాధాలను, మారుతున్న కాలంతో పాటు అతడు ఎదుర్కొంటున్న సామాజిక, మానసిక సంఘర్షణలను అక్షరబద్ధం చేయడమే గొప్ప సాహిత్య లక్షణం. యాంత్రిక జీవనంలో, ప్రపంచీకరణ నేపథ్యంలో మనిషి తనను తాను వెతుక్కునే క్రమంలో ఎదుర్కొంటున్న అస్తిత్వ వేదనను ఆధునిక తెలుగు కథ అత్యంత సమర్థవంతంగా రికార్డు చేస్తోంది. మునిసురేష్ పిళ్లె గారి సమర్పణలో 23 ఆగస్టు 2026 నాటి ‘కథానిధి’ (ఆదివారం కథలు) సంచికను చదివినప్పుడు, అందులోని పదకొండు కథలు భిన్నమైన సామాజిక, ఆర్థిక, మానసిక పార్శ్వాలను స్పృశించిన తీరు నన్ను తీవ్రంగా ఆలోచింపజేసింది.
ఒక మంచి ఇతివృత్తాన్ని ఎన్నుకున్నంత మాత్రాన కథ కళాత్మకతను సంతరించుకోదు. వస్తువుకు తగిన శిల్పం, పాత్రల మానసిక లోతులను తవ్వే నేర్పు, వాస్తవికతను ప్రతిబింబించే సహజత్వం ఉన్నప్పుడే అది పాఠకుడి గుండెల్లో శాశ్వతంగా నిలబడుతుంది. ఈ గీటురాయిపై నిలబెట్టి, ఈ సంకలనంలోని ప్రతి కథనూ ఒక నిశితమైన విమర్శకుడి దృష్టితో, సహృదయతతో లోతుగా విశ్లేషించుకుందాం.
1. అస్తిత్వ వేదన – ఆత్మీయత కోసం అన్వేషణ
కథ: శిశిర వసంతాలు రచయిత: పాపినేని శివశంకర్ (ఆదివారం ఆంధ్రజ్యోతి)
సాహిత్యం మనుషుల జీవితంలో దాగి ఉన్న సూక్ష్మ చలనాలను పట్టుకుంటుంది. సమాజం గమనించని చోట, మనోవిజ్ఞానం వెలుగుపెట్టని చోట, నైతిక శాస్త్రం సమాధానం చెప్పలేని చోట కథ తన వెలుగును ప్రసరిస్తుంది. పాపినేని శివశంకర్ రాసిన ‘శిశిర వసంతాలు’ అలాంటి కథ. ఇది ప్రేమ కథ కాదు. వివాహేతర సంబంధాల కథ కూడా కాదు. ఆధునిక మధ్యతరగతి జీవితంలో వ్యక్తిత్వం, ఆత్మీయత, స్వేచ్ఛ, బాధ్యత, ప్రేమ, అపరాధ భావనల మధ్య జరిగే అంతర్మథనాన్ని చిత్రించిన కథ.
ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా దాని కేంద్ర ప్రతీకను అర్థం చేసుకోవాలి. “శిశిరం” మరియు “వసంతం” ఇక్కడ కేవలం ఋతువులు కావు. అవి మనుషుల అంతరంగ స్థితులు. మనిషి జీవితంలో ఒక దశలో భావోద్వేగాలు ఎండిపోతాయి. ఆసక్తులు క్షీణిస్తాయి. తన ఉనికి పట్ల తనకే పరాయితనం ఏర్పడుతుంది. అది శిశిరం. అదే సమయంలో ఒక మాట, ఒక పుస్తకం, ఒక స్నేహం, ఒక ఆత్మీయ స్పర్శ మనలో కొత్త చిగుర్లను తొడిగిస్తాయి. అది వసంతం.
సమీర పాత్రను ఈ కోణంలో చూడాలి.ఆమె జీవితంలో పెద్ద విషాదం ఏమీ లేదు. భర్త హింసించడు. కుటుంబం ఉంది. సామాజిక గౌరవం ఉంది. కానీ ఆమె వ్యక్తిత్వం క్రమంగా అదృశ్యమైపోయింది. ఒకప్పుడు కవితలు రాసిన, పాటలు పాడిన, పుస్తకాలు చదివిన యువతి ఇప్పుడు కేవలం బాధ్యతలను నిర్వర్తించే గృహిణిగా మిగిలిపోయింది. ఇది ఆధునిక కుటుంబ వ్యవస్థలో స్త్రీ ఎదుర్కొనే అత్యంత సూక్ష్మమైన సంక్షోభం. ఆమెకు స్వేచ్ఛను నిషేధించలేదు. కానీ ఆమె వ్యక్తిత్వాన్ని అవసరం లేనిదిగా మార్చేశారు.ఈ పరిస్థితిని పాపినేని శివశంకర్ చాలా నిగూఢంగా చిత్రించారు. అందుకే సమీరలో కలిగే ఆత్మీయత ఆకలి పాఠకుడికి సహజంగా అనిపిస్తుంది. ఆమె ప్రేమను వెతకడం లేదు. తనను తాను వెతుకుతోంది.
