భారతదేశంలో ప్రస్తుతం 60 ఏళ్లు నిండిన వారికి వేయడానికి సిద్ధం చేసిన రెండు స్వదేశీ వేక్సిన్లు కూడా ఎంతో సురక్షితమైనవని.. కేంద్రం ప్రకటించింది. ఈ విషయంలో ఎలాంటి అపోహలు, భయాలు లేకుండా ఆ వయస్సుగల వారందరూ వేక్సిన్ లు వేయించుకుని.. కరోనా నుంచి సురక్షిత భారత్ ఆవిష్కరించడానికి కృషి చేయాలని కేంద్రమంత్రి హర్షవర్దన్ పిలుపు ఇచ్చారు.
60 ఏళ్లు పైబడినవారికి టీకాలు వేయడం ప్రారంభించిన తర్వాత.. ప్రధాని మోడీ మొదటి స్థానంలో ఉండి కరోనా టీకా తీసుకున్నారని, తద్వారా దేశ ప్రజలకు వేక్సిన్ విషయంలో అపోహలు తొలగేలా ధైర్యం చెప్పినట్లు అయిందని హర్షవర్దన్ అన్నారు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్న ప్రధాని మోడీకి కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కృతజ్ఞతలు తెలిపారు.
మనం ఎదుటివారికి ఉదాహరణగా ఉండాలని ఎప్పుడు మోడీ చెప్తుంటారని, ఇప్పుడు అదే నిరూపించారని అన్నారు. రోగనిరోధక శక్తికి సంబంధించి దేశం లో ఉన్న రెండు టీకాలు సురక్షితమైనవి, పరిపూర్ణమైనవని నేను మొదటి నుండి చెబుతున్నానని ఆయన అన్నారు.
కోవాక్సిన్ శాస్త్రీయత అంశాలు పరిపూర్ణంగా ఉన్నప్పటికీ, చాలా తప్పుడు సమాచారం వ్యాపించిందని.. కరోనా వ్యాక్సిన్ తీసుకుని ప్రధాని దేశానికి స్పష్టమైన సందేశం ఇచ్చారని అన్నారు.
తాను ఈ రోజు బుకింగ్ చేసుకుని రేపు టీకాలు వేసుకుంటానని మంత్రి ప్రకటించారు. 60 ఏళ్లు పైబడిన పౌరులు, 45 ఏళ్లు పైబడిన వారు, ఎంపీలు-ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు టీకాలు వేసుకోవాలని ప్రజల్లో ధైర్యం నింపాలని అన్నారు. ఇలా చేయడం వల్ల ప్రజలకు టీకాలు వేయించుకోవాలనే సందేశం వెళుతుందన్నారు.
వ్యాక్సినేషన్ వల్ల వాపు లేదా జ్వరం వంటి దుష్ప్రభావాలు తక్కువగా ఉంటాయన్నారు. సాధారణంగా కొన్నిసందర్భాల్లో ఎలాంటి టీకా వేయించుకున్నా కూడా ఇలా జరుగుతుందని అన్నారు. టీకా కారణంగా ఆసుపత్రిలో చేరడం 0.0004 శాతం మాత్రమే ఉందని ఇలాంటి వాటిని చూసి ఆందోళన అక్కర్లేదని అన్నారు. కరోనా టీకాలు వేయడం వల్ల మరణాలు చోటుచేసుకోలేదని.. ప్రజలందరూ కూడా నిర్భయంగా టీకాలు వేయించుకోవాలని పిలుపు ఇచ్చారు. టీకాలు వేసిన 4 రోజులు లేదా 10 రోజుల తర్వాత ఎవరైనా మరణిస్తే, మీరు దానిని టీకా కారణంగా సంభవించిన మరణంగా భావించవద్దని కూడా చెప్పారు. ఇప్పటిదాకా అలాంటి దుర్ఘటనల్లో ప్రతి మరణం శాస్త్రీయంగా పరిశోధించబడిందన్నారు. ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ దీనిని అంచనా వేస్తుందన్నారు. వ్యాక్సిన్ కారణంగా మరణాలు నమోదు కాలేదు.
కరోనా కేసుల పెరుగుదలకు ఎటువంటి మ్యుటేషన్‌కు సంబంధం లేదని శాస్త్రవేత్తలు , ఐసిఎంఆర్ నిర్ధారించినట్లు కేంద్రమంత్రి హర్షవర్దన్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న రాష్ట్రాలకు ప్రభుత్వం నిపుణుల బృందాన్ని పంపిందని, కేంద్ర కేబినెట్ కార్యదర్శి, ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు అధికారులతో మాట్లాడారని, కరోనా కేసుల విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతోందని అన్నారు.
వ్యాక్సినేషన్‌లో రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత సడలింపు ఇచ్చామన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో వాక్ ఇన్ వ్యవస్థ క్రమబద్ధీకరించబడుతుందన్నారు. బుకింగ్ ద్వారా అపాయింట్‌మెంట్ తీసుకున్న తర్వాత నిర్దిష్ట సంఖ్యలో ప్రజలు ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వ్యాక్సిన్ తీసుకోవచ్చన్నారు. కోవిన్ అప్లికేషన్ లో ఎటువంటి సమస్య లేదని, వ్యాక్సినేషన్ వ్యవస్థలన్నీ ఒక వారంలో క్రమబద్ధీకరిస్తామని కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ అన్నారు.
.

Discussion about this post