“రచయితలు ఎప్పుడూ సమాజ హితాన్ని కోరుకోవాలని, సమాజ శ్రేయస్సు కోసమే రచనలు రావాలని” అభ్యుదయ రచయితల సంఘం (అరసం) నేత, విశ్రాంత ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ సుశీలమ్మ అన్నారు. అరసం 20వ రాష్ట్ర మహాసభల్లో భాగంగా చివరి రోజైన ఆదివారం జరిగిన ‘అభ్యుదయ సాహిత్యంలో మహిళ’ అనే సదస్సులో ఆమె ప్రధాన వక్తగా మాట్లాడారు. తెలుగు సాహిత్యంలో మొదటి కథా రచయిత ఎవరనే అంశంపై జరుగుతున్న చర్చను ప్రస్తావిస్తూ… స్వాతంత్ర్యోద్యమానికి మునుపే 1902లోనే రచనలు చేసిన బండారు అచ్చమాంబనే తెలుగు సాహిత్యంలో తొలి కథా రచయిత్రి అని ఆమె బలంగా ప్రతిపాదించారు. నేడు కొందరు సాహిత్యంలోకి చెడును చొప్పిస్తుండడం బాధాకరమని, ఆధునిక కథల్లో మార్పు వచ్చి అవి సమాజానికి ఉపయోగపడేలా ఉండాలని సుశీలమ్మ ఆకాంక్షించారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీలతో పాటు పిల్లలు కూడా బాధితులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రచనల రంగంలో మహిళలను మరింత ప్రోత్సహించాలని, స్త్రీలు తమ భావాలను స్వేచ్ఛగా ప్రకటించుకునే అవకాశం కల్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
మహిళలదే కీలక పాత్ర: కుసుమ కుమారి
ఈ సదస్సుకు అధ్యక్షత వహించిన విశ్రాంత వైస్ ఛాన్సలర్ కుసుమ కుమారి మాట్లాడుతూ… అభ్యుదయ సాహిత్యంలో మహిళలదే కీలక పాత్రని, ఈ సాహిత్యం మహిళా సాధికారతకు బలమైన బాటలు పరిచిందని కొనియాడారు. సమాజంలో స్త్రీని ఒక భోగవస్తువుగా కాకుండా ఒక స్వతంత్ర వ్యక్తిగా, ఒక మానవిగా చూడాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
మహిళాభ్యుదయమే దేశాభ్యుదయం: జస్టిస్ లక్ష్మి
విశ్రాంత న్యాయమూర్తి అడబాల లక్ష్మి మాట్లాడుతూ… మహిళాభ్యుదయమే దేశాభ్యుదయమని పేర్కొన్నారు. సాహిత్యంలో ఇప్పటికీ మహిళలను తక్కువ చేసి చూస్తున్నారని, అయితే రచనలు చేయడంలో స్త్రీలు ఎవరికీ తక్కువ కాదని అన్నారు. మహిళల సమస్యలపై, వారి అంతరంగంపై రచనలు చేయాలంటే మహిళలకే పూర్తి అవగాహన ఉంటుందని… స్త్రీల మనసును, వారి బాధలను స్త్రీలే బాగా అర్థం చేసుకోగలరని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ సదస్సులో పలువురు మహిళా రచయిత్రులు, ప్రతినిధులు పాల్గొన్నారు.
.
Discussion about this post