అదే విధంగా సిద్ధార్థ పాత్రను కూడా సరళంగా అర్థం చేసుకోలేం. అతను విజయవంతమైన మేధావి. పర్యావరణ శాస్త్రవేత్త. సమాజంలో గౌరవం పొందిన వ్యక్తి. కానీ అతని జీవితంలో కూడా ఒక శూన్యం ఉంది. మేధోపరమైన సంభాషణకు, భావోద్వేగ భాగస్వామ్యానికి అతను తహతహలాడుతున్నాడు. అతని భార్య లావణ్య ప్రేమించనిది కాదు. కానీ ప్రేమకు అనేక రూపాలుంటాయి. లావణ్యది సంరక్షణ రూపంలోని ప్రేమ. సమీరది సంభాషణ రూపంలోని ప్రేమ.ఈ భేదాన్ని కథ చాలా సున్నితంగా ఆవిష్కరిస్తుంది.
తెలుగు కథల్లో వివాహేతర అనుబంధాలను చిత్రించినప్పుడు తరచుగా రెండు ప్రమాదాలు కనిపిస్తాయి. ఒకటి వాటిని రొమాంటిక్‌గా వ్యక్తంచేయడం. రెండవది నైతిక తీర్పులతో ఖండించడం. పాపినేని ఈ రెండు ఉచ్చులను దాటిపోయారు. ఆయన పాత్రలను సమర్థించరు. ఖండించరు. అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇది రచయిత పరిపక్వతకు నిదర్శనం.
ఈ కథలో అత్యంత ముఖ్యమైన పాత్ర నిజానికి లావణ్య.సాహిత్య అధ్యయనంలోలో మనం తరచుగా ప్రధాన పాత్రలపై దృష్టి పెడతాం. కానీ ఈ కథలో నైతిక కేంద్రం లావణ్య పాత్రలోనే ఉంది. ఆమె ప్రశ్న..”నేను మీకేం తక్కువ చేశాను?”…కథ మొత్తాన్ని కొత్త వెలుగులో చూపిస్తుంది.ఈ ప్రశ్నకు కథలో సమాధానం లేదు. ఉండకూడదు కూడా.
ఎందుకంటే ప్రేమను కేవలం కర్తవ్యంతో కొలవలేం. అదే సమయంలో కర్తవ్యాన్ని ప్రేమకు ప్రత్యామ్నాయంగా కూడా చూడలేం. ఆధునిక కుటుంబ జీవితంలో ఈ వైరుధ్యమే అత్యంత సంక్లిష్టమైన సమస్య. పాపినేని శివశంకర్ దాన్ని సరళీకరించకుండా అలాగే ఉంచారు.
కథలో ప్రకృతి, పర్యావరణం, పుస్తకాలు, సంగీతం, చిత్రకళ వంటి అంశాలు యాదృచ్ఛికంగా రావు. అవి పాత్రల అంతర్గత ప్రపంచానికి ప్రతీకలు. సిద్ధార్థ పర్యావరణ శాస్త్రవేత్త కావడం కూడా ఇందుకే. ప్రకృతిలో జీవవైవిధ్యం క్షీణించడం ఎలా ప్రమాదమో, మనిషి అంతరంగంలో భావవైవిధ్యం క్షీణించడం కూడా అంతే ప్రమాదం. సమీర జీవితంలో సంభవించిన శిశిరం ఈ రెండవ క్షీణతకు సూచన.
కథ చివర్లో రచయిత తీసుకున్న నిర్ణయం విశేషంగా గమనించదగినది. సమీర, సిద్ధార్థలు తమ అనుబంధాన్ని శారీరక లేదా వైవాహిక ప్రత్యామ్నాయంగా మార్చుకోరు. ఎందుకంటే వాళ్లు గ్రహించిన సత్యం మరింత లోతైనది. ప్రతి ప్రేమకు స్వాధీనత అవసరం లేదు. ప్రతి అనుబంధం సహజీవనంలోనే పరిపూర్ణత పొందదు. కొన్ని సంబంధాల విలువ వాటి పరిమితిని తెలుసుకోవడంలోనే ఉంటుంది.
ఇక్కడ కథ ఒక మానసిక పరిణతిని సూచిస్తుంది.సమీర సిద్ధార్థ ద్వారా తనలోని సృజనాత్మక వ్యక్తిత్వాన్ని తిరిగి కనుగొంటుంది. సిద్ధార్థ సమీర ద్వారా తన జీవితంలోని భావోద్వేగ శూన్యాన్ని గుర్తిస్తాడు. కానీ అదే సమయంలో లావణ్య ప్రేమ యొక్క విలువను కూడా కొత్తగా అర్థం చేసుకుంటాడు. ఈ అవగాహన వాళ్లను విడదీయదు.. అదే సమయంలో కలిపి కూడా ఉంచదు. అది వాళ్ల అనుబంధాన్ని మరొక స్థాయికి తీసుకెళ్తుంది.
ఈ కథను చదువుతున్నప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ రచనల్లో కనిపించే ఆత్మీయత గుర్తుకు వస్తుంది. అలాగే చలం కథల్లో కనిపించే వ్యక్తి స్వేచ్ఛ పట్ల ఆకాంక్ష కూడా గుర్తుకొస్తుంది. అయితే పాపినేని కథనం ఈ రెండింటికీ భిన్నమైనది. ఆయన పాత్రలు తిరుగుబాటు చేయవు. వ్యవస్థను ధిక్కరించవు. కానీ తమ అంతరంగాన్ని నిరాకరించవు కూడా. ఆ మధ్యస్థితినే ఆయన కథా వస్తువుగా మలిచారు.
