రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వంతో తనకు వ్యక్తిగత వైరం ఉన్నట్లుగా, కక్ష సాధిస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు చాలా ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. ఆయన తీసుకున్న ఒక తాజా నిర్ణయం కూడా అదే తరహాలో వివాదాస్పదం అయింది. ఆయనది ఓవరాక్షన్ అని.. చాలా మంది అనుకున్నారు. చివరికి ఆ ఆలోచనను విరమించుకుని ఆయన వెనక్కు తగ్గాల్సి వచ్చింది.
పంచాయతీ ఎన్నికల సమయంలోనే బహుశా నిమ్మగడ్డకు ఇలాంటి ఆలోచన వచ్చి ఉంటుంది గానీ.. ఆయన సైలెంట్ గా ఉండిపోయారు. అవి పార్టీ రహిత ఎన్నికలు గనుక.. ఈ అస్త్రం బయటకు తీస్తే.. తనకే నష్టం అని అనుకుని ఉండొచ్చు. మునిసిపల్ ఎన్నికల పర్వం మొదలు కాగానే.. అస్త్రం బయటకు తీశారు. ఇవి పార్టీ గుర్తుల మీదే జరుగుతున్న ఎన్నికలు గనుక.. తన వాదనకు విలువ ఉంటుందని.. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినట్టు అవుతుందని ఆయన అనుకుని ఉండొచ్చు.
ఇంతకు విషయం ఏంటంటే.. మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో.. రాష్ట్రవ్యాప్తంగా పౌరులకు రేషన్ సరఫరా చేస్తున్న వాహనాలకు ఉన్న రంగులను మార్చాలని ఈసీ ఒక ఫత్వా జారీచేసేశారు. రేషన్ వెహికిల్స్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని పోలిన రంగులు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఆ రంగులు మార్చేయాల్సిందేనని ఆయన ఆదేశాలు ఇచ్చారు. గతంలో పంచాయతీ కార్యాలయాలకు వేసిన రంగుల విషయంలో కొందరు కోర్టుకు వెళ్లడం.. రంగులు మార్చాల్సిందిగా ఆదేశాలు రావడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ నేపథ్యంలో ఈసీ ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చారు.
కొన్ని వారాల్లోగా ముగిసిపోయే ఎన్నికలకోసం రాష్ట్రమంతా వాహనాల రంగులు మార్చాలంటున్న ఈసీ నిర్ణయంపై ప్రభుత్వం భగ్గుమంది. దీనికి తలాడిస్తే.. ఇలాంటి ఉత్తర్వులు మరిన్ని రావచ్చునని కూడా వారు అనుకుని ఉండొచ్చు. మొత్తానికి ఇది తగదంటూ ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. తన వాదనకు న్యాయస్థానం ఎదుట మద్దతు దక్కదనుకున్నారో ఏమో గానీ.. కోర్టులో ఈ పిటిషన్ కు వచ్చేలోగానే.. నిమ్మగడ్డ తన ఆదేశాలను వెనక్కు తీసుకున్నారు.
రేషన్ వాహనాల రంగులు మార్చాలనే ఆదేశాలను ఉపసంహరించుకున్నారు. ఒక రకంగా.. కోర్టులో వాదనలు కూడా జరగకుండానే.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాధించిన విజయం ఇది. ఆదేశాలు ఇచ్చిన ఈసీ నిమ్మగడ్డే వాటిని వెనక్కు తీసుకోవడంతో.. కోర్టు కూడా పిటిషన్ ను డిస్పోజ్ చేసింది. ఆయన ఓవరాక్షన్‌కు తగినట్టే అయిందని వైఎస్సార్ సీపీ అభిమానులు అనుకుంటున్నారు.
.

Discussion about this post