విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రస్తుత హోదాలోనే ఉంటుందా? లేదా, ప్రెవేటుపరం అయిపోతుందా అనేది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయం! ఇందులో తెలంగాణ రాష్ట్రానికి గానీ. తెరాసకు గానీ ఏమాత్రం సంబంధం లేదు. కానీ.. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో విశాఖ ఉక్కు కోసం జరుగుతున్న పోరాటానికి కేసీఆర్ మద్దతిచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇందుకు అనేక కారణాలున్నాయి… అందులో ప్రధానంగా కొన్ని కనిపిస్తున్నాయి.
1. కేసీఆర్ చూస్తూ ఉండే రకం కాదు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పొరుగు రాష్ట్రమైన ఏపీ వ్యవహారాల పట్ల సహజంగా ఆసక్తిగానే ఉంటారు. ఒక వాదన ప్రకారం.. కేసీఆర్ పూర్వీకుల మూలాలు ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినవే అని కూడా కొందరు అంటూ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో ఆయనకు మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్‌తో కూడా ఆయనకు మంచి సంబంధాలు ఉన్నాయి. అలాగే విశాఖలో ఉండే పీఠాధిపతి స్వరూపానందకు స్వయంగా కేసీఆర్ చాలా సన్నిహితుడైన గురువు. ఆయన మాటను ప్రమాణంగా భావిస్తారు. ఆ రకంగా ఆయనకు విశాఖతో సన్నిహిత సంబంధం ఉంది. కేసీఆర్ విశాఖ వెళితే.. ఆయనను స్వాగతిస్తూ.. ఏ ఏపీ ముఖ్యమంత్రినో తొలిసారి ఆహ్వానిస్తున్న రీతిలో భారీ స్థాయిలో ఫ్లెక్సిలు వెలిశాయంటే ఆయన ఆదరణ అర్థం చేసుకోవచ్చు.
అలా ఆయనను ఆదరించిన విశాఖ ప్రజలు ఇప్పుడు ఉక్కు పరిశ్రమకోసం పోరాడుతున్నారు. వారికి దన్నుగా నిలవడం తన బాధ్యత కూడా అని కేసీఆర్ భావించే అవకాశం ఉంది. సాధారణంగా ఆయన హుదుద్ తుపాను వంటి విశాఖను అతలాకుతలం చేసిన ప్రకృతి విపత్తుల సమయంలో ఆ రాష్ట్రం కోసం చాలా సాయం అందించారు. ఇప్పుడు కూడా ఆయన విశాఖ ఉక్కుకోసం పోరాడుతున్న వారికి నైతికంగా మద్దతు ప్రకటించే అవకాశం ఉందనే వాదన వినిపిస్తోంది.
Read also this :
రామోజీరావు పత్రికా సామ్రాజ్యంలో నాలుగు పత్రికలు మూసివేత
2. పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు
తెలంగాణలో ప్రస్తుతం రెండు స్థానాల్లో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ లోగానీ, అటు ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో గానీ.. ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ఓటర్లు కూడా గణనీయంగానే ఉన్నారు. ఇలాంటి సమయంలో.. ఏపీ మొత్తం అట్టుడుకుతున్న ప్రజా పోరాటం పట్ల నిర్లిప్తంగా ఉండడం కంటె, దానికి మద్దతు ప్రకటిస్తే.. కేసీఆర్ పట్ల ఏపీకి చెందిన ఇక్కడి పట్టభద్ర ఓటర్లలో ఒక గౌరవం ఏర్పడుతుంది. అది అంతిమంగా ఎన్నికల్లో లాభిస్తుందనే ఆలోచన కూడా ఉంది.
3. జాతీయస్థాయి నాయకుడిగా ఎదగడం
కేసీఆర్ రేపో మాపో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తును ఆయన కొన్నేళ్ల కిందటే ప్రారంభించారు. దేశంలో అనేక భాజపాయేతర కీలక పార్టీలను ఒక గొడుగు కిందికి తీసుకురావడానికి ఆయన బాగా ప్రయత్నించారు. ఇప్పటికీ ఆ ప్రయత్నం ఆగిపోలేదు.. కొనసాగుతూనే ఉంది.
అలాంటిది.. దేశ్ కీ నేతల్లో ఒకరిగా ఎదగాలనుకున్న వ్యక్తి… పొరుగురాష్ట్రంలో గట్టిగా జరుగుతున్న ప్రజా ఉద్యమాన్ని ఉపేక్షించడం హితవు అనిపించుకోదు. అంటే… తాను దేశ ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకునే నాయకుడిని అని నిరూపించుకోవడానికి ఆయన ఏపీ వ్యవహారంలో వేలు పెట్టే అవకాశం ఉంది.
4. జగ్గారెడ్డి ఎపిసోడ్
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగ్గారెడ్డి.. విశాఖ వెళ్లి ఉక్కు పరిశ్రమ కోసం ఆందోళన వ్యక్తం చేస్తున్న వారిని కలవబోతున్నారు.. వారికి నైతిక మద్దతు ప్రకటించారు. ఈనెల15న విశాఖ వెళుతున్నారు. అంటే.. తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు వెళ్లి మద్దతు చెబుతున్నారు గానీ.. తెరాస నేతలు స్పందించట్లేదనే మాట వస్తే అది రాజకీయంగా కొంత డేమేజీ అవుతుంది. విశాఖ ఉక్కు పరిశ్రమ ఎలా ఉన్నా సరే.. దానివల్ల తెలంగాణకు జరిగే మంచిచెడులు ప్రత్యేకంగా ఏం లేవు గనుక.. తాను కూడా పోరాటానికి మద్దతు ప్రకటించాలనే గులాబీ దళపతి అనుకుంటున్నట్లు సమాచారం.
5. బీజేపీ పై నిందలకు మరో ఛాన్స్!
తెలంగాణలో ప్రధానంగా బీజేపీతోనే కేసీఆర్ సమస్య ఎదుర్కొంటున్నారు. విశాఖ ఉక్కు పోరాటానికి మద్దతుగా నిలిస్తే.. బీజేపీపై బురద చల్లడానికి మరొక మంచి అవకాశం దొరికినట్లు అవుతుందనే వ్యూహం కూడా ఉంది. అక్కడ పోరాటానికి దన్నుగా నిలవడం ద్వారా.. రాష్ట్రాలను బీజేపీ కేంద్ర సర్కారు తొక్కేస్తున్నదని, ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్నదని.. ఇలాంటి దుర్మార్గపు పార్టీని మట్టుపెట్టడానికి తెలంగాణ ప్రజలు జాగరూకతతో వ్యవహరించాలని ప్రచారం చేసే అవకాశం దొరుకుతుంది.
ఇలాంటి కారణాల రీత్యా.. విశాఖ ఉక్కు పోరాటానికి కొన్నిరోజుల్లోగా కేసీఆర్ మద్దతు ప్రకటించే అవకాశం ఉన్నదని పలువురు అంచనా వేస్తున్నారు.
.

Discussion about this post