‘శిశిర వసంతాలు’ కథ యొక్క ప్రధాన విజయం ఏమిటంటే, అది ప్రేమను గమ్యంగా కాకుండా ప్రక్రియగా చూపించడం. ప్రేమ వల్ల ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు పొందలేదు. కానీ తమను తాము కోల్పోకుండా నిలబెట్టుకున్నారు. అదే ఈ కథ యొక్క మానవీయ సౌందర్యం.
చివరికి ఈ కథ మనకు ఒక సత్యాన్ని గుర్తుచేస్తుంది. జీవితంలో కొన్ని అనుబంధాలు శాశ్వతంగా మనతో ఉండవు. కానీ అవి మన జీవిత ఋతుచక్రాన్ని మార్చేస్తాయి. మనలోని శిశిరాన్ని దాటి వసంతం వైపు నడిపిస్తాయి. ఆ తర్వాత అవి స్నేహంగా, జ్ఞాపకంగా, కృతజ్ఞతగా రూపాంతరం చెందుతాయి.
అందుకే ‘శిశిర వసంతాలు’ ఒక ప్రేమకథగా కాదు, ఆధునిక మనిషి ఆత్మాన్వేషణగా చదవదగిన కథ.
2. నాగరికత విధ్వంసం – కుంచించుకుపోతున్న ప్రకృతి
కథ: ఫ్యూచర్ సిటీ రచయిత: వాడ్రేవు చినవీరభద్రుడు (తెలుగుప్రభ)
తెలుగు కథాసాహిత్యంలో కొందరు రచయితలు కథలు రాయరు.. కాలాన్ని చదువుతారు. వారు పాత్రలను సృష్టించరు.. సమాజపు లోతైన చలనాలకు భాష ఇస్తారు. వాడ్రేవు చినవీరభద్రుడు అలాంటి రచయిత. ఆయన తాజా కథ “ఫ్యూచర్ సిటీ” (తెలుగుప్రభ) మొదటి చూపులో ఒక చిత్రకారుడు ప్రకృతి దృశ్యాల కోసం చేసిన అన్వేషణలా కనిపిస్తుంది. కానీ కథ ముగిసే సమయానికి అది ప్రకృతి కోసం వెతికిన ప్రయాణం కాదని, మనిషి కోల్పోతున్న మానవత్వాన్ని వెతికిన ప్రయాణమని తెలుస్తుంది.
ఈ కథలో కథానాయకుడు “వి” ఒక చిత్రకారుడు. అతని కోరిక చాలా చిన్నది. నగరానికి దూరంగా వెళ్లి ఒక చెట్టు, ఒక వాగు, ఒక గులాబీ తోట, ఒక వానమబ్బును ప్రత్యక్షంగా చూస్తూ చిత్రించాలి. ఈ కోరికలోనే కథ యొక్క విషాదం దాగి ఉంది. ఒకప్పుడు సహజమైన విషయం ఇప్పుడు అసాధారణమైన అన్వేషణగా మారిపోయింది.చినవీరభద్రుడు కథ ప్రారంభంలోనే ఒక యుగసత్యాన్ని మన ముందుంచుతారు. శంకర్‌పల్లి శంకర్‌పట్నంగా మారిపోయింది. పల్లె నగరమవుతోంది. నగరం మహానగరమవుతోంది. మహానగరం “ఫ్యూచర్ సిటీ”గా మారుతోంది. అభివృద్ధి అనే పేరుతో జరుగుతున్న కాంక్రీటీకరణ ప్రకృతిని మాత్రమే కాదు, జ్ఞాపకాలను కూడా చెరిపేస్తోంది.
ఈ కథలో ప్రకృతి ఒక దృశ్యం కాదు. ఒక విలువ.వి వెతుకుతున్న చెట్టు, వాగు, చెరువు అన్నీ వాస్తవానికి మనిషి కోల్పోతున్న జీవన సంబంధాల ప్రతీకలు. అతను వెతుకుతున్నది చిత్రకళకు అవసరమైన వస్తువు మాత్రమే కాదు.. మనిషి ప్రకృతితో ఉన్న సహజ సంబంధం. కానీ ఎక్కడ చూసినా గోడలు, రిసార్టులు, ఫార్మ్‌హౌస్‌లు, రియల్ ఎస్టేట్ బోర్డులు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఈ కథలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే రచయిత నగర విస్తరణను కేవలం భౌగోళిక మార్పుగా చిత్రించరు. అది ఒక సాంస్కృతిక పరిణామమని చూపిస్తారు.ఒకప్పుడు వ్యవసాయం, చెట్లు, వాగులు, పక్షులు మనిషి అనుభవ ప్రపంచంలో భాగంగా ఉండేవి. ఇప్పుడు “సాఫ్ట్‌వేర్” అనే ఒకే ఒక్క కల గ్రామీణ యువత కలలను ఆక్రమించింది. ఇంటర్మీడియట్ చదువుతున్న బాలుడు “ఏం అవుతావు?” అన్న ప్రశ్నకు “సాఫ్ట్‌వేర్” అని చెప్పడం ఒక వ్యక్తి సమాధానం కాదు. అది మన కాలం చెప్పిన సమాధానం.కథలో ఫ్రెంచి చిత్రకారుల ప్రస్తావన యాదృచ్ఛికం కాదు. బార్బిజాన్ పాఠశాల, కోరో, మిల్లే, రూసో వంటి చిత్రకారులు పారిశ్రామిక విప్లవం మధ్య ప్రకృతిని కాపాడాలనే కళాత్మక తపనకు ప్రతీకలు. చినవీరభద్రుడు ఆ చారిత్రక సందర్భాన్ని తెలంగాణ సమకాలీన వాస్తవికతతో కలిపి చూపించారు.
