కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా క్షీరాబ్ది ద్వాదశిని పురస్కరించుకుని మంగళవారం తిరుమల వసంత మండపంలో శ్రీ తులసి ధాత్రి సహిత దామోదర పూజ ఘనంగా జరిగింది. మధ్యాహ్నం 3.15 గంటల నుండి 4.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని వసంత మండపానికి వేంచేపు చేశారు. ఎదురుగా లక్ష్మీ, నారాయణుల ప్రతిమలను, తులసి, ఉసిరి వృక్షాలను కొలువుదీర్చారు. ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు మోహన రంగాచార్యులు మాట్లాడుతూ శ్రీ తులసీ ధాత్రి సహిత దామోదర పూజ విశిష్టతను తెలియజేశారు.
కార్తీక మాసంలో ఈ పూజ చేయడం వల్ల పితృదేవతలు విష్ణుసాన్నిధ్యాన్ని చేరుతారని, కోటి జన్మల పుణ్యల లభిస్తుందని చెప్పారు. తులసిని పూజిస్తే గ్రహబాధలు తొలగుతాయని, సకల ఐశ్వర్యాలు చేకూరుతాయని వివరించారు.
అనంతరం కార్తీక విష్ణుపూజా సంకల్పం, బ్రహ్మాది దేవతలకు ఆరాధన చేశారు. ఈ సందర్భంగా పండితులు కృష్ణ అష్టోత్తర శతనామావళిని పారాయణం చేశారు. నివేదన, క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు కృష్ణశేషాచల దీక్షితులు, ఓఎస్డి పాల శేషాద్రి తదితరులు పాల్గొన్నారు.
.
Discussion about this post