తెలివైన వాడితో స్నేహం చేయాలని అందరూ అనుకుంటారు. అలాగే, తాము స్నేహం చేసేవాడు మంచివాడై ఉండాలని కూడా ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అంతే తప్ప.. చెడ్డ వాడితో స్నేహం చేయాలని తెలిసీ తెలిసీ ఎవ్వరైనా అనుకుంటారా? అద్భుతమైన తెలివితేటలుంటే.. చెడ్డతనం పక్కన పెట్టి స్నేహం చేద్దామని ఉత్సాహపడతారా?
కానీ తెలివితేటలు అపారంగా ఉండి, తిరుగులేని స్థాయిలో ఉండి.. ఆ తెలివితేటలకు మనం అబ్బురపడిపోతూ ఉండేట్లయితే.. అలాంటి వాడితో ఖచ్చితంగా స్నేహం చేయాలని మనం అనుకుంటాం. ఇక్కడ తెలివితేటలు అంటే కేవలం తెలివి మాత్రమే కాదు. ఒక రంగంలో ప్రతిభాపాటవాలు, నైపుణ్యాలు, కళా కౌశలం.. ఏవైనా కావొచ్చు.. అలాంటి మేథోసంపద అపరిమితంగా ఉన్న వాడితో స్నేహం చేయాలనే కుతూహలం ప్రతిఒక్కరికీ ఉంటుంది. కానీ ఆ తెలివైనవాడు, మేధావి, నైపుణ్యాలు ఉన్నవాడు చెడ్డ వాడు అయితే స్నేహం చేయొచ్చా?
సాధారణంగా వ్యక్తులతో మనం పెంపొందించుకునే బంధాలు, అనుబంధాలు మన అంతరంగంలోని ఇష్టాల మీద ఆధారపడి ఉంటాయి. మనకు నచ్చిన లక్షణాలు, మన అభిరుచులకు దగ్గరగా ఉండే లక్షణాలు ఎవరిలోనైనా ఎక్కువగా కనిపిస్తే వారిని మనం ఇష్టపడతాం. మన మనసులో ఉండే అభిరుచులు, ఇష్టాలు, మనం గౌరవించే ప్రతిభలు ఎవరిలోనైనా మూర్తీభవించి కనిపిస్తే వారిని ఎంతగానో ఇష్టపడతాం.
మనం ఇష్టపడడం అంటే.. ఇంచుమించుగా అవతలి వారి మాయలో పడడమే! ఆ తర్వాత.. అనుబంధం పెంచుకోవాలని, స్నేహం చేయాలని ఆరాటపడతాం. అనుబంధం ఏర్పడితే గర్విస్తాం, సంతోషిస్తాం. అయితే వారి పట్ల ఇష్టం తాలూకు సమ్మోహకత్వంలో వారిలో లోపాలు ఉన్నప్పటికీ మరచిపోతాం. వారిలో చెడ్డతనం ఉన్నప్పటికీ, దానిని చూసీచూడనట్టు వదిలేస్తాం. అంధత్వం ప్రదర్శిస్తాం. అనుబంధాన్ని ఏర్పరచుకుంటాం.
కానీ ఇలాంటి అభిప్రాయం తప్పు. ఒక వ్యక్తి చెడ్డవాడు అయితే.. అతనిలోని ప్రతిభాపాటవాలకు అన్నింటికీ గ్రహణం పట్టినట్టే. మీ దృష్టిలో ‘చెడ్డతనం’ అనే పదానికి ఎలాంటి నిర్వచనం ఉంటే.. అదే చెడ్డతనం అనుకుందాం. ‘ఆ చెడ్డతనం ఉన్నవాడైనా సరే.. నాతో అలా ప్రవర్తించడం లేదు గనుక, గొప్ప ప్రతిభ గల వాడు గనుక.. అతడితో స్నేహం చేద్దాం’ అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే.
మామూలు సందర్భాల్లో అతడి ప్రతిభ, తెలివితేటలు మిమ్మల్ని పుష్కలంగానే అలరిస్తాయి. కానీ, అతనిలోని చెడ్డతనం పడగవిప్పినప్పుడు తొలి బలిపశువు మీరే అవుతారు.
ఉదాహరణకు రేఖ అనే అమ్మాయికి చిత్ర కళ, చిత్రకారులు అంటే ప్రాణం అనుకుందాం. మోహనరావు అద్భుతమైన చిత్రకారుడు. అతడిని అభిమానించింది. ఒక మోస్తరు చిత్రకారులు ఎంతో మంది ఆమెకు పరిచయమే గానీ.. వారికంటె మోహనరావు గొప్ప కళాకారుడు. అందుకంటే అతనంటే ఆమెకు ఎక్కువ ఇష్టం. కానీ వ్యసనపరుడు. తాగుబోతు. తాగుబోతు అయితే ఏంటి.. ఎక్కడపడితే అక్కడ తాగి పడిపోతుంటాడు. అతడితో ఆర్ట్ లో ఎవ్వరూ సమానం కాదు అని రేఖ అతడితో స్నేహం చేసింది.