పందొమ్మిదో శతాబ్దపు ఫ్రాన్స్‌లో పారిశ్రామికీకరణ ఎలా ప్రకృతిని మింగిందో, ఇరవై ఒకటో శతాబ్దపు హైదరాబాద్ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ ఎలా పల్లెలను మింగేస్తోందో కథ చూపిస్తుంది.అయితే ఈ కథ ప్రకృతి నష్టంపై మాత్రమే కాదు.అలాగే గులాబీ తోట దగ్గర కథ ఒక్కసారిగా మరొక దిశలోకి మళ్లుతుంది. ఇక్కడినుంచే కథ తన అసలు లోతును అందుకుంటుంది.
మొదట కరెంటు సమస్య. పూలకు నీళ్లు పడకపోతే అవి వాడిపోతాయని రైతుల ఆందోళన. తర్వాత పోస్కో కేసులో నిందితుడు ఆరుగురిని హత్య చేసిన వార్త. రచయిత ఈ రెండు అంశాలను ఒకదానికొకటి పక్కన ఉంచడం ద్వారా ప్రస్తుత కాలపు నైతిక నిర్మాణాన్ని ప్రశ్నిస్తారు.కరెంటు రాకపోవడం గురించి వాళ్లలో కనిపించిన ఆందోళన, ఆరుగురు చనిపోయిన ఘటన గురించి మాట్లాడేటప్పుడు కనిపించకపోవడం కథలో అత్యంత భయానకమైన క్షణం.ఇక్కడ రచయిత ఎలాంటి వ్యాఖ్య చేయరు. కానీ పాఠకుడి మనసులో ఒక ప్రశ్నను నాటుతారు. మనం ప్రకృతిని మాత్రమే కోల్పోతున్నామా? లేక మనిషి ప్రాణం విలువను కూడా కోల్పోతున్నామా?
ఈ కథలో అత్యంత గొప్ప విజయం అదే.పోస్కో కేసు, అప్పులు, ఆన్‌లైన్ బెట్టింగ్, హత్యలు, ఆత్మహత్య….ఇవి వార్తాపత్రికల్లో ప్రతిరోజూ కనిపించే విషయాలే. కానీ చినవీరభద్రుడు వాటిని వార్తలుగా కాకుండా నాగరికత సంక్షోభంగా చూస్తారు.“ఫ్యూచర్ సిటీ” అనే శీర్షిక కూడా ఇక్కడే తన అసలు అర్థాన్ని పొందుతుంది.ఫ్యూచర్ సిటీ అంటే కేవలం ఎత్తైన భవనాలు కాదు. పెట్టుబడులు కాదు. పదకొండు కోట్ల రూపాయల ఇళ్లు కాదు. ప్రకృతి కనిపించని నగరం, మానవీయ స్పందన తగ్గిపోయిన సమాజం, హత్యల వార్తలు సాధారణ సంభాషణలుగా మారిపోయిన జీవితం…అదే ఫ్యూచర్ సిటీ.
ఈ కథలో వి అనే చిత్రకారుడు ఒక పాత్ర మాత్రమే కాదు. అతను సున్నితమైన మానవ చైతన్యానికి ప్రతినిధి. అతను ప్రకృతిని చిత్రించడానికి బయలుదేరి చివరికి సమాజపు ఆత్మను చూసి తిరిగి వస్తాడు.కథ చివర్లో బస్సులో కూర్చొని నగరాన్ని చూస్తున్న వి దృశ్యం చాలా అర్థవంతమైనది. చెట్లు కనిపించవు. వాగులు కనిపించవు. మేఘాలు కనిపించవు. కానీ క్రేన్లు కనిపిస్తాయి. కాంక్రీటు కనిపిస్తుంది. కోట్ల రూపాయల ప్రకటనలు కనిపిస్తాయి.అభివృద్ధి కనిపిస్తుంది.కాని జీవితం కనిపించదు.
ఈ కథను చదువుతున్నప్పుడు మహాశ్వేతాదేవి, జాన్ బెర్జర్, రేమండ్ విలియమ్స్ వంటి రచయితల సామాజిక దృష్టి గుర్తుకు వస్తుంది. ప్రకృతి వినాశనాన్ని వారు ఎప్పుడూ కేవలం పర్యావరణ సమస్యగా చూడలేదు. అది మానవ సంబంధాల సంక్షోభమని చెప్పారు. చినవీరభద్రుడు కూడా అదే విషయాన్ని తన కథలో సున్నితంగా ప్రతిపాదించారు.శిల్పపరంగా చూస్తే కథ ఒక వ్యాసంలా, ఒక యాత్రావివరణలా, ఒక సామాజిక వ్యాఖ్యానంలా, ఒక తాత్విక ధ్యానంలా ఏకకాలంలో నడుస్తుంది. కథకన్నా ఆలోచన ఎక్కువగా కనిపించినా, ఆ ఆలోచనే కథకు శక్తిగా మారింది.
