విజయవాడలో నిర్మించతలపెట్టిన పోలీసు కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న ప్రభుత్వం.. దానిని విశాఖలో ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు విజయవాడ కమాండ్ కంట్రోల్ రూముకు కేటాయించిన రూ. 13.80 కోట్లను విశాఖలో ఏర్పాటు చేసే కమాండ్ కంట్రోల్ రూమ్ నిర్మాణానికి బదలాయించాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఇప్పటికే వైజాగ్‌ను పరిపాలన రాజధానిగా సీఎం జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఈ వ్యవహారానికి సంబంధించి.. అనేక కేసులు కోర్టులో పెండింగులో ఉండడంతో.. ఇంకా ప్రభుత్వ నిర్వహణను బదలాయించడం వీలుపడడం లేదు. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పాటు చేయబోయే కమాండ్ కంట్రోల్ కార్యాలయాన్ని విశాఖలోనే పెట్టడం అనేది ప్రభుత్వపు వ్యూహాత్మక ఎత్తుగడగా కనిపిస్తోంది. కార్యాలయాలను అమరావతినుంచి బదలాయిస్తే.. కోర్టు ఉత్తర్వులు అడ్డుకోవచ్చు గానీ.. కొత్త కార్యాలయం ఏర్పాటుకు ఇబ్బంది ఉండదు గనుక.. ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా కనిపిస్తోంది.
పైగా ప్రస్తుతం విశాఖపట్టణం కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో విశాఖలో కొత్త కార్యాలయాల ఏర్పాటుకు పూనుకోవడం అక్కడి ప్రజల్లో ప్రభుత్వం పట్ల కాస్త నమ్మకాన్ని కూడా పెంచుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తోస్తోంది.
.

Discussion about this post