చిత్రకళ అంటే ఉండే ఆమె అభిమానానికి తగ్గట్టుగా అతడు బొమ్మలు అద్భుతంగానే గీసేవాడు. కానీ.. స్నేహం చేసినందుకు ఆమెకు కష్టాలు మొదలయ్యాయి. ఎప్పుడు ఎక్కడ తాగిపడిపోతాడో తెలియదు. ఆమె వెళ్లి అతడిని ఇంటికి చేర్చాలి. బాగా తాగినప్పుడు ఫోన్ చేసి గంటలు గంటలు వదరుతూ ఉంటాడు. అదంతా భరించాలి. ఇవి మాత్రమే కాదు. ఒక తాగుబోతు వలన ఎన్ని రకాల ఇబ్బందులు ఉంటాయో.. అవన్నీ ఆమెకు తప్పేవి కాదు. అతడి తాగుబోతు తనాన్ని భరించడం ఆమె దైనందిన వ్యవహారం అయింది. వ్యక్తిగత జీవితం బాగా దెబ్బతింది.
ఈ రకంగా.. చెడ్డతనం అనేది ప్రతిభను, నైపుణ్యాల్ని, తెలివితేటల్ని కమ్మేస్తుంది. వాటిని ఆరాధించవచ్చు.. కానీ చెడ్డతనాన్ని విస్మరించి.. స్నేహం చేయాలని చూస్తే మాత్రం ఇబ్బంది వస్తుంది.
ప్రేమ విషయంలో కూడా
ప్రేమ విషయంలో కూడా ఇదే తరహా మీమాంసతో చాలా మంది మోసపోతూ ఉంటారు. ఒకడిలో ఉండే అద్భుతమైన లక్షణాల్ని చూసి ఇష్టపడతారు. ఆ ఇష్టంలో.. వాడిలో చెడ్డతనం తమకు తెలిసివచ్చినా కూడా దానిని విస్మరిస్తారు. వాడిలో ఉండే అద్భుతలక్షణాల ముందు యిదెంత? అని తీసికట్టుగా చూస్తారు. వాడిలోని చెడ్డతనంతో నాకేంటి సంబంధం అనుకుంటారు. అలాంటి వారు ప్రేమికులుగా ఉండే దశలోనే గానీ.. ఆ ప్రేమ పరిణతి చెంది కలిసి జీవించే రూపంలోకి గానీ, వైవాహిక బంధంలోకి గానీ ప్రవేశించిన తర్వాత గానీ.. ఖచ్చితంగా ఇబ్బందులు అనుభవిస్తూనే ఉంటారు. పశ్చాత్తాపపడుతూ ఉంటారు.
చిన్న క్లారిటీ ఉండాలి..
చెడ్డతనానికి లోపానికి/ బలహీనతలకు మధ్య చిన్న తేడా ఉంది. చెడ్డతనం వేరు- లోపం/బలహీనత వేరు. స్నేహితుల్లో బలహీనతను కూడా అర్థం చేసుకోకపోతే.. అది స్నేహమే కాదు. అంటే మిత్రుల్లో బలహీనతల్ని కూడా మనం భరించాలి. ఆ బలహీనత ముదిరి చెడ్డతనంగా రూపుదాలిస్తే గనుక మనం దూరం పెట్టాలి. ఎవాయిడ్ చేయాలి. అత్యుత్తమమైన ప్రతిభ లేకపోయినా, సాధారణ నైపుణ్యాలే ఉన్నప్పటికీ మంచివాడిని ఆదరించడం, మంచివాడితో స్నేహం చేయడం శ్రేయస్కరం.
మరి ఏది లోపం/బలహీనత? ఏది చెడ్డతనం? ఈ స్పష్టత ఉండడం ఎలాగ? ఈ విషయం ఏ ఒక్కరూ స్పష్టంగా నిర్వచించేది కాదు. ఎవరికి వారు మన మన అనుభవాలను బట్టి వ్యక్తుల్లోని ప్రతికూల/నెగటివ్ లక్షణాలను బలహీనతగాను, చెడ్డతనంగానూ విభజించి అర్థం చేసుకోవడం మంచిది. అది మన విచక్షణ మీద, వివేచన మీద ఆధారపడి ఉంటుంది.
ఇదే విషయాన్ని మనకు భర్తృహరి కూడా చెబుతాడు..
దుర్జనః పరిహర్తవ్యో విద్యాలంకృతోపి సన్ ।
మణినాభూషితో సర్పః కిమసౌ న భయంకరః ।।
ఇది భర్తృహరి సుభాషితం, నీతి శతకం లోనిది.
‘విద్యతో అలంకరింపబడినవాడు అయినప్పటికీ (ప్రతిభ నైపుణ్యాలు పుష్కలంగా ఉన్నవాడు అయినప్పటికీ) చెడ్డవాడిని విడిచి పెట్టాలి. ఎందుకంటే, మణిని కలిగిఉన్నంత మాత్రాన పాము ఎప్పటికీ భయంకరమైనదే కదా!‘ అని దీని భావం.
మహా అయితే తెలివితేటల్ని అభినందించవచ్చు, కానీ చెడ్డవాడు అయితే నెత్తినపెట్టుకోకూడదు. చెడ్డవాడితో స్నేహం పాముతో స్నేహం చేసినట్టే. ఆ స్నేహం సవ్యంగా ఎంతకాలమైనా కొనసాగవచ్చు గాక.. మీ అదృష్టం బాగుంటే ఎప్పటికీ కాటు వేయకపోవచ్చు కూడా. కానీ కాటు వేసే ప్రమాదం నిత్యం పొంచిఉన్నట్టే. ఆ భయంలోనే బతుకుతూ ఉండాలి. అలా జీవితాన్ని పణంగా పెట్టే బదులు.. చెడ్డవారితో స్నేహం చేయకుండా దూరంగా ఉండడమే మంచిది కదా!
.

Discussion about this post