మొత్తంగా “ఫ్యూచర్ సిటీ” మన కాలపు అభివృద్ధి నమూనాపై తీవ్రమైన ప్రశ్నలను సంధించే కథ. ప్రకృతిని కోల్పోయిన సమాజం చివరికి మానవత్వాన్నీ కోల్పోతుందేమో అన్న ఆందోళన ఈ కథ అంతటా వినిపిస్తుంది.అందుకే ఇది ఒక చిత్రకారుడి కథ కాదు. ఒక నగర కథ కూడా కాదు. ఇది మన భవిష్యత్తు గురించి రాసిన హెచ్చరిక. మనం నిర్మిస్తున్న “ఫ్యూచర్ సిటీ”లో చెట్లు మాత్రమే కాదు, మనుషులు కూడా కనుమరుగైపోకుండా ఉండాలంటే ఏమి చేయాలనే ప్రశ్నను మన ముందుంచిన కథ. అదే ఈ కథ యొక్క సాహిత్య ప్రాసంగికత, సామాజిక ప్రాముఖ్యత.
3. పల్లె రాజకీయాలు – సత్యం సాధించిన గెలుపు
కథ: ధర్మవిజయం రచయిత: మచ్చ విజేందర్ (నమస్తేతెలంగాణ బతుకమ్మ)
గ్రామీణ రాజకీయాలు, వర్గ పోరాటాలు, ఎన్నికల సమయంలో మనుషుల నిజస్వరూపాలు ఎలా బయటపడతాయో తెలిపే అచ్చమైన పల్లెటూరి కథ ఇది. జబ్బల మల్లయ్య అనే మంచివాడిని సర్పంచ్ గా ఏకగ్రీవం చేయాలని ఊరి పెద్దలు అనుకుంటే, నర్సయ్య అనే వ్యక్తి దాన్ని వ్యతిరేకించి బంగారి పండ్లీరన్న అనే ధనవంతుడిని బరిలోకి దించుతాడు.
పండ్లీరన్న ఓటర్లను డబ్బుతో కొనడమే కాకుండా, తన గెలుపు కోసం ఒక కులం తక్కువ వాడితో ఎక్కువ కులం పిల్లను లేపుకుపోయేలా చేసి సానుభూతి నాటకం ఆడతాడు. నర్సయ్య ఆ నాటకాన్ని పసిగట్టి, రాత్రికి రాత్రి ఊరి జనాలకు నిజం చెప్పి పండ్లీరన్నను ఓడించడం, మల్లయ్యను గెలిపించడం ఈ కథలోని ప్రధానాంశం.
ఊరందరికీ ఉపయోగపడే గుడి, బడి కట్టడం కోసం మల్లయ్య పడే తపన ఒక ఆదర్శాన్ని సూచిస్తుంది. తెలంగాణ మాండలికంలో, పల్లె పదబంధాలతో నడిచిన ఈ కథ.. డబ్బు కన్నా ధర్మమే అంతిమ విజయం సాధిస్తుందన్న ఆశాభావాన్ని రేకెత్తిస్తుంది.
4. ఆశావాదం – శ్రమ సాధించిన పసిడి కాంతులు
కథ: ఇంద్రధనుస్సు రచయిత: డా.చిట్యాల రవీందర్ (సాక్షి ఫన్డే)
కార్పొరేట్ రాక్షసుల మధ్య ఒక మధ్యతరగతి ఆవిష్కర్త తన మేధస్సుకు, నిజాయితీకి పడే పడరాని పాట్లకు అద్దం పట్టిన కథ ‘ఇంద్రధనుస్సు’. జగన్నాథం అనే వ్యక్తి ఐదేళ్ల కృషితో ‘సోలార్ పవర్ సేవర్’ అనే పరికరాన్ని కనిపెడతాడు. కానీ ఎనిమిది నెలలుగా ఒక్క ఆర్డర్ కూడా రాక ఇల్లు గడవడం కష్టమవుతుంది.
భార్య సుమిత్ర, కొడుకు ఆకాష్ ఆయన్ను నిందిస్తుంటారు. ఈ తరుణంలో పాత మిత్రుడు రాజశేఖర్ వచ్చి, పేటెంట్ రైట్స్ ను యాభై లక్షలకు అమ్మేయమని ప్రలోభపెడతాడు. పేద ప్రజలకు ఉపయోగపడాల్సిన పరికరాన్ని కార్పొరేట్ కంపెనీలకు అమ్మనని జగన్నాథం ఆ ఆఫర్ ను తిరస్కరిస్తాడు. గ్రీన్ ఎనర్జీ కాన్ఫరెన్స్ లో తన పరికరాన్ని ప్రదర్శించి, ఏకంగా ఐదు కోట్ల జాయింట్ వెంచర్ (టాటా గ్రీన్ ఎనర్జీ సంస్థ నుండి) సాధించడం ఈ కథకు ముగింపు.
“నాకు ఒక్కరోజు గడువు ఇవ్వండి, నా ఆకాశంలో ఇంద్రధనుస్సు చూపిస్తాను” అని జగన్నాథం చెప్పిన మాట అతని ఆత్మవిశ్వాసానికి ప్రతీక. నల్లటి మేఘాల వెనుకే ఆశాకిరణం ఉంటుందన్న సందేశాన్ని ఈ కథ బలంగా వినిపించింది.
5. అమానుషత్వం – కారుణ్యం కరువైన లోకం
కథ: అంధుడు (అనువాదం)
రచయిత: గై ది మోపాసా (తెలుగు: కె.ఉషారాణి – ప్రజాశక్తి)
ప్రపంచ ప్రఖ్యాత ఫ్రెంచ్ రచయిత గై ది మోపాసా రాసిన కథకు ఇది తెలుగు అనువాదం. మానవ సమాజంలో దయ, జాలి అనేవి ఎంత మృగ్యమైపోయాయో, ముఖ్యంగా వైకల్యం ఉన్నవారి పట్ల మనుషులు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తారో ఈ కథ అత్యంత భయానకంగా కళ్లకు కట్టింది.
