ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్రానికి మూడు రాజధానుల ప్రతిపాదనను అమల్లోకి తీసుకురావడానికి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. న్యాయపరంగా కోర్టులో ఉండడం వల్ల ఇంకా కార్యరూపం దాల్చడం లేదు. అయితే.. తన నిర్ణయానికి కేంద్రం ఆశీస్సులు తీసుకోడానికి కూడా ఆయన ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో.. హైకోర్టు ఎక్కడ ఉండాలనే విషయంలో, కర్నూలుకు తరలించడం అనే విషయంలో తమకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రప్రభుత్వం తేల్చి చెప్పేసింది. ఈ విషయంలో కేంద్రం చేతులు దులిపేసుకున్నట్టుగా కనిపిస్తోంది. రాష్ట్రప్రభుత్వం, హైకోర్టు కలిసి మాత్రమే ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలరని కూడా పేర్కొంది. ఎం సాంబశివరావు అనే వ్యక్తి ఆర్టీఐ ద్వారా చేసిన దరఖాస్తు కారణంగా ఈ విషయం వెలుగులోకి రావడం విశేషం.
పరిపాలన వికేంద్రీకరణలో భాగంగా.. రాయలసీమ- కర్నూలులో న్యాయరాజధాని ఏర్పాటుచేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే దీనికి సంబంధించిన తుది నిర్ణయం రావడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి అవసరం, సుప్రీం కోర్టు ఆమోదం అవసరం అని రకరకాలుగా ప్రచారం జరుగుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఎం సాంబశివరావు.. సమాచార హక్కు చట్టం ద్వారా.. కేంద్ర న్యాయశాఖను దీని గురించి ప్రశ్నించారు.
హైకోర్టు తరలింపు వ్యవహారంతో తమకు సంబంధం లేదని కేంద్ర న్యాయశాఖ తేల్చేసింది. హైకోర్టు నిర్వహణ వ్యయాన్ని భరించేది ప్రభుత్వం కాగా, రోజువారీ పరిపాలన వ్యవహారాలన్నింటికీ ప్రధాన న్యాయమూర్తి బాధ్యత వహిస్తారు గనుక.. ఆ ఇద్దరూ కలిసి ఈ విషయంలో నిర్ణయం తీసుకోగలరే తప్ప.. కేంద్రానికి సంబంధం లేదని తెలిపింది.
జగన్ కు లైన్ క్లియరేనా?
ప్రస్తుతం మూడు రాజధానుల వ్యవహారం హైకోర్టులో విచారణలో ఉంది. మూడు రాజధానుల విషయం ఎలా ఉన్నప్పటికీ.. హైకోర్టును కర్నూలుకు తరలించడం అనేది మరీ అంత శ్రమతో కూడుకున్న విషయం కాదని అర్థమవుతోంది. మూడు రాజధానుల విచారణ ముగిసిన తర్వాతనైనా.. ప్రతికూలంగా కోర్టు తీర్పు వచ్చినా.. అవసరమైతే.. హైకోర్టును మాత్రం మార్చడానికి మూడురాజదానుల వంటి ప్రకటన చేయాల్సిన అవసరమే లేదు. హైకోర్టు సీజేతో చర్చించి.. సీఎం నిర్ణయం తీసేసుకోడానికి ఆస్కారం ఉంటుంది. మరి ఈ వ్యవహారంలో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయో వేచిచూడాలి.
.

Discussion about this post