అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు తిరుమలేశుడి దర్శనం సామాన్య భక్తులకు కూడా తిరిగి అందుబాటులోకి రానుంది. కోవిడ్ అనంతర పరిణామాలలో.. పూర్తిస్థాయిలో సామాన్య భక్తులకు సర్వదర్శనం అందుబాటులోకి రావడం ఇదే ప్రథమం. సంఖ్యాపరంగా పరిమితంగానే అయినప్పటికీ.. తిరుమలేశుని దర్శనం మళ్లీ అందరికీ అందరికీ, ఆంక్షలు లేకుండా అందుబాటులోకి రావడం పట్ల భక్తుల్లో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
కొవిడ్ సమయంలో తిరుమలేశుని ఆలయాన్ని నెలల తరబడి మూసివేశారు. తిరిగి తెరిచిన తర్వాత.. సుపథం ద్వారా మాత్రమే భక్తుల్ని అది కూడా పరిమిత సంఖ్యలోనే అనుమతిస్తున్నారు. ఆన్ లైన్ ద్వారా సుపథం టికెట్లను విడుదల చేయడం జరుగుతోంది. ఆర్జిత సేవలకు అనుమతించే భక్తుల సంఖ్యను బాగా తగ్గించారు. ఇన్నాళ్లుగా సర్వదర్శనం పూర్తిగా ఆగిపోయింది.
అయితే కొన్ని వారాల నుంచి.. తిరుమలేశుని ఆలయానికి సర్వదర్శనం పునరుద్ధరించారు. అనేక జాగ్రత్తల మధ్య భక్తులను అనుమతిస్తున్నారు. కొవిడ్ ప్రమాదం ఇంకా సమసిపోని నేపథ్యంలో.. ప్రయోగాత్మకంగా ప్రస్తుతానికి రోజుకు రెండువేల మంది చిత్తూరు జిల్లా వాసులకు మాత్రమే సర్వదర్శనం టోకెన్లు ఇస్తున్నారు. ఉదయం పూట టోకెన్లు విడుదల చేసి.. అవి పొందిన వారిని మాత్రమే దర్శనానికి పంపుతున్నారు. ఆ రెండు వేల టోకెన్లు కూడా విడుదల కాగానే.. గంటకెల్లా పూర్తయిపోతున్నాయి. ఇదంతా సజావుగానే సాగుతున్న నేపథ్యంలో.. ఇతర ప్రాంతాలకు చెందిన భక్తులను కూడా సర్వదర్శనానికి అనుమతించేలా తాజాగా టీటీడీ నిర్ణయం తీసుకున్నట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు.
వారం రోజుల్లో శ్రీవారి భక్తులందరికీ ఆన్ లైన్ సర్వదర్శనం ఏర్పాటు అవుతుందని ఆయన వెల్లడించారు. సుపథం దర్శనానికి ఎన్ని టికెట్లు మంజూరు చేస్తున్నారో.. అంతకు రెట్టింపుగా సర్వదర్శనం టోకెన్స్ విడుదల చేస్తామని అన్నారు. టోకెన్ల ఏర్పాటు పనులు చకచకా జరుగుతున్నాయన్నారు. భక్తులు ఇబ్బంది పడకుండా ఆన్ లైన్ ద్వారా మాత్రమే సర్వదర్సనం టోకెన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
.

Discussion about this post