తల్లిదండ్రులు చనిపోయాక ఒక అంధుడు తన అక్క, బావగారి ఇంట్లో పడే నరకం ఇందులో వర్ణించబడింది. అతనికి కాస్తంత గంజి పోసి, కుక్కలు, పిల్లులు ఆ గంజిని నాకేస్తుంటే చూసి పగలబడి నవ్వే మానవ మృగాలు ఇందులో కనిపిస్తాయి. అతనికి మలమూత్రాలు తినిపించి ఆనందించడం, కొట్టి హింసించడం దారుణమైన రాక్షసత్వానికి నిదర్శనాలు.
చివరకు దట్టమైన మంచు కురుస్తున్న చలికాలంలో అతన్ని బయట రోడ్డుమీద వదిలేయడం, అతను మంచులో గడ్డకట్టి చనిపోవడం, కాకులు అతన్ని పీక్కుతినడం.. మనిషిలోని దానవత్వానికి పరాకాష్ట. ఫ్రెంచ్ మూలంలోని ఆర్ద్రతను, భయానకతను అనువాదకురాలు తెలుగులోకి సమర్థవంతంగా తెచ్చారు. సమాజంలో దయ ఎంత కరువైపోయిందో చెప్పడానికి ఇంతకంటే బలమైన కథ ఉండదు. ఒక అద్భుతమైన ప్రపంచ స్థాయి కథను పరిచయం చేయడం అభినందనీయం.
6. మనస్తత్వ చిత్రణ – బాహ్య అలంకరణ
కథ: ఆహార్యం రచయిత: శశికళ (విశాలాంధ్ర)
నవతరం యువత భౌతికమైన అలంకరణల ఆధారంగా మనుషులను ఎలా అంచనా వేస్తారో, ఆ అంచనాలు ఎంత తప్పు అవుతాయో చెప్పే కథ ‘ఆహార్యం’. పదో తరగతి చదువుతున్న అమృత అనే అమ్మాయి, పక్కింటి అరుంధతి ఆంటీ వేసుకునే ఫ్యాన్సీ చీరలు, మేకప్ చూసి ఆమెను లోకువగా భావిస్తుంటుంది. అనుకోకుండా అమృత టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నప్పుడు, ఆమె తల్లిదండ్రులు (జానకి, రఘురాం) నాయనమ్మకు గుండెపోటు రావడంతో ఊరెళ్లాల్సి వస్తుంది. ఆ కష్టకాలంలో అరుంధతి ఆంటీ అమృతను సొంత బిడ్డలా దగ్గరుండి ఆసుపత్రిలో సేవలు చేసి కాపాడుకుంటుంది.
తనను అలంకరణను బట్టి అసహ్యించుకున్న అమ్మాయికే అరుంధతి మాతృప్రేమను పంచడం ఈ కథలోని కీలకాంశం. బాహ్య సౌందర్యం కంటే అంతఃసౌందర్యమే గొప్పదన్న సత్యాన్ని ఒక టీనేజ్ అమ్మాయి కళ్లగుండా రచయిత్రి చక్కగా ఆవిష్కరించారు. వస్తువు చిన్నదైనా, పాత్రల మానసిక పరిణతి సహజంగా, చక్కగా సాగింది.
7. జీవితపు లోతులు – తాత్విక అన్వేషణ
కథ: నీడలు రచయిత: వొద్యారపు స్వప్న (నవతెలంగాణ సోపతి)
జీవితం చిన్నదా లేక పెద్దదా? అనే ఒక తాత్వికమైన ప్రశ్న చుట్టూ తిరిగే కథ ఇది. వనజ, సరళ అనే ఇద్దరు చిన్ననాటి స్నేహితులు (లాయర్లు) కలుసుకుని మాట్లాడుకునే సంభాషణల ద్వారా జీవితపు అసలైన నిర్వచనాన్ని వెతికే ప్రయత్నం చేశారు.
ఐదుగురు కూతుళ్లున్న ఒక తండ్రి, ఆస్తి అంతా రాసిచ్చాక వారు పంచుకుని ఎలా వదిలేశారో అనే కేసును ఉదాహరణగా తీసుకుని, కష్టాల్లో ఉన్నప్పుడు జీవితం చాలా పెద్దదిగా, భరించలేనంత భారంగా తోస్తుందని సరళ వివరిస్తుంది. ఆర్థిక నష్టాలు వచ్చి, బంధువులు సైతం మొహం చాటేసినప్పుడు తన ఒంటరి పోరాటం గురించి సరళ పంచుకుంటుంది. మనుషులు ఆనందంలో ఉన్నప్పుడు కాలం తెలియకుండా గడిచిపోతుందని వనజ గ్రహిస్తుంది. మనసులోని లోతులను ఈ కథ హృద్యంగా ఆవిష్కరించింది.
8. కార్పొరేట్ రాక్షసత్వం – యాంత్రిక బతుకులు
కథ: ఆటవిడుపు రచయిత: రమేశ్ రాచపూటి (వార్త)
ప్రపంచీకరణ పుణ్యమా అని కార్పొరేట్ సంస్థలు మనుషులను ఎలా మరబొమ్మలుగా మారుస్తున్నాయో ఎండగట్టిన సెటైరికల్ కథ ‘ఆటవిడుపు’. ఉత్పాదకత, లాభాలు పెంచాలనే అత్యాశతో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఛైర్మన్ ‘నీలకంఠారావు’, ఆదివారం కూడా పనిదినంగా ప్రకటిస్తాడు.
దాంతో కిరణ్, హరిణి లాంటి ఉద్యోగుల కుటుంబ జీవితం ఛిన్నాభిన్నమవుతుంది. ఆదివారం కూడా ఇంట్లో తల్లిదండ్రులు లేకపోవడంతో పిల్లలు జంక్ ఫుడ్ కు బానిసలవడం, కిరణ్ కొడుకు హేమంత్ కు ఆస్తమా రావడం జరుగుతాయి. తత్ఫలితంగా కంపెనీ ఉత్పాదకత పడిపోవడంతో, వాస్తవం గ్రహించిన ఛైర్మన్ తిరిగి ఆదివారం సెలవు ప్రకటించడం ఈ కథ ముగింపు. జీడీపీ పెరిగినా హ్యాపీనెస్ ఇండెక్స్ 126వ స్థానంలో ఉందన్న వాస్తవాన్ని చక్కగా చెప్పారు.
9. మట్టి పిలుపు – స్వయం సమృద్ధి
కథ: పడమటి సూరీడు రచయిత: ఆర్.వి.సత్యనారాయణ (ప్రజాశక్తి)
పల్లెటూరును వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లిన యువత ఎదుర్కొనే సంక్షోభాన్ని, వ్యవసాయం ప్రాముఖ్యతను చాటిన కథ ఇది. దుబాయ్, కువైట్ లలో యుద్ధం వల్ల ఉద్యోగం కోల్పోయి స్వదేశానికి తిరిగి వస్తాడు కుమార్.
కొడుకు ఉద్యోగం పోయిందనే వార్త విని తండ్రి సుబ్బడు, తల్లి లచ్చిమి ఆందోళన చెందుతారు. కానీ కుమార్ ధైర్యంగా, “నలుగురికి అన్నం పెట్టే వ్యవసాయమే నేను చేస్తాను” అని నిర్ణయించుకుంటాడు. భూసార పరీక్షా కేంద్రానికి వెళ్లి, శాస్త్రీయమైన పద్ధతుల్లో బోరు వేయించి, బంతిపూల సాగు చేసి లక్ష రూపాయలు లాభం గడిస్తాడు. గల్ఫ్ దేశాల వలస కార్మికుల సంక్షోభాన్ని, “తిన్నది కూడు, ఉన్నది ఊరు” అనే నానుడిని రచయిత బాగా అన్వయించారు.
10. డిజిటల్ బానిసత్వం – బంధాలను కాపాడిన అబద్ధం
కథ: అబద్ధం దిద్దిన కాపురం రచయిత: మర్రాపు వసుంధరా దేవి (వార్త)
ఆధునిక మెట్రో నగరాల్లో భార్యాభర్తలు ఎలా ఎక్సెల్ షీట్లలోని అంకెల్లా మారిపోయారో, యాంత్రిక జీవనం వారి మధ్య ఎలా నిశ్శబ్దాన్ని నింపిందో చెప్పే అద్భుతమైన కథ ఇది. కిరణ్, శైలజ అనే సాఫ్ట్ వేర్ దంపతులు ఒకే పైకప్పు కింద ఉన్నా మాట్లాడుకోవడానికి సమయం ఉండదు.
విడిపోవడమే మంచిదేమో అని కిరణ్ రాసిన డైరీ చూసి శైలజ చలించిపోతుంది. వారి వివాహ వార్షికోత్సవం నాడు ప్రకృతి ఒడికి (రిసార్ట్ కు) తీసుకెళ్లి మాట్లాడుకుంటారు. పల్లెటూరిలో వ్యవసాయం చేద్దామని కిరణ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశానని అబద్ధం చెప్తాడు (నిజానికి అతను ఆరు నెలల సబ్బాటికల్ లీవ్ తీసుకుంటాడు). శైలజ కూడా తాను రిజైన్ చేశానని అబద్ధం చెబుతుంది (ఆమె వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకుంటుంది).
ఒకరినొకరు కాపాడుకోవడానికి ఆడిన ఈ ప్రేమపూర్వకమైన అబద్ధం వారి కాపురాన్ని నిలబెడుతుంది. ఆధునిక బంధాలలోని సంక్లిష్టతను ఈ కథ మనోహరంగా ఆవిష్కరించింది. ఓ. హెన్రీ తరహా ట్విస్ట్ కథకు బలం చేకూర్చింది.
11. నైతికత విలువ – నిజాయితీ అంటువ్యాధి
కథ: బండ రచయిత: మల్లాది వెంకటకృష్ణమూర్తి (సాక్షి)
మనిషిలోని నిజాయితీకి, తప్పు చేసినప్పుడు మనసు మీద ఉండే అపరాధ భావానికి ప్రతీకగా నిలిచిన కథ ‘బండ’. బీహార్ కు చెందిన ఒక పేద ఊబర్ ట్యాక్సీ డ్రైవర్, కారులో దొరికిన ఎనిమిది లక్షల రూపాయలు, నగలు ఉన్న ఎయిర్ బ్యాగును తెచ్చి పోలీస్ స్టేషన్లో ఎస్.ఐ కు అప్పగిస్తాడు.
ఐ.పి.సి. కోడ్ పుస్తకంలో కవర్లు (లంచాలు) పెట్టించుకునే ఆ ఎస్.ఐ, మొదట ఆ సొమ్మును కాజేయాలని భావిస్తాడు. కానీ, “ముగ్గురు అమ్మాయిలు, కారు అప్పు ఉన్నా నాలోని రాముడు రావణాసురుడ్ని చంపేశాడు, నెత్తి మీంచి వంద కిలోల బండ దిగిపోయినట్లుంది” అని డ్రైవర్ చెప్పిన మాటలు ఆ ఎస్.ఐ అంతరాత్మను తాకుతాయి. తను తీసుకున్న లంచాలను వెనక్కి ఇచ్చేసి, డ్రైవర్ కు ప్రజల ద్వారా (రేడియో జాకీ ద్వారా) 1,92,173 రూపాయలు విరాళంగా వచ్చేలా చేస్తాడు.
“మంచితనం ఎన్నటికీ వృథా కాదు” అన్న సత్యాన్ని చాటిన కథ ఇది. అయితే, అవినీతి కూపంలో కూరుకుపోయిన ఒక ఎస్.ఐ మనసు, ఒక డ్రైవర్ మాటలతో రాత్రికి రాత్రే పూర్తిగా మారిపోవడం కేవలం కథల్లో, సినిమాల్లోనే సాధ్యం. వాస్తవికత లోపించినా, నైతికతను పెంపొందించే కథగా ఇది విజయం సాధించింది.
ఆధునిక కథా గమనం
తెలుగు కథాసాహిత్యంలో ఇటీవల ఒక ఆసక్తికరమైన ధోరణి కనిపిస్తోంది. యవ్వన ప్రేమలు, కుటుంబ ఘర్షణలు, సామాజిక వైరుధ్యాల తర్వాత ఇప్పుడు రచయితల చూపు ప్రౌఢ వయసులో పుడుతున్న భావోద్వేగ అనుబంధాల మీద పడుతోంది. జీవితంలో సగానికి పైగా ప్రయాణించిన వ్యక్తులు, వివాహబంధాల్లో ఉన్న మనుషులు, బయటకు స్థిరంగా కనిపించే జీవితాల లోపల దాచుకున్న ఖాళీలు … ఇవన్నీ కథల కేంద్రంగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలో ఈవారం ఆంధ్రజ్యోతిలో పాపినేని శివశంకర్ రాసిన “శిశిర వసంతాలు”, గతవారం తెలుగుప్రభలో ప్రసేన్ రాసిన “నాట్ ఎ హేట్ స్టోరీ” కథలు ప్రత్యేకంగా చర్చించదగ్గవి. రెండు కథలూ వివాహేతర ఆకర్షణను ఇతివృత్తంగా తీసుకున్నప్పటికీ, వాటి లక్ష్యం ప్రేమను సమర్థించడం కాదు… ప్రేమ పేరుతో మనిషి తనలో ఎదుర్కొనే నైతిక సంక్షోభాన్ని అర్థం చేసుకోవడం. ఈ రెండు కథలు కలిపి చదివితే ఆధునిక మధ్యతరగతి జీవితంలోని ఒక కొత్త మానసిక భూగోళం మన ముందుకు వస్తుంది.
ఇక ‘కథానిధి’ (23 ఆగస్టు 2026) లోని ఈ పదకొండు కథలూ పన్నెండు సామాజిక పత్రాలు. అటు గ్రామీణ జీవన పోరాటాలను, ప్రకృతి విధ్వంసాన్ని, ఇటు ఆధునిక నగర జీవనపు యాంత్రికతను, దంపతుల మధ్య అదృశ్యమవుతున్న ఆత్మీయతను ఏకకాలంలో దర్పణం పట్టిన ఈ సంకలనం నేటి కథకుల సామాజిక బాధ్యతను, సునిశిత పరిశీలనను తెలియజేస్తోంది.
అయితే, ఆధునిక కథకులు గుర్తుంచుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఉంది. సమాజంలో వస్తున్న సంక్లిష్టమైన మార్పులను చిత్రించేటప్పుడు, రచయితలు సరళమైన, ఆదర్శవాద పరిష్కారాలను ఇవ్వడం మానుకోవాలి. కథ అనేది ఒక జీవితాన్ని పాఠకుడి ముందు పరచి, వాళ్లనే ఒక నిర్ణయానికి రానివ్వాలి. రచయితలు సందేశం ఇవ్వాలనే తొందరలో వాస్తవికతను దెబ్బతీయకూడదు.
ఏది ఏమైనప్పటికీ, మన చుట్టూ జరుగుతున్న కల్లోల జీవితాన్ని ఇంత నిశితంగా పరిశీలించి, అక్షరబద్ధం చేసిన ఈ రచయితలందరూ అభినందనీయులు. మునిసురేష్ పిళ్లె గారి సమర్పణలో వెలువడుతున్న ఇలాంటి కథా సంకలనాలు తెలుగు కథా భవిష్యత్తుకు భరోసానిస్తున్నాయి. ఈ వారపు సంకలనానికి పాపినేని శివశంకర్ వారి ‘శిశిర వసంతాలు’, వాడ్రేవు చినవీరభద్రుడు వారి ‘ఫ్యూచర్ సిటీ’ కథలు మకుటాయమానంగా నిలిచాయి. తెలుగు కథ ఇలాగే నిరంతరం సామాన్యుడి అస్తిత్వ ఘోషను వినిపిస్తూనే ఉండాలని ఆశిద్దాం.
*****************
.